అవనిగడ్డ, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన కోరారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జి సింహాద్రి రమేష్‌బాబు స్వగృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
రైతు రుణమాఫీ విషయంపై ఇప్పటికే చంద్రబాబు డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన జరగక ముందు ఈ వాగ్దానం చేశానని రైతులను వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేసేంత వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించటంతో పాటు ఫ్యాను గుర్తునే కేటాయించటం స్వాగతించదగిన పరిణామమన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నాయకులు మైండ్‌గేమ్ ఆడుతున్నారని, అయితే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలెవరూ టీడీపీ వైపు మొగ్గుచూపే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమించటంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయటం, రాబోయే కాలంలో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కల్పన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కడవకొల్లు నరసింహారావు, పార్టీ నాయకుడు మిక్కిలినేని మధు తదితరులు పాల్గొన్నారు.
బాబు హామీలు నిలుపుకోవాలి
Published Wed, May 28 2014 2:09 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement