వీరు నేరస్థులా? | Sakshi Guest Column On Indian Penal Code Social Media Activists | Sakshi
Sakshi News home page

వీరు నేరస్థులా?

Published Sun, Nov 10 2024 12:32 AM | Last Updated on Sun, Nov 10 2024 7:04 AM

Sakshi Guest Column On Indian Penal Code Social Media Activists

అభిప్రాయం

సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని వ్యవస్థీకృత నేరస్థులుగా చిత్రించే ప్రయత్నాలు ప్రమాదకరం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సెక్షన్లలో లేని శిక్షలను పేర్కొంటూ వచ్చిన ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాలకు వక్ర భాష్యం చెప్పే విధంగా ఉన్న అటువంటి వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అనిపిస్తోంది.

సోషల్‌ మీడియా కార్యకర్తలు వ్యవస్థీకృత నేరస్థులని అందునా, ఒక పార్టీకి చెందిన వారి కోసం భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 111 ఏర్పాటయింది అనేటువంటి రీతిలో ఒక పత్రికలో వార్త చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, సెక్షన్లలో లేని శిక్షలు, అన్వయం కానివారికి అన్వయిస్తారు. ‘ఖబడ్దార్‌’ అనే రీతిలో భూతద్దంలో చూపించి భయభ్రాంతులను చేసే విధంగా, చట్టాలకు వక్రభాష్యం చెప్పే విధంగా ఉన్న ఆ వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అని పించింది. 

అందుకే అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 111లో ఏముంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కాగా, సోషల్‌ మీడియా కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని ఎడాపెడా కేసులు బనాయిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. భారత అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పుల్లో ఇదే సత్యాన్ని స్పష్టం చేసింది. అంతెందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఒక హెచ్చరిక జారీ చేసింది. చట్టాలకు అతిశయోక్తులు జోడించి చెప్పటం, వక్ర భాష్యాలు చెప్పడం నేరం. చిన్న నేరాలకు సంబంధం లేని సెక్షన్లు పెట్టిన పోలీసు అధికా రులపై చర్యలు తీసు కున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. 

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్‌ 111 విషయానికి వచ్చినట్లయితే ఈ సెక్షన్‌ కింద సోషల్‌ మీడియాలో ఏ విధమైన పోస్టులు చేసినా వాళ్లకు భారీ శిక్షలు తప్పవు అని అర్థం వచ్చే రీతిలో ప్రచురితమైన వార్తను చూసినప్పుడు అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 111 ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే, ఆ వార్తలోని అర్ధ సత్యం అర్థం అవుతుంది. 
 
కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూ దోపిడీ, కాంట్రాక్ట్‌ హత్య, ఆర్థిక నేరం, సైబర్‌ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడటం సెక్షన్‌ 111 కిందికి వస్తాయి. 

సైబర్‌ నేరాలు అంటే... ఎవరైనా వ్యక్తులు గానీ, ఒక వ్యక్తి గానీ ఒక సమూహ గౌరవానికి, ఒక వ్యక్తి గౌరవానికీ భంగం కలిగించే విధంగా కానీ; శారీరకంగా, మానసికంగా బాధపెట్టే విధంగా కానీ ప్రవర్తిస్తే, అది ఐటీ చట్టం–2000 ప్రకారం సైబర్‌ క్రైమ్‌ కిందికి వస్తుంది. విస్తృత ప్రజా ప్రయోజనాలతో కానీ, విశ్వసనీయ సమాచారంతో కానీ ప్రచురించినా, ప్రసారం చేసినా అది ఐటీ చట్టం కింద నేరంగా పరిగణించటం సాధ్యం కాదు. ఇటువంటివే మరి కొన్ని మినహాయింపులు ఈ చట్టపరిధిలో ఉన్నాయి. 

సైబర్‌ క్రైమ్‌ అంటే ఎలక్ట్రానిక్‌ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడీని దొంగిలించటం లేదా అతని అకౌంట్‌ మొత్తం హ్యాక్‌ చేయడం, ఈ–మెయిల్‌ పాస్‌వర్డ్‌ దొంగిలించి తద్వారా తప్పుడు మెసేజ్‌లు బయటికి పంపడం, అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి పంపడం; దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ పరికరం ద్వారా నేరా లకు పాల్పడటం వంటివన్నీ సైబర్‌ నేరాలుగా పరిగణి స్తారు. సమాజంలో జరుగుతున్న వ్యవహారాన్ని వార్తలుగా కానీ రాజకీయ పరమైన విమర్శలుగా కానీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే వాటికి ఈ చట్టాలను ఆపాదించడం సరికాదు. 

ఇక వ్యవస్థీకృత నేరం అంటే, నేర కార్యకలా పాల్లో సిండికేట్‌ సభ్యునిగా లేదా ఉమ్మడిగా వ్యవహరించే ఏ వ్యక్తీ లేదా వ్యక్తుల సమూహం... హింసకు పాల్పడటం, బెదిరింపు, బలవంతం లేదా ఏదైనా ఇతర చట్టవిరు ద్ధమైన మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాన్ని పొందడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది. మరి ఇవన్నీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఎలా వర్తింపచేస్తారో గౌరవ న్యాయ స్థానాలే నిర్ణయించాలి. 

‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాన్ని కొనసాగించడం’ అంటే చట్టప్రకారం నిషేధించబడిన పనులు చేయడం. ఇందుకు గాను మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తారు. ఏ వ్యక్తి అయినా ఒక్క రుగా లేదా ఉమ్మడిగా, వ్యవస్థీకృత నేర సిండికేట్‌ సభ్యు నిగా చేస్తే, అదీ పదేళ్ల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇవి నేరాలకు అన్వయం కానీ రాజకీయ విమర్శలకు వర్తించవు.

ఇక సోషల్‌ మీడియాకి సంబంధించిన శిక్షలు అంటూ కొన్ని సెక్షన్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సెక్షన్లు దేనికి అన్వయం అవుతాయో భారతీయ న్యాయ సంహిత ప్రకారం పరిశీలిద్దాం. ఐటీ యాక్ట్‌ 67 ప్రకారం... నేరాలకు పాల్పడిన వారికి అంటూ, వీరు దేశంలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ఈ సెక్షన్‌ కింద  ఐదేళ్ల జైలు శిక్ష, 70 లక్షల జరిమానా ఉంటుంది అని రాశారు.  

అసలు వాస్తవం పరిశీలిస్తే, 67 ప్రకారం రాజకీయపరమైన విమర్శలు ఈ చట్ట పరిధిలోకి రావు. అశ్లీల దృశ్యాలు ప్రచు రించినా, ప్రసారం చేసినా ఈ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా ఉంటుంది. వేరే వ్యక్తి పేర అకౌంట్‌ కానీ, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ ద్వారా కానీ మోసం చేయడం, ఇన్‌కమ్‌టాక్స్‌ అకౌంట్స్‌ హ్యాక్‌ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సెక్షన్‌ 66డీ కిందకి వస్తుంది.

ఈ నేరాలకు పాల్పడిన వారికి లక్ష జరిమానా, మూడు వేల జైలు. ఇక సెక్షన్‌ 356 ప్రకారం పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుంది.  అయితే పరువు ప్రతిష్ఠ కేసులకు సంబంధించి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఇందులో కూడా విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న, నమ్మ దగిన సమాచారం ఉన్నా, సత్యనిష్ఠకు సంబంధించి రుజువు చేయగలిగితే అది డిఫమేషన్‌ కిందికి రాదు.

అక్కడ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఆర్టికల్‌ 19(1 )ఏ అండగా నిలుస్తుంది. అయితే  భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతి రేకెత్తించడం, మహిళల్ని కించపరచటం కచ్చితంగా నేరాలే! ఈ నేరాలకు ఎవరు పాల్పడినా వాళ్లను శిక్షించవలసిందే! ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు కానీ భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 111 ప్రత్యేకంగా ఒక పార్టీకో, ఒక పార్టీలో సోషల్‌ మీడియా వారి కోసమో నిర్దేశించినట్టుగా వార్తలు రాయడం సత్యనిష్ఠకు వ్యతిరేకం, భంగకరం. 

చట్టం ముందు అందరూ సమానులే! చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు కచ్చితంగా శిక్షార్హులే! అంచేత చట్టాల ఉల్లంఘనకు పాల్పడే వారిని రాజకీయాలకు అతీ తంగా శిక్షించడానికి  పూనుకున్నప్పుడు సమాజం హర్షిస్తుంది. కాదంటే న్యాయ పరిరక్షణలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై  న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. వారు ఏ స్థాయిలో ఉన్నా  న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదు. 


పి. విజయ బాబు 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement