‘చంద్రబాబు తన నివాసం ఖాళీ చేయాలి’
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసాన్ని వెంటనే ఖాళీ చెయ్యాలని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంటితోపాటు నదీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల వల్ల కృష్ణా నదికి, ప్రకాశం బ్యారేజికి ముప్పు పొంచి ఉందన్నారు. సీఎం ఇంటితోపాటు ఇతర అక్రమ నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలు నదిలో కలవటం వల్ల కృష్ణానది జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నదికి 500 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందన్నారు. కానీ చంద్రబాబు ఉంటున్న ఇల్లు నదికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉందన్నారు. వెంటనే ముఖ్యమంత్రి ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని నదీ హక్కుల్ని కాపాడాలన్నారు. లేకపోతే కృష్ణానదిని కాపాడుకోటానికి భారీ స్ధాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం ఉంటున్న నివాసంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాలని గతంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన విషయాన్ని విజయబాబు గుర్తు చేశారు.