p vijay babu
-
వీరు నేరస్థులా?
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని వ్యవస్థీకృత నేరస్థులుగా చిత్రించే ప్రయత్నాలు ప్రమాదకరం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సెక్షన్లలో లేని శిక్షలను పేర్కొంటూ వచ్చిన ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాలకు వక్ర భాష్యం చెప్పే విధంగా ఉన్న అటువంటి వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అనిపిస్తోంది.సోషల్ మీడియా కార్యకర్తలు వ్యవస్థీకృత నేరస్థులని అందునా, ఒక పార్టీకి చెందిన వారి కోసం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏర్పాటయింది అనేటువంటి రీతిలో ఒక పత్రికలో వార్త చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, సెక్షన్లలో లేని శిక్షలు, అన్వయం కానివారికి అన్వయిస్తారు. ‘ఖబడ్దార్’ అనే రీతిలో భూతద్దంలో చూపించి భయభ్రాంతులను చేసే విధంగా, చట్టాలకు వక్రభాష్యం చెప్పే విధంగా ఉన్న ఆ వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అని పించింది. అందుకే అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111లో ఏముంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కాగా, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని ఎడాపెడా కేసులు బనాయిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. భారత అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పుల్లో ఇదే సత్యాన్ని స్పష్టం చేసింది. అంతెందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఒక హెచ్చరిక జారీ చేసింది. చట్టాలకు అతిశయోక్తులు జోడించి చెప్పటం, వక్ర భాష్యాలు చెప్పడం నేరం. చిన్న నేరాలకు సంబంధం లేని సెక్షన్లు పెట్టిన పోలీసు అధికా రులపై చర్యలు తీసు కున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 విషయానికి వచ్చినట్లయితే ఈ సెక్షన్ కింద సోషల్ మీడియాలో ఏ విధమైన పోస్టులు చేసినా వాళ్లకు భారీ శిక్షలు తప్పవు అని అర్థం వచ్చే రీతిలో ప్రచురితమైన వార్తను చూసినప్పుడు అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే, ఆ వార్తలోని అర్ధ సత్యం అర్థం అవుతుంది. కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూ దోపిడీ, కాంట్రాక్ట్ హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడటం సెక్షన్ 111 కిందికి వస్తాయి. సైబర్ నేరాలు అంటే... ఎవరైనా వ్యక్తులు గానీ, ఒక వ్యక్తి గానీ ఒక సమూహ గౌరవానికి, ఒక వ్యక్తి గౌరవానికీ భంగం కలిగించే విధంగా కానీ; శారీరకంగా, మానసికంగా బాధపెట్టే విధంగా కానీ ప్రవర్తిస్తే, అది ఐటీ చట్టం–2000 ప్రకారం సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది. విస్తృత ప్రజా ప్రయోజనాలతో కానీ, విశ్వసనీయ సమాచారంతో కానీ ప్రచురించినా, ప్రసారం చేసినా అది ఐటీ చట్టం కింద నేరంగా పరిగణించటం సాధ్యం కాదు. ఇటువంటివే మరి కొన్ని మినహాయింపులు ఈ చట్టపరిధిలో ఉన్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడీని దొంగిలించటం లేదా అతని అకౌంట్ మొత్తం హ్యాక్ చేయడం, ఈ–మెయిల్ పాస్వర్డ్ దొంగిలించి తద్వారా తప్పుడు మెసేజ్‌లు బయటికి పంపడం, అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి పంపడం; దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా నేరా లకు పాల్పడటం వంటివన్నీ సైబర్ నేరాలుగా పరిగణి స్తారు. సమాజంలో జరుగుతున్న వ్యవహారాన్ని వార్తలుగా కానీ రాజకీయ పరమైన విమర్శలుగా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి ఈ చట్టాలను ఆపాదించడం సరికాదు. ఇక వ్యవస్థీకృత నేరం అంటే, నేర కార్యకలా పాల్లో సిండికేట్ సభ్యునిగా లేదా ఉమ్మడిగా వ్యవహరించే ఏ వ్యక్తీ లేదా వ్యక్తుల సమూహం... హింసకు పాల్పడటం, బెదిరింపు, బలవంతం లేదా ఏదైనా ఇతర చట్టవిరు ద్ధమైన మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాన్ని పొందడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది. మరి ఇవన్నీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలా వర్తింపచేస్తారో గౌరవ న్యాయ స్థానాలే నిర్ణయించాలి. ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాన్ని కొనసాగించడం’ అంటే చట్టప్రకారం నిషేధించబడిన పనులు చేయడం. ఇందుకు గాను మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తారు. ఏ వ్యక్తి అయినా ఒక్క రుగా లేదా ఉమ్మడిగా, వ్యవస్థీకృత నేర సిండికేట్ సభ్యు నిగా చేస్తే, అదీ పదేళ్ల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇవి నేరాలకు అన్వయం కానీ రాజకీయ విమర్శలకు వర్తించవు.ఇక సోషల్ మీడియాకి సంబంధించిన శిక్షలు అంటూ కొన్ని సెక్షన్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సెక్షన్లు దేనికి అన్వయం అవుతాయో భారతీయ న్యాయ సంహిత ప్రకారం పరిశీలిద్దాం. ఐటీ యాక్ట్ 67 ప్రకారం... నేరాలకు పాల్పడిన వారికి అంటూ, వీరు దేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ఈ సెక్షన్ కింద ఐదేళ్ల జైలు శిక్ష, 70 లక్షల జరిమానా ఉంటుంది అని రాశారు. అసలు వాస్తవం పరిశీలిస్తే, 67 ప్రకారం రాజకీయపరమైన విమర్శలు ఈ చట్ట పరిధిలోకి రావు. అశ్లీల దృశ్యాలు ప్రచు రించినా, ప్రసారం చేసినా ఈ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా ఉంటుంది. వేరే వ్యక్తి పేర అకౌంట్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా కానీ మోసం చేయడం, ఇన్‌కమ్‌టాక్స్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సెక్షన్ 66డీ కిందకి వస్తుంది.ఈ నేరాలకు పాల్పడిన వారికి లక్ష జరిమానా, మూడు వేల జైలు. ఇక సెక్షన్ 356 ప్రకారం పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుంది. అయితే పరువు ప్రతిష్ఠ కేసులకు సంబంధించి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఇందులో కూడా విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న, నమ్మ దగిన సమాచారం ఉన్నా, సత్యనిష్ఠకు సంబంధించి రుజువు చేయగలిగితే అది డిఫమేషన్ కిందికి రాదు.అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1 )ఏ అండగా నిలుస్తుంది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతి రేకెత్తించడం, మహిళల్ని కించపరచటం కచ్చితంగా నేరాలే! ఈ నేరాలకు ఎవరు పాల్పడినా వాళ్లను శిక్షించవలసిందే! ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు కానీ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రత్యేకంగా ఒక పార్టీకో, ఒక పార్టీలో సోషల్ మీడియా వారి కోసమో నిర్దేశించినట్టుగా వార్తలు రాయడం సత్యనిష్ఠకు వ్యతిరేకం, భంగకరం. చట్టం ముందు అందరూ సమానులే! చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు కచ్చితంగా శిక్షార్హులే! అంచేత చట్టాల ఉల్లంఘనకు పాల్పడే వారిని రాజకీయాలకు అతీ తంగా శిక్షించడానికి పూనుకున్నప్పుడు సమాజం హర్షిస్తుంది. కాదంటే న్యాయ పరిరక్షణలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. వారు ఏ స్థాయిలో ఉన్నా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదు. పి. విజయ బాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు -
అక్షరానికి సంకెళ్లు నిలవగలవా?
నిజాలు చెప్పినందుకు కలాలకు సంకెళ్లు వేస్తామంటే, ఆ కలాలు వెన్ను చూపుతాయా? మరింత పదునెక్కి మును ముందుకు సాగుతూ అక్ష రాస్త్రాలని ‘నారాచాలు’గా సంధిస్తాయా? ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికల గొంతు నొక్కేయాలని యత్నించిన నియంతలు చరిత్రలో ఎలా మిగిలిపోయారో తెలియంది ఏముంది? భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛకు ఇచ్చిన హక్కులేమిటో, కోర్టులు ఎన్నిసార్లు తమ తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయో తెలుసుకుంటే పత్రికల గొంతు నొక్కేయాలని ఎవరూ ప్రయ త్నించరు. ఒకవేళ అధికార గర్వంతో అలా చేసినా చివ రికి చరిత్రలో అప్రజాస్వామిక వాదులుగా వారే మిగిలి పోతారు. కేసులు మాత్రం కొట్టి వేయబడతాయి.పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని లక్నోకి చెందిన కేసులో సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపర మైన హక్కుల గురించి ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేయరు. గడిచిన మే నెలలో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్æ అరెస్టుని సుప్రీంకోర్టు ఖండిస్తూ అతనిపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవనీ, వాటికి హేతుబద్ధత లేదనీ వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలపై విశ్లేషణ చేయకుండా అరెస్టు చేయటం సరికాదని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ‘మోహిత్ అండ్ శ్యామ్ చందక్’ కేసులో ఆదేశించింది. జర్నలిస్టు అభిజిత్ అర్జున్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ... అసలు ఈ అరెస్ట్‌కి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఎంక్వయిరీ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. డిప్యూటీ కమిషనర్ హోదా కలి గిన అధికారులతో విచారణ జరిపించి ఎనిమిది వారాల్లోగా ధర్మాసనానికి నివేదించాలని ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసుల్ని ఉదాహరించవచ్చు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రభుత్వాలు తమ కున్న తాత్కాలిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు నచ్చని వార్తలు ప్రచురించే జర్నలిస్టులను, ప్రసారం చేసే జర్నలిస్టులనూ అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వ డంతో పోలీసులు తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించవలసి వస్తోంది. అయితే ఈ అక్రమ అరెస్టుల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఏ పోలీసులైతే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది అలా ఉంటే, తమ అధికారానికి ఎదురు లేదని వ్యవహరించే పాలకులు సైతం జర్నలిస్టుల మీద దాస్టీకానికి పూనుకుంటే... వారు సైతం అందుకు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ దేశంలో జర్నలిస్టులకు.... రాజకీయ నాయకులకు ఉన్న సౌఖ్యం, వసతులు, ఆర్థిక పరిపుష్టి లేకపోవచ్చు; కానీ వారిని మించిన బలమైన శక్తులు జర్నలిస్టులే అనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. నాయకుల అధికారం తాత్కాలికం. కానీ వృత్తి జర్నలిస్టులు ఒకసారి జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఒడిదు డుకులు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా , ఎలాంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా, ఎలాంటి నష్టాలకు ఎర కావాల్సి వచ్చినా ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకే తిక విప్లవం వచ్చిన తర్వాత... రాతపూర్వక, మౌఖిక, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి సమాచార వ్యాప్తి సులభతరమైంది. ఫలితంగా పార దర్శకత లేని ప్రభుత్వాలకూ, నిజాయితీ లోపించిన వ్యక్తులకూ ఇబ్బందిగా మారింది. దాంతో మీడియాపై దాడికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకున్నారు వీరు. అందులో ప్రధానమైనది ‘పరువునష్టం చట్టం.’ ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం కిందికి వస్తుంది. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం ఇది నేరం. ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం, టెక్ట్స్, ఇమేజ్, కార్టూన్లు, క్యారి కేచర్లు ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. దీని ఆసరాతో తమకు అనుకూ లంగా వార్తలు లేకపోతే, పరువునష్టం దావా వేయ డానికి తయారవుతారు.వీళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే... విమర్శ సదుద్దేశంతో చేసినా, విస్తృత ప్రజాప్రయోజ నాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కిందికి రాదు. మీడియాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బలంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ హరించలేవని కోర్టు తీర్పులు అనేకం వున్నాయి. తాత్కాలిక అధికార గర్వంతో మీడియా మీద వీరు పెట్టే కేసులు కొంత కాలానికి కొట్టి వేయబడతాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి పత్రికలు, మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ స్వేచ్ఛ, ఒకరి అభిప్రాయాన్ని ప్రచారం చేసే లేదా ప్రచురించే హక్కు ఉన్నాయి.జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ చేసే హక్కు జర్నలిస్టులకు ఉంది. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో జైలులో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి పత్రికలు ప్రయత్నించాయి. చారులతా జోషి (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు లేదా ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.ఇన్ని హక్కులు ఉన్న జర్నలిస్ట్‌లను కేవలం చిన్న ఉద్యోగస్తులు అనుకోవడం పొరపాటు. వాళ్లు ప్రజా స్వామ్య సౌధానికి వాచ్ డాగ్స్ అని గమనించాలి. ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేవారు చట్టాలకు లోబడి నడుచుకోవాలే కాని మనకు ఎదురేముంది? అనుకుంటే ఇటు ప్రజా కోర్ట్, అటు జ్యూడిషియల్ కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రపంచంలో హిట్లర్ లాంటి నియంతలు కూడా ‘నేను 1000 ఫిరంగులకి భయపడను కానీ ఒక కలానికి భయపడతాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
ఇది... పెగ్గా సెస్!
ఉండిలో అంతసేపు ఉండి వాళ్లతో విసిగి వేగి వేసారి ఇంటికి వచ్చిన చంద్రయ్యకు ఇల్లంతా హడావుడిగా కనిపించింది. రామయ్య, అచ్చయ్య,వెంకన్నలాంటి వాళ్లతో పాటు వకీళ్లు కూడా కనిపించారు. వాళ్ళ హడావిడితో పాటు సంటోడి ముఖంలో ఆందోళన చూసేసరికి ఏం అర్థం కాలేదు. ‘‘ఏటయ్యింది?’’ అడిగాడు. అయినా అంతా నిశ్శబ్దం. ఎవరి నోటి నుంచి బదులు రాలేదు. ‘‘సెస్! అడుగుతున్నది మిమ్మల్నే. అంతా బెల్లం నోట్లో ఎట్టుకున్నట్టు మాహాడరే?’’ సున్నితంగా గద్దించాడు. ‘‘అయ్యా! అది కాస్తంత ఇబ్బందికర పరిస్థితి’’ వకీలు రవీంద్ర గంభీర వదనంతో పలికాడు. ‘‘అదేనయ్యా అదేటో సెప్తేనే కదా తెలిసేది? గౌరమ్మా ఏటైనాది? నువ్వైనా సెప్పు’’ అన్నాడు దూరంగా ఉన్న భార్య వైపు చూస్తూ. ‘‘అది ఏటంటే... మన సంటోడు పోన్లో మాట్లాడే దంతా ఇనేత్తున్నారంట. ఒకేపు కేసులు గట్రా ఉన్నాయి గందా? అదేదో పెగాసస్ అంట. దాంతో మన సంటోడు పోన్లో దూరి మొత్తం ఇనేస్తున్నారంట’’ సస్పెన్స్‌కి తెరదించుతూ భార్య గౌరీ చెప్పింది. ‘‘మీరేం కంగారు పడకండి. ఈ సంగతి ఢిల్లీకి కూడా కంప్లైంట్ చేశా’’ అన్నాడు రవీంద్ర కోటు, టై సవరించుకొంటూ. ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు చంద్రయ్య. వెంటనే రామయ్య అందుకుంటూ, ‘‘ప్రెస్ మీట్ కూడా పెట్టాం. అధికార పార్టీ కుట్రని కడిగిపారేశాం’’ అన్నాడు అచ్చయ్య వైపు మెచ్చుకోలుగా చూస్తూ. ‘‘అంతేకాదు రేపు ఆందోళన కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశాం’’ అచ్చయ్య ఉత్సాహంగా పలికాడు. ‘‘ఇది దేశంలోనే అతి పెద్ద కుట్ర’’ వెంకన్న ఆవేశంగా పలికాడు. ‘‘అసలు ఈ పెగా సెస్సు...’’ ఎప్పటిలాగే కాగితాలు ఏవో చూపుతూ పొట్టాభి ఏదో చెప్పబోయాడు. చంద్రయ్యకు ఆగ్రహం తన్నుకొచ్చింది. అవ్యక్తమైన ఉద్వేగాన్ని అణచుకొంటూ ‘‘సెస్! ఊరుకొండెహె. అంతా మీ మానాన మీరు చేసుకెల్లి పోవడమేనా? కనీసం ముందు నాతో ఒక ముక్క సెప్పాలని తెల్దేటి? పెతివాడికి అతి ఉత్సాహం!’’ చంద్రయ్య తనని తను తమాయించుకొని, ‘‘సరే సరే. ఢిల్లీ లెవెల్ దాకా తీసుకెల్లారన్నమాట. సర్లే ఆ తర్వాత ఎలా ముందుకు బోవాలో రేపు చర్చిద్దాం వెళ్ళండి’’ అన్నాడు కూల్ గా. ‘‘నువ్వూ ఎల్లి తొంగో’’ అన్నాడు సంటోడితో. ‘‘ఏటీ అలా సిటపటలాడిపోతున్నారు. ఎండదెబ్బ కొట్టేసి నాదా?’’ అన్నది గౌరీ దగ్గరకొస్తూ. ‘‘నాక్కాదు నీ కొడుక్కి కొట్టినాది. నేను అలా కాస్త బయిటికి ఎల్లొస్తే చాలు. ఏదో ఒక పేడ తట్ట ఎట్టేస్తాడు. అవునే నాకు తెలవక అడుగుతాను. ఆడి పోను హ్యాకింగ్ చేసేవాడు ఎవడుంటాడు?’’ ‘‘అంటే వాడి ఫోను హ్యాకింగ్ అవలేదా?’’ చిరుకోపం ప్రదర్శిస్తూ అడిగింది గౌరీ. ‘‘సెస్. మల్లీ అదే మాట. వాడి ఫోనుతో ఎవరికి పనే? ‘‘మరెవరికి పని?’’ రెట్టించింది గౌరీ. ‘‘ఇంకెవరికి? నాకు, నీకు, కాదంటే కోడలు పిల్లకు’’ ‘‘అంటే ఏటి మీరు అనేది?’’ అనుమానంగా చూస్తూ అడిగింది గౌరీ. ‘‘మరేటుంది? నేనే చేశాను. అంతా నేనే చేశాను. ఒకేపు నేను వాడి కోసం పడరాని పాట్లు పడుతూ, నానా తిట్లు తింటూ, ఎండలో తిరుగుతూ ఉంటే, ఈడేమో ఏసీలో తొంగొని, 24 గంటలు ఫోన్‌తో కాలం గడిపేస్తుంటాడు. అసలు ఆ ఫోన్లో ఏటుందో తెలుసుకుందామని నేనే ఆ పని చేశా! తీరా ఫోన్లో సమాచారం మరి ఏటున్నదో తెలుసా?? ఫోన్ అంతా అమెరికా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, వీడి వీర గాథలు, సిగ్గీలు, జొమాటోల ఆర్డర్లు. ఈ మధ్య కాస్త ఎండలో తిరగటం మొదలెట్టిన దగ్గర నుంచి ఫోన్ అంతా సిగ్గీ ఆర్డర్లే. సిగ్గు లేకపోతే సరి. ఈ సమాచారం తెలుసుకొని ఎవరైనా ఏం చేసుకుంటారు? ఇంత హడావిడి జరుగుతున్నా బాధ్యత లేదు. ఓ ఎదవ హడావిడి తప్ప. పోనీ నాతో పాటు తిప్పుకుందాం అంటే, ఎక్కడ ఏ పేడతట్ట ఎత్తాడో అని భయం’’ అంటూ అసలు సంగతి బయట పెట్టే సరికి గౌరీ అవాక్కయిపోయింది. పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
పవన్ అప్పగింతలు–కుప్పిగంతులు
పవన్ కల్యాణ్ పార్టీ వ్యవ హారం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ పరిశీలిస్తే బహుశా ఇలాంటి పార్టీ భారతదేశంలోనే ఎక్కడా మనకు కనిపించదేమో అని పిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో పార్టీని పదేళ్లు నడిపాను అంటూ తరచు మాట్లాడుతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు అయి ఉండొచ్చు కానీ పట్టుమని చెప్పుకోదగిన స్థాయిలో పది కార్యక్రమాలైనా ఉన్నాయా అంటే చెప్ప డానికి ఆ పార్టీ కార్యకర్తలే తడబడతారు. ఎందుకంటే పదేళ్లు పూర్తిగా నడిపింది పార్ట్ టైం పాలిటిక్స్. పార్ట్ టైం ఉద్యోగాల గురించి విన్నాంగానీ పార్ట్ టైం రాజకీయాలను పరిచ యం చేసింది మాత్రం పవన్ అనే చెప్పాలి. పోనీ ఆ పార్ట్ టైం కార్య కలాపాలైనా ఆయన నిర్వహించారా అంటే అదీ లేదు. తను జస్ట్ గెస్ట్ ఫాకల్టీ మాత్రమే! సినిమాల్లో ఒక మాస్ హీరోలా ఎలా నటి స్తారో... అదే సంస్కృతి (ప్రక్రియ)ని రాజకీయల్లో కూడా చొప్పించి తన ఘనత చాటుకున్నారు. సినిమాలో హీరో చేసే ఫైట్లు, ఫీట్లూ అన్నీ డూప్. పాడే పాటలూ ఆయన పాడరు. కానీ ప్రేక్షకులకు హీరోనే ఇవన్నీ చేస్తాడని అనిపిస్తుంది. ఇదే ఫార్ములా రాజకీయాలకి అప్లై చేశారు పవన్ కల్యాణ్. పార్టీని ప్రారంభించి దాని నిర్వహణ బాధ్యత నాదెండ్ల మనోహర్‌కి అప్పజెప్పారు. ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడాలన్నా, విలేకరులు అడిగిన ప్రశ్న లకు జవాబు చెప్పాలన్నా నాదెండ్ల మనోహర్ ఇన్పుట్స్ ఇస్తే తప్ప జవాబు చెప్పలేని పరిస్థితి. ఉపన్యాసాలు ఇవ్వాలంటే ఎవరో రాసిచ్చిన ఉప న్యాసాలకు హావభావాలు జోడించడం మాత్రమే పవన్ చేసే పని. ఫైనల్‌గా సినిమాను డిస్ట్రిబ్యూటర్‌కు అమ్మే సినట్టు పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారు. పార్టీ కార్యకర్తల చేతుల్లో తెలుగుదేశం జెండాలు పెట్టారు. చెప్పులేసుకుని తిరిగే వాళ్ళను చట్ట సభలకు పంపిస్తానని చెప్పి వాళ్ళ చేతుల్లో చివరగా చిప్ప పెట్టి కోటీశ్వరులకు టిక్కెట్లు ఇచ్చేసు కున్నారు. పైగా తన పార్టీలో ఎవరెవరు నించో వాలి అనే నిర్ణయాధికారాన్ని కూడా చంద్రబాబుకే అప్ప జెప్పే శారు. అచ్చంగా డిస్ట్రిబ్యూటర్ ఏ ఏ థియేటర్స్‌కు సినిమా రిలీజ్ చేయాలో నిర్ణయించినట్టు! సాక్షాత్తు తను పిఠాపురంలో పోటీ చేసే చోట పట్టుమని నాలుగు రోజులు తిరిగే ఓపిక కూడా లేక ఆ బాధ్యతనూ వర్మ చేతిలో పెట్టేశారు. వాలంటీర్లను నోటికొచ్చినట్టు తిట్టి, అవ్వ తాతల్ని మండుటెండలో అష్ట కష్టాలు పెడుతూ తను మాత్రం గంట కూడా ఎండలో తిరగలేక స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ చెక్కేస్తున్నారు. ఈ విచిత్ర విన్యా సాలు, విపరీత పోకడలకు జన సైనికులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీర మహిళ లైతే ఒక అడుగు ముందుకు వేసి, ‘‘మాటలు కోటలు దాటిస్తున్నాడు. మానాభిమానాల్ని మాత్రం ‘కోట’లో దాచి పెడు తున్నాడు’’ అంటూ నర్మగర్భంగా టీవీ చర్చల్లోనే వ్యాఖ్యా నించటం గమనార్హం! పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
ఇదెక్కడి మేధావితనం?
గతంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో, ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అనే నినాదం గోడల మీద విస్తృతంగా దర్శనం ఇచ్చేది. ఆ నినాదం నిజమైందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రపంచంలో ఉన్న ఒక వర్గం ‘మేధావులంతా ఏకం కండి!’ అనే నినాదాన్ని అంది పుచ్చుకొని వాళ్లంతా ఏకమవుతూ తమ సర్వశక్తుల్నీ ఒడ్డుతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అలియాస్ జేపీ హైదరాబాదు నుంచి విజయవాడ విచ్చేసి, ప్రెస్‌మీట్ పెట్టి తన మద్దతు ఎన్డీయే కూటమికే అంటూ దానికి బహు నిర్వచనాలు ప్రవ చించారు. అంతటితో ఆగకుండా ‘గాంధీ మహాత్ముడు, అంబేడ్కర్లకు కులం అంటగడతామా?’ అంటూ పరోక్షంగా తను కూడా అంతటి మహాత్ము డినే అని ప్రకటించుకున్నారు. అక్కడే చంద్రబాబుతో అంటకాగడంలో అపరాధ భావం ప్రస్ఫుట మవుతోంది. ఇంకా త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి పంతులు పేర్లు కూడా ఉటంకించారు. అసలు ఆయన మాట్లాడేదానికీ, ప్రస్తుత రాజకీయాలకూ; నాటి సంఘ సంస్కర్తలూ, భాషా వేత్తలైన త్రిపురనేని, గిడుగులకు సంబంధం ఏంటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఈ జేపీ లోక్‌సత్తా పార్టీని ఎప్పుడో చుట్ట చుట్టే శారు. లోక్ సత్తా ఇకపై రాజకీయ పార్టీ కాదని ప్రకటించేశారు కూడా! అయితే, చంద్రబాబు కోసం అర్జెంటుగా మళ్లీ పార్టీని వెలుగులోకి తెచ్చారు కాబోలు! నిజానికి ఈ పార్టీ పుట్టుక పరిశీలిస్తే, ఒక దశలో చంద్రబాబు నాయుడుతో రామోజీరావుకి తేడాలు వచ్చి, ‘‘నేను కింగ్ మేకర్ని. ఎన్టీఆర్ నుంచి పీఠాన్ని అప్పజెప్పింది నేను. అటువంటిది నాకే ‘మింగుడు పడకపోతే’ ఎలా? మీలాంటి వాడిని జాతీయ స్థాయిలో మరొకడిని తయారుచేస్తా!’’ అని ఈ జేపీని తెర మీదకు లోక్‌సత్తా పేరుతో తీసుకురావ డంలో రామోజీరావు కీలక పాత్ర వహించారని అంటారు పరిశీలకులు. అందుకే కాబోలు! అప్పట్లో ‘ఈనాడు’లో జేపీ వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చేవి. ఆ పబ్లిసిటీ ప్రభావంతో విద్యావంతులు చాలా మంది లోక్‌సత్తా పట్ల ఆకర్షితులయ్యారు. అయితే జేపీ ‘హై వోల్టేజ్ యారగెన్సీ’కి షాక్ అయి స్వల్పకాలంలోనే జారుకున్నారు. జేపీని ఒకసారి గెలిపించిన హైదరాబాద్ కుకట్పల్లి ప్రజలు కూడా అతడి మేధా అహంకారానికి బెదిరిపోయారు. కాగా, మల్కాజ్‌గిరిలో మైండ్ బ్లాక్ అయ్యే జవాబు ఇచ్చారు జనం. దాంతో రాజకీయాలకు దూరంగా తన మేధాతనాన్ని అప్పుడప్పుడు మాత్రమే ప్రదర్శిస్తూ రోజులు గడుపుతున్నారు జేపీ. ఎంతైనా పబ్లిసిటీకి అలవాటైన ప్రాణం కదా! పైగా తను పేద్ద లౌకిక వాదినని కూడా చాటుకోవాలయ్యె! అందుకే, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఒకసారి పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ అంటూ నాలుగు రోజులు హడావిడి చేసి మళ్లీ సైలెంట్ అయి పోయారు. ఆ మధ్య జగన్ ప్రభుత్వంలో పథకాలను ప్రశంసించారు. ఇప్పుడు మళ్లీ ‘ప్రపంచ మేధా వులారా ఏకం కండి!’ అన్న నినాదాన్ని అంది పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతుగా ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే, గాంధీ, అంబేడ్కర్, వైశ్య కులం, దళిత కులం; త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి అంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెడుతూ తన మేధాతనాన్ని ప్రదర్శించడానికి చాలా ప్రయాసపడ్డారు. ప్రకటన వికటించింది. చంద్రబాబుకి వర్గ పరంగా బహిరంగ మద్దతు ఇస్తున్నాను అని ఆయన ప్రకటిస్తే ఎవరికీ పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఏదేదో మాట్లాడేసేసి, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏదో అరాచకం జరిగి పోతుందని తన భాషా ప్రావీణ్యమంతా ప్రదర్శించే సరికి, ఆయన మీద విమర్శల జడి మొదలైంది. పాపం జేపీని చూసినప్పుడల్లా విదు రుడు చెప్పిన పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది. ‘‘ధనమును, విద్యయు, వంశంబును, దుర్మతులకు మదంబు ఒనరించును / సజ్జను లైన వారికి అణకువయును, వినయము ఇవియే తెచ్చును ఉర్వీ నాథా!’’ అంటాడు. ధనం, విద్య, ఉత్తమ కులంలో పుట్టాననే భావన దుష్టులకు మదాన్నీ, అహంకారాన్నీ కలిగిస్తాయి. ఇవే శిష్టులకు అణకువ, వినయం కలిగిస్తాయి అని విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. ఈ పద్యం చదివితే జేపీ ఏ బాపతు మేధావో చెప్పనవసరం లేదనుకుంటాను. జనానికి ఏమి కావాలో అది చెప్పాలి.లేదంటే నేల విడిచి సాము చేసినట్టు ఉంటుంది. జనం ఏమైనా ‘జేపీలా’? పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
మెకార్తీయిజం–ఎల్లో జర్నలిజం
హిట్లర్ ప్రభుత్వంలో ప్రసార మంత్రిత్వశాఖను నిర్వహించిన ‘జోసెఫ్ గోబెల్స్’ పేరు అబద్ధపు ప్రచారాలకు పర్యాయ పదమై నిలిచింది. జనంలో ప్రచార మాధ్యమం ఎంత బలమైనదో అర్థం చేసు కున్నాడు జోసెఫ్ గోబెల్స్. వ్యక్తి (హిట్లర్) ఆరాధన పెంపొందించడానికీ, ప్రజా భిప్రాయాన్ని తారుమారు చేయడానికీ, తప్పుడు వార్తలను నిజాలుగా నమ్మించడానికీ ప్రచార, ప్రసార మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించాడు గోబెల్స్. తదనంతర కాలంలో దారుణంగా అపఖ్యాతి పాలయ్యాడు. అప్పటినుంచి ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే దానిని ‘గోబెల్స్’ ప్రచారంగా అభివర్ణించడం పరిపాటి అయింది. తెలుగు నాట గోబెల్స్ వారసులు బయల్దేరి అచ్చం గోబెల్స్ వలె చంద్రబాబు, లోకేష్ బాబుల ఇమేజ్ పెంచడానికి, జగన్ మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ దిగజారుడు జర్నలిజంలో గోబెల్స్‌ను మించి, కొత్త అంకానికి తెరతీశారు. అదే ‘మెకార్తీయిజం’. అర్థంలేని భయాలను సృష్టించి జనాల్ని కలవరపాటుకు గురి చేయడం, తమ ప్రత్యర్థులను జనాలకు భూతద్దంలో చూపి భయ పెట్టడం, తాము నమ్ముకున్న వాళ్లను రక్షకులుగా చూపించడం మెకార్తీ జర్నలిజం. అసలేమిటీ ‘మెకార్తీ జర్నలిజం’ అని రేఖా మాత్రంగా పరిశీలిస్తే చంద్రబాబు అను‘కుల’ మీడియా ప్రచారాల తంతు అర్థం అవుతుంది. 1950వ దశకంలో అమెరికా సెనేటర్ జోసెఫ్ మెకార్తి కమ్యూనిజాన్ని బూచిగా చూపిస్తూ, కమ్యూని స్టులపై పోరాడే అలుపెరుగని వీరుడిగా ఆదిలో పేరుగాంచాడు. అయితే ఆ తర్వాత జనం చీత్కారాలకు గురై రాజకీయాల నుంచి బహిష్కృతుడయ్యాడు. అమెరికా–రష్యాల మధ్య ఆధిపత్య పోరు నడి చిన రోజులవి. ఆ సమయంలో మెకార్తి మీడియాలో కమ్యూనిస్టులు దేశంలోకి చొరబడ్డారని భయపెట్టి వార్తలు విస్తృతంగా ప్రచారం చేసేవాడు. తనకు గిట్టని వాళ్లను ‘అన్ అమెరికన్’ అని ముద్ర వేశాడు. అతడి శాడిజానికి నిజాయితీగా పనిచేసే జర్నలి స్టులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అతడు పని చేసిన కాలాన్ని ‘రెడ్ స్కేర్’ అని పిలిచేవారు. లేని దాన్ని ఉన్నట్టు బీభత్సంగా ప్రచారం చేసే జర్నలిజం ‘మెకార్తీ యిజం’గా పేరుపడింది. ఇప్పుడు మన తెలుగు నాట చంద్రబాబునాయుడి మీడియా బృందం చేస్తున్నది అదే! ‘కామెంట్ ఈజ్ ఫ్రీ’ బట్ ట్రూత్ షుడ్ బీ శాక్రెడ్’ అంటాడు సంపాదకీయాలకు ఓంప్రథమంగా శ్రీకారం చుట్టిన ప్రఖ్యాత సంపాదకుడు థామస్ బార్జ్. కానీ ఈ సూత్రానికి తెలుగునాట ఒక వర్గం మీడియా ఎప్పుడో తిలో దకాలు ఇచ్చింది. వ్యాఖ్య ఏదైనా చేయవచ్చు. అందులో సత్యం ముత్యం అంత స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి అని బార్జ్ చెప్తే, ‘వ్యాఖ్య ఏదైనా చేసెయ్! అందులో వాస్తవాలతో పని లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం ఉండాలి. మాంచి మసాలా దట్టించిన గుత్తి వంకాయ కూరలాగా, ఇంకా ఘాటుగా ఉండాలంటే చికెన్ 65 లాగా స్టోరీ వండాలి. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ శెహ బాష్! అనే విధంగా ఉండాలి. వార్త వేరు వ్యాఖ్య వేరు అనుకోవద్దు. ఇప్పుడు మన పాలసీలో వ్యాఖ్యే వార్త’ అనే ఆదేశాలు ఇచ్చే స్థితికి దిగజారాయి బాబు భజన బృందాలు. వేయవల సిన వార్తలు ఉంటే లోపలి పేజీలో సింగిల్ కాలమో, డబుల్ కాలమో వేయాలి. ‘కిక్ ఇచ్చే వంటకాలే బ్యానర్ స్టోరీలు’... ఇదే నయా జర్నలిజం. అయితే ప్రజలకు ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఎప్పుడో అర్థమై పోయింది. అందుకే చంద్ర బాబు నాయుడుని 23 సీట్లకు పరిమితం చేశారు. అర్థం కానిదల్లా చంద్రబాబు నాయుడికీ, ఆయన తనయుడు లోకేష్‌కే! అసత్య ప్రచారాలకు మోసపోయే అపరిణత మనస్కులు కారు మన ఆంధ్రులు అని మరొకసారి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. అందుచేత నయా గోబెల్స్లను, మెకార్తీలను తరిమికొట్టడానికి ‘సిద్ధం’ కండి! టీడీపీ దోపిడీకి శాశ్వతంగా వీడ్కోలు పలకండి. పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
ఓర్పుకీ... ఓదార్పుకీ చిరునామా!
ఆయన పేరు... లక్షల గుండెల్లో ఒక లయ. కోటి తలల నాలుక. జయ జయ ఘోషల పల్లవి. కడలి హోరు లాంటి కరతాళ ధ్వనుల గీతిక! కష్టజీవికి ఇరువైపులా నిలిచిన వాడు. కర్మ జీవికై పాలన మలచిన వాడు. ఫ్యూడల్ శక్తుల కుహనా ఎత్తుగడలను ఎదిరించి గెలిచినవాడు. పాతికేళ్లకే ప్రతిభావంతుడు. సంపదల మధ్య పుట్టిన జగన్ మోహనుడు. కుట్ర రాజకీయాల ‘బంధం’లో బాధల గరళం మింగిన బాధాసర్ప దష్టుడు. కసిని అసిగా మార్చు కుని అసిధారావ్రతం చేసి, జయకేతనం ఎగురవేశాడు. అయితే ఈ విజయం ఆయన్ని తేలిగ్గా వరించలేదు. ఒకవైపు విషశక్తుల కుయుక్తులు ఎదుర్కొంటూనే జనసాగర తరగలపై తేలియాడిన నావికుడు. బాటలు నడిచి పేటలు కడచి వేలమైళ్ళ దుమ్ములో, మధ్యాహ్నపు సూర్య ధూళిలో స్నానమాడిన నిత్య పథగాముడు. అధో జగత్ సహోదరుల కష్టాలను కన్నాడు. గోడు విన్నాడు. అబలల కంటి తడి వీణ మీటాడు. అందుకే ఓర్పుకీ, ఓదార్పుకీ ‘జగన్’ అనే మూడు అక్షరాలు చిరునామా అయ్యాయి! సగటు ప్రజల మనో భావన భవన ప్రాంగణాల కట్టిన తోరణాలే ‘నవరత్నా’లై నిలిచాయి. సహజంగానే ప్రతిభావంతులకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ముద్ర ఉంటుంది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నా తండ్రి చాటు బిడ్డగా రాజకీయం నడపలేదు. జనంతో కలిసి, జనంతో మమేకమై, జన ఘన జన నేతగా జగన్ ఆవిష్కృతమయ్యాడు. కుహనా శక్తులకు సింహ స్వప్నమయ్యాడు. సమ సమాజ చైతన్యానికి తెరలేపి, సామాజిక చైతన్యం అంటే ఏమిటో చాటి చెప్పాడు. ఈ చైతన్యం ఫ్యూడల్ శక్తులకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. దశాబ్దాల తమ పెత్తందారీ తనానికి ఎదురు నిలవడం సహించలేని శక్తులు అన్నీ ఒక్కటయ్యాయి. బుస కొట్టే భుజంగాలూ, ఘుర్ఘరించే ‘వరాహాలూ’, నక్కలూ, భల్లూకాలూ, ఉలూకాలూ ఒక్క టయ్యాయి. రాజ్యం తమ భోజ్యం కావాలని పద్మ వ్యూహాలను పన్నుతున్నాయి. కానీ వారికి తెలియదు జనార్దనుడికి పద్మవ్యూహం పటా పంచలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని! అయితే సగటు ప్రజలు కూడా ఈ కుట్రలు గ్రహించాలి. స్వేదంతో నిర్మించుకున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అందరి విధి. పరిపాలన అంటే ‘ఆకాశ హార్మ్యాల నిర్మాణం, విదేశీ శక్తులకు ఆహ్వానం, లక్షల కోట్లు దోచేయడం’ అనే సంస్కృతికి వీడ్కోలు చెప్పి, అట్టడుగు వర్గాల