కేరళలో తీవ్రచర్చనీయాంశంగా మారిన సమాధి కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. కేరళ హైకోర్టు ఆదేశం ప్రకారం.. భారీ బందోబస్తు నడుమ ఈ ఉదయం పోలీసులు సమాధిని తవ్వారు. అందులోంచి గోపన్ స్వామి మృతదేహం వెలికి తీసి శవపరీక్ష కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీకి పరీక్షల కోసం తరలించారు. అయితే ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు బయటపడలేదని తెలుస్తోంది.
తిరువనంతపురం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో నెయ్యట్టింకర(Neyyattinkara) ఉంది. ఆ ప్రాంతంలో గోపన్ స్వామి(Gopan Swami) అనే వ్యక్తి ఉండేవాడు. వయసు మీద పడడంతో కూలీ పనులకు వెళ్లడం మానేసి ఇంటిపట్టునే ఉంటున్నారు. ఆయనను స్థానికులు ముద్దుగా మణియన్ అని పిలుస్తారు. ఆయనకు భార్యా, ఇద్దరు కొడుకులు. దైవ భక్తి ఎక్కువగా ఉన్న మణియన్ స్థానికంగా తనకు ఉన్న స్థలంలోనే ఓ చిన్న ఆలయం కట్టించుకుని.. అప్పుడప్పుడు అక్కడకు వెళ్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీ నుంచి మణియన్ కనిపించకుండా పోయాడు.
.. మణియన్‌కి ఏమైంది? అని చుట్టుపక్కలవాళ్లు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. ఆయన ఆత్మార్పణంతో ధైవసన్నిధికి చేరుకున్నారంటూ చెప్పసాగారు. పైగా ధ్యానముద్రలోనే ఆయన కన్నుమూశారని, అలాగే సజీవ సమాధి అయ్యారని ప్రచారం చేశారు. ఆపై సమాధి వద్ద ఓ పోస్టర్‌ను ఉంచారు. అయితే కుటుంబ సభ్యుల ఈ కదలికలు ఇటు బంధువులకు, అటు స్థానికులకు అనుమానం తెప్పించింది. విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోపు విషయం కలెక్టర్ కార్యాలయం దాకా చేరడంతో.. సబ్ కలెక్టర్ ఆల్‍ఫ్రెడ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
జనవరి 13వ తేదీన సబ్ కలెక్టర్ సమక్షంలో సమాధిని బద్ధలు కొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు సమాధికి అడ్డంగా పడుకుని తవ్వకాన్ని అడ్డుకున్నారు. ఈలోపు విషయం తెలిసిన హిందూ సంఘాలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వాళ్లు తమ ప్రతిఘటన ఆపలేదు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. ఆపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే.. సమాధిని కచ్చితంగా తవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నప్పుడు.. వాటి నివృత్తి జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆఖరికి.. అది కుటుంబ సభ్యులకైనా సరే!. ఇక్కడ సమాధిని తవ్వడం కూడా ఎంక్వైయిరీలో భాగమే అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈలోపు మణియన్ కొడుకులు హైకోర్టులో స్టే పిటిషన్ వేశారు. ఒక మత మనోభావాలను దెబ్బ తీసేలా ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని, తాత్కాలికంగా తవ్వకాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఇది మనోభావాలకు సంబంధించిన అంశం కాదని.. అధికారుల విధులకు భంగం కలిగించడమే అవుతుందని పేర్కొంటూ తవ్వకానికి క్లియరెన్స్ ఇచ్చింది హైకోర్టు.
దీంతో.. ఈ ఉదయం భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆర్డీవో, ఇతర అధికారులు సమాధిని బద్ధలు కొట్టారు.ఆ టైంలో మీడియాతో సహా ఎవరినీ ఆ పక్కకు అనుమతించలేదు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం మాత్రమే అక్కడికి వెళ్లాయి. సమాధిలోపల బూడిదతో పాటు ఏవో పూజలు జరిపినట్లు ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. ఆయన మృతదేహాం పడుకున్న పొజిషన్‌లో ఉందని చెబుతుండడంతో ఈ కేసులో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నెయ్యట్టింకర సమాధి కేసు (Neyyattinkara Samadhi Case)లో మణియన్ సహాజంగానే మరణించాడా? లేదంటే ఏదైనా మతలబు జరిగిందా? అనేది ఫోరెన్సిక్ టెస్ట్ ద్వారా తేలుతుందని అధికారులు అంటున్నారు. ఇక.. శవపరీక్షలు పూర్తయ్యాక మణియన్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సబ్ కలెక్టర్ ప్రకటించారు.
‘‘ఆయన గత రెండేళ్లుగా ఇంటి నుంచి బయటకు రావడం తగ్గించేశారు. పైగా ఆయనకు చూపు సరిగ్గా లేదు. అలాంటి వ్యక్తి తనంతటా తానుగా అక్కడికి ఎలా వెళ్లారు? సమాధిలోకి వెళ్లి ఎలా కూర్చున్నారు?. పూజలు ఎలా చేశారు? ఆయన భార్యాపిల్లలు చెబుతున్నవేవీ నమ్మశక్యంగా అనిపించడం లేదు’’ అని స్థానికులు అంటున్నారు. మరోవైపు ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలని, అప్పుడే అసలు విషయం బయటకు వస్తుందని బంధువులు పోలీసులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టాలో కామపిశాచులు.. అమ్మాయిలూ జర భద్రం
Comments
Please login to add a commentAdd a comment