గుత్తి/గుత్తి రూరల్/ బుక్కపట్నం : రుణ మాఫీకి షరతులు విధించడంపై డ్వాక్రా మహిళలు కన్నెర్రజేశారు. మాట తప్పితే తమ ఉసురు కొట్టుకుని పోతారంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. నమ్మించి నిండా ముంచారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గుత్తి, బుక్కపట్నం మండల కేంద్రాల్లో సోమవారం డ్వాక్రా మహిళలు రుణ మాఫీ కోసం ఉద్యమించారు.
ఊబిచెర్లలోని 28 స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలు దాదాపు 400 మంది గుత్తిలోని సిండికేట్ బ్యాంకును గంటన్నరపాటు ముట్టడించారు. బ్యాంకు సీనియర్ మేనేజర్ రెజితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్యాంకు వద్ద నుంచి ఎస్‌బీఐ, రాజీవ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ర్యాలీతో వెళ్లి గాంధీ సర్కిల్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన ‘రుణ మాఫీ’ హామీని నమ్మి ఆయన్ను అందలం ఎక్కించడంతో పాటు బ్యాంకులకు కంతుల చెల్లింపు ఆపేశామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు మొహం చాటేస్తున్నారని విమర్శించారు.
రుణమాఫీ ఆలస్యం కావడంతో తమ పొదుపు ఖాతాల్లోని సొమ్మును తమ ప్రమేయం లేకుండానే కంతులకు జమ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాహన రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడా కాసేపు ధర్నా చేశారు. పైసా కూడా తాము చెల్లించేది లేదని, రుణాలన్నీ షరతులు లేకుండా మాఫీ చేసే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు.
తొలుత ఇందిరక్రాంతి పథం (ఐకేపీ), తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించి, అక్కడే కాసేపు ధర్నా చేశారు. రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో ఐదారు నెలలుగా కంతులు చెల్లించలేదని, ఇప్పుడు అపరాధపు వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకు, ఐకేపీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారన్నారు. రుణ మాఫీ చేయకుండా.. బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడికి గురి చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. వీరి ఆందోళనకు సీపీఐ మండల కార్యదర్శి బ్యాళ్ల అంజి మద్దతు తెలిపారు.
నమ్మించి మోసం చేస్తారా?
Published Tue, Sep 9 2014 1:46 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement
Advertisement