ఒకే ఒరలో రెండు కత్తులు! | Sakshi Guest Column On USA Donald Trump Elon Musk | Sakshi
Sakshi News home page

ఒకే ఒరలో రెండు కత్తులు!

Published Thu, Jan 9 2025 12:39 AM | Last Updated on Thu, Jan 9 2025 12:39 AM

Sakshi Guest Column On USA Donald Trump Elon Musk

అమెరికా రిపబ్లికన్‌ పార్టీలో టెక్‌ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్‌ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్‌ ప్రపంచాన్ని జయించాలని టెక్‌ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్‌ దగ్గర టెక్‌ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.

మొన్న క్రిస్మస్‌ రోజు అమెరికా సోషల్‌ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్‌ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. 

అసలేమిటి ఈ వివాదం? వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఏఐ–పాలసీ సీనియర్‌ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్‌ ట్రోలింగ్‌ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్‌ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్‌’ ఉద్యమానికి ట్రంప్‌ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు.  

కృష్ణన్‌ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్‌–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్‌ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ కృష్ణన్‌ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్‌లో జాత్యహంకారం జడలు విప్పింది. 

జాతీయ వాదులు భారతీయ టెక్‌ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్‌తో సోషల్‌ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్‌ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్‌ రీప్లేస్‌మెంట్‌ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్‌ సిద్ధాంతం. 

హెచ్‌–1బి వీసా విధానానికి మస్క్‌ మద్దతు
నిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్‌ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్‌’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్‌–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్‌ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్‌–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. 

ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్‌–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్‌ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్‌ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్‌ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది  ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్‌ టీమ్‌ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్‌ పొసొబిక్‌ బదులిచ్చాడు. 

వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్‌ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్‌ మాజీ సలహాదారు స్టీవ్‌ బానన్‌ రంగంలోకి దిగాడు. హెచ్‌–1బి వీసాలు పెద్ద స్కామ్‌ అనీ, వాటిని సమర్థించి మస్క్‌ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.

నిజానికి హెచ్‌–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్‌ సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్‌–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్‌ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్‌ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్‌ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. 

సయోధ్య కుదిరేనా?
రిపబ్లికన్‌ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్‌ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ ఒక ఉదాహరణ. పీటర్‌ థియల్‌ అనే మితవాద టెక్‌ బిలియనీర్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్‌ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. 

తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్‌–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్‌ హెచ్‌–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.

ట్రంప్‌ పదవి చేపట్టిన తర్వాత టెక్‌ రైట్‌–నేషనలిస్ట్‌ రైట్‌ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్‌ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్‌ గత హయాంలోనూ ఇదే జరిగింది. 

బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్‌ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్‌’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్‌ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. 

టెక్‌ రైట్‌కే ప్రాధాన్యం?
ఈసారి టెక్‌ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్‌–డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న మెంట్‌ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మార్క్‌ ఆండ్రీసెన్‌ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. 

ఇక శ్రీరామ్‌ కృష్ణన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్‌ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్‌ క్యాబినెట్‌లో చోటు లభించనుంది.

ట్రంప్‌ ‘న్యూయార్క్‌ పోస్ట్‌’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్‌కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. 

అలీ బ్రెలాండ్‌ 
వ్యాసకర్త సీనియర్‌ పత్రికా రచయిత
(‘ది అట్లాంటిక్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement