
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలి మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. అతని తల్లి, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరువనంతపురం సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
వెంజరమూడు(Venjaramoodu) పీఎస్‌కు సోమవారం సాయంత్రం ఓ యువకుడు వచ్చాడు. తాను తన కుటుంబ సభ్యులను చంపినట్లు చెబుతూ పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. అది నిజమేనని తేలడంతో షాక్‌కి గురయ్యారు. ఈలోపు ఆ యువకుడు తనతో తెచ్చుకున్న ఎలుకల మందు తాగి పీఎస్‌లోనే పడిపోయాడు. దీంతో.. అతన్ని చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
పెర్‌ములాలో నివాసం ఉంటున్న అఫన్(Afan).. స్థానికంగా బీఎస్సీ చదివే ఫర్‌సనాతో ప్రేమలో ఉన్నాడు. వాళ్ల ప్రేమకు ఫర్‌సనా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆమెను అఫన్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం తన ఇంట్లో తల్లి షమీ, సోదరుడు అఫ్సన్(13), ఫర్‌సనాపై దాడి చేశాడు. అక్కడి నుంచి బైక్ మీద ఎన్‌ఎన్ పురంలో ఉన్న మేనమామ లతీఫ్(69) ఇంటికి వెళ్లి ఆయన్ని, ఆయన భార్య షాహిదా(59)ను హతమార్చాడు. అక్కడి నుంచి పాంగోడ్‌లో ఉన్న బామ్మ సల్మా బీవీ దగ్గరకు వెళ్లి ఆమెను కూడా చంపేశాడు. 16 కిలోమీటర్ల పరిధిలోనే ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఆపై నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అఫన్.. పక్కన దాడి కోసం బైక్‌పై వెళ్తు క్రమంలో రికార్డైన దృశ్యం
అఫన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి షమీ, ప్రియురాలు ఫర్‌సనా తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరోవైపు.. ఆత్మహత్యాయత్నం చేసిన అఫన్ ఆస్పత్రిలోనూ హల్‌చల్ చేశాడు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగి చికిత్సకు నిరాకరించాడు. దీంతో.. పోలీసుల సాయంతో బేడీలు వేయించి మరి బలవంతంగా అతనికి చికిత్స అందించారు.
అఫన్‌కు డ్రగ్స్ అలవాటు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మత్తులోనే అఫన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తిరువనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. మరోవైపు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని, మంగళవారం అఫన్‌ను విచారణ జరుపుతామని వెంజరమూడు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment