సాక్షి, హైదరాబాద్: అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ నక్సలైట్లలో కలవరం కనిపిస్తోంది. పోలీసులు తమపై ఉన్న పాత కేసులను తిరగదోడుతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. అజ్ఞాతం వీడి వస్తే కేసులన్నీ ఎత్తేసి, పునరావాసం కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. దీంతో మాజీ నక్సలైట్లంతా కలసి సహచర సమన్వయ సమితి (ఎస్‌ఎస్‌ఎస్) పేరుతో సంఘటితం అవుతున్నారని.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ పిలుపు మేరకు..
మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపట్టింది. ఎన్‌కౌంటర్ల వంటివాటితోపాటు లొంగుబాటునూ ప్రోత్సహించింది. లొంగిపోయిన వారికి నగదు రివార్డులు, పునరావాస కల్పన, కేసులు ఎత్తివేత హామీలూ ఇచ్చింది. దీనికితోడు మారుతున్న పరిస్థితులతో గత పదేళ్లలో దాదాపు 1,500 మంది వరకు మావోయిస్టులు అజ్ఞాతం వీడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా.. 2014లో 126 మంది, 2015లో 163, 2016లో 103, 2017లో 92, 2018లో 26 మంది లొంగిపోయారు. నక్సలైట్లకు వారి దళాల్లో ఉన్న హోదాను బట్టి వెలకట్టిన ప్రభుత్వం.. వారు లొంగిపోతే అంతే మొత్తాన్ని రివార్డుగా అందించింది. పలువురికి సబ్సిడీ ట్రాక్టర్లను, సాగు భూమిని పంపిణీ చేసింది. అయితే ఇప్పటికీ వందలాది మంది మాజీలకు పునరావాసం అందలేదు. కేసుల ఎత్తివేత జరగలేదు. అయితే కొద్దిరోజులుగా పోలీసులు తమపై ఉన్న కేసులు తిరగదోడుతుండటంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.
సిరిసిల్ల జిల్లాలో..
‘‘మాజీల విషయంలో ప్రభుత్వం రూటు మార్చినట్లు కనబడుతోంది. పోలీసులు మళ్లీ మళ్లీ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. ప్రవర్తన బాగా లేదంటూ పాత కేసులు తిరగదోడుతున్నారు. కొత్త కేసులు కూడా నమోదు చేస్తున్నారు..’’అని సిరిసిల్ల ప్రాంతంలో దళ కమాండర్‌గా పనిచేసిన ఓ మావోయిస్టు, మరో దళ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇక ‘‘పునరావాసం కల్పించకున్నా.. ఏదో ఒక తీరుగా బతుకుతున్నాం. అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలతో శరీరం సహకరించటం లేదు. కనీసం మందులు కొనేందుకు డబ్బుల్లేవు.. ఇప్పుడు మళ్లీ కేసులు పెడితే ఎట్లా..’’అని ఉపాధి కూలీతో జీవిస్తున్న ఓ మాజీ పేర్కొన్నారు. అయితే.. కౌన్సెలింగ్‌లో భాగంగానే మాజీలను స్టేషన్లకు పిలిపిస్తున్నామని, కొందరిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు పెడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. పంచాయతీ, సాధారణ ఎన్నికల సమయం కావటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాజీలను కౌన్సెలింగ్ పిలుస్తున్నట్లు పేర్కొంటున్నారు.
సహచర సమన్వయ సమితి
పాత కేసులు తిరగదోడటం, మాటిమాటికి కౌన్సెలింగ్ పేరుతో పిలిపిస్తుండటంపై మాజీల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ నక్సలైట్లంతా సహచర సమన్వయ సమితి (ఎస్‌ఎస్‌ఎస్) పేరుతో ఐక్య కార్యాచరణకు నడుం బిగించారు. తమకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పునరావాసం అందనివారికి తక్షణమే లబ్ధి చేకూర్చాలని, పాత కేసులన్నీ శాశ్వతంగా ఎత్తివేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీలు, వారి కుటుంబ సభ్యులకు సమితి తరఫున సాయం అందించనున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసి లొంగిపోయిన మావోయిస్టు ఆధ్వర్యంలో.. ఇటీవలే ఎస్‌ఎస్‌ఎస్ పురుడు పోసుకుందని, సమితి ఏర్పాటుపై ఆయనే సీనియర్ మాజీలందరితో సంప్రదింపులు జరిపారని తెలిసింది.
‘మాజీ’ల్లో కేసుల కలవరం!
Published Sat, Apr 21 2018 3:29 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment