తల్లిదండ్రులు కమలాసన్, సరోజినిలతో ప్రియ
కోజికోడ్, కేరళ : కడుపున పుట్టిన బిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడి...స్వతంత్రంగా బతికితే చాలనుకుంటారు ఏ తల్లిదండ్రులైన. ఏ లోపాలు లేకుండా ఉన్న పిల్లల గురించే ఇంతలా ఆలోచిస్తే...మరి శారీరకంగా, మానసికంగా సరిగా ఎదగని పిల్లల పరిస్థితి ఏంటి...? కన్నవారు బతికున్నంతకాలం వారికి ఎలాంటి ఢోకా లేదు...మరి తల్లిదండ్రుల తదనంతరం వారి పరిస్థితి...? ఇదే ప్రశ్నకేరళకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు ఎన్ కమలాసన్(77), సరోజిని(71) దంపతులను చాలాకాలం నుంచి వేధిస్తుంది. ఎందుకంటే వారి ఏకైక కుమార్తె ప్రియ(37) కూడా బుద్ధిమాంద్యంతో బాధపడుతుంది.
తల్లి సాయం లేకుండా ఏ పని చేసుకోలేదు ప్రియ. అలాంటిది రేపు మేము మరణిస్తే మా కూతురు ప్రియ పరిస్థితి ఏంటనే ప్రశ్నకమలాసన్ దంపతులను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. పోని బంధువులకు ప్రియ బాధ్యత అప్పగిద్దామంటే...ఆస్తి కోసం బంధువులు ఇలాంటి మానసిక వికలాంగులను కనికరం లేకుండా చంపేసిన సంఘటనలు తమ పరిసరాల్లో జరగడంతో ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. మరి దారేంటి అని ఆలోచిస్తున్న తరుణంలో వారికో ఉపాయం తట్టింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేసారు. ప్రభుత్వం కూడా వారి నిర్ణయానికి ఆమోదం తెలపడంతో కొండంత భారం తీరినట్లయిందంటున్నారు కమలాసన్.
ఇంతకు ఈ 77 ఏళ్ల వృద్ధుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన కూతుర్ని సంరంక్షించాలనే షరతుతో తనకున్న ఇళ్లలో ఒక ఇంటిని ప్రభుత్వం వారికి ఇచ్చేశాడు. ప్రభుత్వం ఆ ఇంటిని మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రంగా మార్చాలని కోరాడు. అప్పుడు తన కూతురుతో పాటు మరికొందరు మానసిక వికలాంగులు ఆ ఇంట్లో ఉంటారు. వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు కమలాసన్. వెంటనే తన నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వానికి తెలియజేసాడు. కేరళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కే కే శైలజ వారి నిర్ణయానికి మద్దతు ఇవ్వడమే కాక...మెచ్చుకున్నాడు కూడా.
మంత్రి ఆదేశం మేరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారు కొల్లమ్ జిల్లాలోని కాయిలి గ్రామంలో 83 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కమలాసన్ ఇంటిని స్వాధీనపర్చుకుని దాన్ని మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసుత్తం ఈ ఇంటి మార్కెట్ విలువ 3 కోట్ల రూపాయలు. పది మందికి సరిపోయేలా ఉన్న ఈ ఇంటిని 50 మందికి సరిపోయేలా మారుస్తున్నారు. అంతేకాక ఈ ఇంటికి ‘ప్రియా మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రం’గా నామకరణం చేసారు. ప్రభుత్వం తన కోరికను మన్నిచండంతో కృతజ్ఞతగా కోజికోడ్‌లో ఉన్న 4 కోట్ల రూపాయల విలువచేసే 15 సెంట్ల స్థలంతో పాటు మరో రెండు ఇళ్లను కూడా గవర్నమెంట్‌కు చెందెటట్లు విల్లు రాసాడు కమలాసన్.
ఈ విషయం గురించి కమలాసన్ ‘ప్రభుత్వం నా షరతుకు అంగీకారం తెలపడంతో పెద్ద సమస్య తీరినట్లుగా ఉంది. ధనవంతులకు నేను చేసే విన్నపం ఏంటంటే మీ ఇళ్లలో కూడా బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఉంటే మీరు కూడా మీ ఇంటిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రాలుగా మార్చండి. ఇలా చేయడం వల్ల చాలామంది పేదవారికి కూడా సహాయం చేసినవారవుతార’న్నాడు. 2015లో కేరళ సెక్యూరిటీ మిషన్‌లో భాగంగా చేపట్టిన సర్వేలో రాష్ట్ర జనాభాలో దాదాపు 2.21శాతం మంతి మానసిక, శారీరక వికలాంగులు ఉన్నట్లు తెలిసింది.
కేరళ మెంటల్ హెల్త్ అథారిటి సెక్రటరీ డా. జయప్రకాశ్ కమలాసన్ చేసిన పనిని మెచ్చుకోవడమే కాక కమలాసన్ ఎందరికో ఆదర్శంగా నిలిచాడని పొగిడాడు.
Comments
Please login to add a commentAdd a comment