మావోల అలికిడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మావోయిస్టుల కదలికలపై జిల్లా పోలీసులు దృష్టి సారించినట్టు విశ్వసనీయ సమాచారం. పశ్చిమ ఏజెన్సీ పరిధిలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోల వరం పోలీస్ స్టేషన్ల సిబ్బం దిని ఉన్నతాధికారులు అప్రమత్తం చేసినట్టు తెలి సింది. ఇటీవల విశాఖ బాక్సైట్ గనులు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యపై మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం ఆడియో మెసేజి విడుదల చేయడం కలకలం రేపింది. గతంలో మావోయిస్టులు తమ సందేశాలను లేఖలు, గోడ పత్రికల రూపంలో, కొరియర్ల ద్వారా విడుదల చేసేవారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో ఆడియో మెసేజిలను విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం విడుదల చేసిన ఆడియో మెసేజి పోలీసు శాఖలో సంచలనం కలిగించింది. ఆ మెసేజిలో పోలవరం ప్రాజె క్టు నిర్మాణం వల్ల నష్టపోయే గిరిజనుల అం శాన్ని ప్రస్తావిస్తూ.. గిరిజనులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక గిరిజనులను పాలకులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
శబరి ఏరియా కమిటీకి ఈస్ట్ డివిజన్ తోడు
కాగా, పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే గిరిజనుల కోసం మావోయిస్టు శబరి ఏరియా కమిటీ చాలాకాలంగా పోరాటం చేస్తోంది. ఉమ్మడి రాష్ర్టంలో ఖమ్మం జిల్లా కుకునూరు కేంద్రంగా పనిచేసిన ఆ కమిటీ రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా పనిచేస్తోంది. ఇప్పుడు ఆ కమిటీకి తోడుగా మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం తన ఆడియో మెసేజిలో పోలవరం ప్రస్తావన తీసుకురావడంతో పోలీసులు అప్రమత్తమైనట్టు తెలిసింది.
పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టు కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రెండురోజుల క్రితం జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్‌లను సందర్శించారని అంటున్నారు. మావోయిస్ట్ కదలికలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి పోలీస్ ఉన్నతాధికారులు సూచించినట్టు సమాచారం.