సాధికారతే లక్ష్యంగా సాగిపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఈ ప్రయాణం పూల పాన్పు కాదు. ఎన్నో అవరోధాలూ, సవాళ్లూ ఉన్నాయి. అయినా ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సాగుతున్నాడు. మరి ఆ సంక్షేమ ఫలాలు అందని అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? ఇక్కడే అసంతృప్తులు వివేకంతో ఆలోచించాలి. పరిపాలన అంటే సంపన్న వర్గాలు కోటానుకోట్లు దోచుకుంటూ పేదలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ, వాళ్లకు ఎంగిలి మెతుకులు విసరడం న్యాయమా? అసలు అంటూ సంక్షేమ ప్రభుత్వం వచ్చాక, ఆ ఫలాలు తమ సాటివారికి అందుతున్నప్పుడు, తమ వంతు కూడా వస్తుందనే విశాల దృక్పథంతో ఆలోచించాలి. ఎందుకంటే అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనే లక్ష్యం జగన్‌కి ఉండవచ్చు. కానీ అందుకు ఆయన చేతిలో మంత్రదండం ఏమీ లేదు. అందుకే సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ కొనసాగింపు తమ వరకు వచ్చేదాకా ఫలాలు అందని వారు ఓపిక పట్టడం ఎంతో అవసరం. ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. ఇవి మరింత విస్తృతం కావాలి అంటే ‘మళ్లీ జగన్ రావాలి!’ ఈ నేపథ్యంలో ఛద్మ వేషధారులు బయలుదేరి, కవి ఆలూరి బైరాగి చెప్పినట్టు, ‘నాకు కొంచెం నమ్మకమివ్వు కొండలు పిండి కొట్టేస్తాను, చితికిన టమేటో లాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడం లాంటి చంద్రుని ఆకాశపు ఎంగిలి పళ్లెంలో నుంచి నెట్టేస్తాను’ అంటూ వీరంగాలు వేస్తున్నారు. ‘ఎర్ర పుస్తకాలతో’, ‘ఎర్రి’ ప్రసంగాలతో వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నారు. ఇంకోవైపు వీరికి చెందిన కార్పొరేట్ శక్తులు ఒకటయ్యాయి. దశాబ్దాలుగా తాము నంజుకు తింటున్న ప్రజా సంపద పేదలకు వెళ్లడం జీర్ణించుకోలేక పోతున్నాయి. గోబెల్స్ ప్రచారంతో జగన్‌పై చీకటి యుద్ధం ప్రారంభించాయి. ఇది జగన్ చెప్పినట్లు అచ్చంగా ‘క్లాస్ వార్’. పేదల ప్రభుత్వంపై పెద్దలు ప్రకటించిన యుద్ధం. ఒకవైపు పీడిత, తాడిత జన అక్షౌహిణుల ప్రతినిధిగా జగన్ నిలబడగా ఆయనతో కలబడుతున్న శక్తులు అత్యంత బలమైన కుహనా శక్తులు. ఒకే తానుకి చెందిన ఈ శక్తులు జ్యుడీషియరీ, మీడియా, ఎగ్జిక్యూటివ్, బిజినెస్, సినిమా... ఇలా ఒకటనేమిటీ? అన్ని రంగాలనుంచి మూకుమ్మడి దాడి ప్రారంభించాయి. అయితే ఈ కుట్ర రాజకీయాలకు అదిరే బెదిరే వ్యక్తి కాదు జగన్. ఇప్పుడు జగన్ నడుపుతున్నది సంప్రదాయేతర రాజకీయం. ఇది అర్థం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. రాజకీయం అంటే కొద్దిపాటి వర్గాల సొత్తు అనీ, పాలన అంటే కొన్ని వర్గాలు మాత్రమే తర తరాలకు సరిపోను సంపద కూడబెట్టుకోవడం అనీ, పాలకులు వేరు, పాలితులు వేరు అనే ఫ్యూడల్ సంప్ర దాయ రాజకీయాలకు చెక్ చెప్పి, ‘సంక్షేమ రాజ్యం’ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఈ దేశ రాజకీయాల్లోనే ఒక విలక్షణ పాలకుడు, సలక్షణ నాయకుడు. ఆయన జన్మ దినోత్సవ సందర్భంగా, పెద్దలు ‘జీవేమ శ్శరదమ్ శతమ్...’ అని దీవిస్తున్న వేళ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు!! పి. విజయబాబు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు -
‘చంద్రబాబు తన నివాసం ఖాళీ చేయాలి’
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసాన్ని వెంటనే ఖాళీ చెయ్యాలని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంటితోపాటు నదీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల వల్ల కృష్ణా నదికి, ప్రకాశం బ్యారేజికి ముప్పు పొంచి ఉందన్నారు. సీఎం ఇంటితోపాటు ఇతర అక్రమ నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలు నదిలో కలవటం వల్ల కృష్ణానది జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదికి 500 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందన్నారు. కానీ చంద్రబాబు ఉంటున్న ఇల్లు నదికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉందన్నారు. వెంటనే ముఖ్యమంత్రి ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని నదీ హక్కుల్ని కాపాడాలన్నారు. లేకపోతే కృష్ణానదిని కాపాడుకోటానికి భారీ స్ధాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం ఉంటున్న నివాసంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాలని గతంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన విషయాన్ని విజయబాబు గుర్తు చేశారు.