అ‘ధనం’పై పునరాలోచన! | Committee recommendations for the next steps | Sakshi
Sakshi News home page

అ‘ధనం’పై పునరాలోచన!

Published Wed, Mar 16 2016 3:39 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

అ‘ధనం’పై పునరాలోచన! - Sakshi

అ‘ధనం’పై పునరాలోచన!

♦  రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల్లో పాత కాంట్రాక్టర్లకే కొత్త పనులపై పునఃసమీక్ష
♦ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు
♦ కమిటీ సిఫార్సుల మేరకు తదుపరి చర్యలు
♦ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు... నేడో రేపో భేటీ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌లో భాగంగా అదనపు పనులను యథావిధిగా పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పెరిగిన పనికి తగ్గట్లే వాటి వ్యయ అంచనాల్లో భారీగా తేడాలున్నప్పటికీ కొత్తగా టెండర్లు పిలవకుండా పాత వారికే అప్పగించడం, ఇందుకు సంబంధించిన జీవోలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండటం, భవిష్యత్తులో ఇది న్యాయపరమైన చిక్కులకు దారితీసే అవకాశం ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించాలనే నిర్ణయానికి వచ్చింది. కొత్త పనలను పాత వారికే అప్పగించాలా లేక కొత్తగా టెండర్లను ఆహ్వానించాలా... ఏ విధానంతో ప్రాజెక్టులకు మేలు చేకూరుతుంది వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్ సబ్‌మిటీ ఏర్పాటు చేస్తూ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 తలకిందలువుతున్న అంచనాలు..  
 ప్రభుత్వం చేపట్టిన రీఇంజనీరింగ్ పనుల కారణంగా కాళేశ్వరం, ప్రాణహిత, దేవాదుల ఫేజ్-3, తుపాకులగూడెం ప్రాజెక్టుల అంచనాల్లో భారీ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. పాత డిజైన్‌తో పోలిస్తే ప్రస్తుత స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన ‘కాశేశ్వరం’ ఎత్తిపోతల అంచనా వ్యయం రూ. 38,500 కోట్ల నుంచి ఏకంగా రూ. 80 వేల కోట్లకు చేరింది. నీటిని తీసుకునే ప్రాంతం మొదలు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, తదనుగుణంగా కాల్వల డిశ్చార్జి సామర్థ్యంలో మార్పులు, అదనపు టన్నెల్ నిర్మాణాలు వచ్చి చేరాయి. దీంతో ప్రతి ప్యాకేజీలోనూ అంచనా వ్యయం వేల కోట్లలో పెరిగింది. కాళే శ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ రిజర్వాయర్ (పాములపర్తి) సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రూ. 659 కోట్ల అంచనా వ్యయం కాస్త రూ. 3,060 కోట్లకు పెరిగింది. అలాగే కొమరవెల్లి మల్లన్న సాగర్ (తడ్కపల్లి) రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఏకంగా ఒక టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు అధికారులు పెంచారు. దీంతో ఏకంగా రూ. 5,800 కోట్లు అదనపు వ్యయం అవుతోంది.

ఇందులో ఇప్పటికే కొండపోచ మ్మ రిజర్వాయర్ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగిస్తూ జీవో 128 విడుదల చేయగా విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3 పనుల విషయంలోనూ వివాదం రేగుతోంది. ఈ ప్రాజెక్టు పాత అంచనా రూ. 531 కోట్లు ఉండగా సవరించిన అంచనాలతో అది రూ. 1,349 కోట్లకు చేరింది. ఇక్కడ సైతం మారిన డిజైన్, పెరిగిన అంచనాలను పక్కనపెట్టి పాత కాంట్రాక్టర్‌తోనే కొత్త పనులన్నింటినీ చేయించాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. కంతనపల్లికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తుపాకులగూడెం బ్యారేజీకి రూ. 3,155 కోట్లతో చేపట్టాల్సిన పనులన్నింటినీ కంతనపల్లి కాంట్రాక్టర్‌కే అప్పగించడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో అదనపు పనుల అప్పగింతపై ఆచితూచి వ్యవహరించాలనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్లుగా తెలిసింది.
 
 ఒకట్రెండు రోజుల్లో సమీక్ష
 మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్ సభ్యులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో సమావేశంకానుంది. ప్రాజెక్టు చేపట్ట్టే సమయంలో ఉన్న అంచనా, అప్పటి స్టాండర్డ్ షెడ్యూల్ట్ రేట్లు (ఎస్‌ఎస్‌ఆర్) ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఎవరికి పనులు ఏ రీతిన అప్పగించాలి అనే విషయాలపై సబ్ కమిటీ చర్చించి నిర్ణయానికి రానుంది. కమిటీ నివేదిక ఆధారంగా కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement