100 దినాలు..1000 దిగుళ్లు
సాక్షి, కాకినాడ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారని ప్రజలు నిరసిస్తున్నారు. పగ్గాలు చేపట్టగానే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ నమ్మబలికి, పబ్బం గడిచాక మరిన్ని కష్టాల్లోకి నెట్టారని నిట్టూరుస్తున్నారు. రుణమాఫీపై ఆశలు పెంచుకున్న రైతులు, డ్వాక్రా మహిళలైతే.. బాబుపై కారాలుమిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారంతో వందరోజులు పూర్తయ్యాయి. ఈ నూరురోజుల్లోనే ఆయన నిజస్వరూపం విశ్వరూపంలో వ్యక్తమైందని వివిధ వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. ‘పెనం మీంచి పొయ్యి లోకి దూకినట్టు’ ఈ సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని పదే పదే దిగులు పడుతున్నాయి.
జిల్లాలో రూ.8,480 కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని నాలుగున్నర లక్షల మంది రైతులు ఆశించగా, రుణమాఫీని లక్షన్నరకే పరిమితం చేసి చంద్రబాబు తొలిదెబ్బ కొట్టారు. పోనీ, అలాగైనా రూ.3500 కోట్లమేర రుణాలు మాఫీ అవుతాయనుకున్నా.. ఇంతవరకూ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా మాఫీ కాలేదు. ఇక జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకున్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆశించిన 9.50 లక్షల మంది మహిళలనూ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పరిహసించారు. మాఫీ కాదు..రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే ఇస్తామని హతాశుల్ని చేశారు. కనీసం ఆ మొత్తమైనా ఎప్పుడు జమవుతుందో తెలియక వారంతా ఆందోళన బాటపట్టారు.
జాడలేని తొమ్మిది గంటల విద్యుత్
అధికారంలోకి రాగానే రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలో 34,570 ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. తొమ్మిది గంటల స్థానంలో ఏడుగంటలంటూ మాట మార్చిన బాబు అక్టోబర్ 2 నుంచి సరఫరా చేస్తామంటూ వాయిదా వేశారు. ప్రస్తుతం ఏడు గంటలు కాదు కదా కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించడం లేదు.
‘సుజల స్రవంతి’కి సొమ్ములు కరువు
ప్రతి కుటుంబానికీ రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తానని ఇచ్చిన హామీ కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. అక్టోబర్ 2 నుంచే ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పేరిట అమలుచేయ తలపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ‘సొమ్మొకడిది..సోకొకడిది’ అన్నచందంగా కార్పొరేట్ సంస్థలు, దాతల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది.
ఇంటికో ఉద్యోగం కాదు.. ఉద్యోగులే ఇంటికి
అధికారంలోకి రాగానే ఇంటికోఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దాని మాటెలా ఉన్నా ఉద్యోగాల్ని ఊడబీకే ఉద్యమం చేపట్టినట్టున్నారు. జిల్లాలో 10 వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లను, వెయ్యిమందికి పైగా ఆదర్శ రైతులను, ఏడొందలమందికి పైగా గృహ నిర్మాణశాఖ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కొలువులను రద్దు చేసి, ఇంటికి సాగనంపారు. ఇక అర్హులైన నిరుద్యోగులకు రూ.2 వేల భృతి ఇస్తామన్న హామీ అటకెక్కింది.
సర్వే పేరుతో పేదల గూటికి చేటు..
అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు లక్షన్నరతో, సెంటున్నర భూమిలో ఇల్లు కట్టి ఇంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. పగ్గాలు చేపట్టి మూడు నెలలైనా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ఇల్లు నిర్మించిన దాఖలా లేదు. పైగా ఇందిరమ్మ లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుని జిల్లాలో 10,448 ఇళ్లను రద్దు చేసేందుకు సర్వే చేయిస్తున్నారు.
ఆధార లంకెతో పింఛన్లకు కోత..
వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు పెంచుతామన్న బాబు ఆ హామీ అమలకు వాయిదా మంత్రం జపిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయని ఆయన సర్కార్ ఉన్న పింఛన్లకు ఆధార్ లంకె పెట్టి, కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా.. ఎన్నికల ముందు మాదిరిగానే బాబు తన మాయ మాటలతో ప్రజలను ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్మార్ట్‌సిటీలు, ఐటీ హబ్, పెట్రో కారి డార్‌లంటూ మాటలను కోటలు దాటిస్తున్నారు. నూరురోజుల ఏలుబడిలో..ఎన్నికల హామీలను అణుమాత్రం అమలు చేయని చంద్రబాబు ఇప్పటికీ అరచేతిలో వైకుంఠం చూపే తన గారడీని నమ్ముతారనుకోవడం భ్రమేనని జనం నిరసిస్తున్నారు. ఇకనైనా ‘కోతలు’ మాని, ఎన్నికల హామీల్ని చేతల్లో చూపాలని కోరుతున్నారు.