Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు | Who Is Laura Loomer Why Indians Angry on her Details Here | Sakshi
Sakshi News home page

MAGA వంకతో భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు!.. ఎవరీ లారా లూమర్‌?

Published Sat, Dec 28 2024 1:10 PM | Last Updated on Sat, Dec 28 2024 1:19 PM

Who Is Laura Loomer Why Indians Angry on her Details Here

లారా లూమర్.. సోషల్‌ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్‌ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. ‌అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్‌ఫ్లుయెన్సర్‌.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో చీప్‌ లేబర్‌ అంటూ భారతీయులను, ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది.

కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత సంతతికి చెందిన శ్రీరామ్‌ కృష్ణన్‌ను కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్‌ వివాదాస్పద పోస్టులు చేశారు. అమెరికా ఫస్ట్‌ నినాదానికి  శ్రీరామ్‌ కృష్ణన్‌ ద్రోహం చేస్తున్నాడని,  గ్రీన్‌కార్డుల విషయంలో అతని వైఖరి భారత్‌లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని.. తద్వారా అమెరికాలోని STEM(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌) గ్రాడ్యుయేట్స్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతోందామె. అదే టైంలో..

హెచ్‌1బీ వీసాల విషయంలోభారతీయులపై వివక్షాపూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి, ఉషా వాన్స్‌లాంటి వాళ్లు అమెరికా ఫస్ట్‌ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు.  ‘‘నేను ఓటేసింది అమెరికాను మరోసారి గొప్పగా తయారు చేస్తారని. అందుకోసం హెచ్‌1బీ వీసాలను తగ్గిస్తారని.అంతేగానీ పెంచుకుంటూ పోతారని కాదు. భారత్‌లో అంత మేధోసంపత్తి  ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా.అమెరికాకు వలస రావడం దేనికి?. అంత హైస్కిల్‌ సొసైటీ అయితే.. ఇలా చెత్తకుప్పలా ఎందుకు తగలడుతుంది?( తాను పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ..).

మీకు భారతీయుల్లాంటి చీప్‌ లేబర్‌ కావాలనే కదా వీసా పాలసీలను మార్చేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే.. నేనూ రేసిస్ట్‌ అనే విషయాన్ని అంగీకరిస్తా. మీలాంటి ఆక్రమణదారులు నిజమైన ట్రంప్‌ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటారు. కానీ, ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను. అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే(Make America Great Again) ఉద్దేశమూ లేదు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు’’ అని తీవ్ర స్థాయిలో సందేశాలు ఉంచారు.  ఇంతకు ముందు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్‌ ఈ తరహాలోనే జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు.

 ఎలాన్‌ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని..

టెక్‌ బిలియనీర్లు మార్‌ ఏ లాగో(ట్రంప్‌ నివాసం)లో ఎక్కువసేపు గడుపుతూ.. తమ చెక్‌ బుక్‌లను విసిరేస్తున్నారు. అలాంటివాళ్లు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు. తద్వారా.. భారత్‌, చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలు రప్పించుకోవచ్చనేది వాళ్ల ఆలోచన అయి ఉండొచ్చు అంటూ ఆ పోస్టులోనే ఆమె ప్రస్తావించారు.

కాంట్రవర్సీలకు జేజేమ్మ!

31ఏళ్ల వయసున్న లారా ఎలిజబెత్‌ లూమర్‌.. పోలిటికల్‌ యాక్టివిస్ట్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, జర్నలిస్ట్‌ కూడా. మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే. గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసి ఓడారామె. ఆపై కొన్ని క్యాంపెయిన్‌లను ముందుండి నడిపించారు. తాను ఇస్లాం వ్యతిరేకినంటూ బహిరంగంగా ప్రకటించి.. ఆ మతంపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు.. తన ద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్‌ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్స్‌ యాప్స్‌, ఆఖరికి ఫుడ్‌ డెలివరీ యాప్‌లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి.

కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్‌ ప్రయత్నించారు. అయితే.. రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. అధ్యక్ష రేసు బైడెన్‌ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ట్రంప్‌ను ప్రొత్సహించి లూమర్‌ను ప్రచారకర్తగా నియమించారు. ఆ టైంలో ట్రంప్‌తో ఆమెకు అఫైర్‌ ఉన్నట్లు కథనాలు రాగా.. ఆమె వాటిని ఖండించారు. 

ఒకరకంగా చూసుకుంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్‌ ఇవ్వొచ్చు. అలాంటి లూమర్‌ ఇప్పుడు.. ట్రంప్‌ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది. మస్క్‌ సొంత ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగానే ఆమె తీవ్ర పదజాలంతో సందేశాలు పోస్ట్‌ చేస్తుండడం గమనార్హం.  

‘‘ఎలాన్‌ మస్క్‌కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషీయెన్సీ(DOGE) బాధ్యతలు అప్పగించడం సుద్ధ దండగ. అతనొక స్వార్థపరుడు.  మేక్‌ అమెరికా గ్రేట్‌ అగెయిన్‌(MAGA) పేరుతో ఇమ్మిగ్రేషన్‌ పాలసీలలో తలదూర్చాలనుకుంటున్నాడు. తద్వారా అమెరికన్‌ వర్కర్లకు హాని చేయాలనుకుంటున్నాడు. వివేక్‌ రామస్వామి చేస్తున్న క్యాంపెయిన్‌ ఎందుకూ పనికి రానిది.  రిపబ్లికన్లు అతిత్వరలో వీళ్లను తరిమికొట్టడం ఖాయం. మస్క్‌, రామస్వామిలు ట్రంప్‌కు దూరం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని విమర్శించిందామె. ఈ క్రమంలో  ఎలాన్‌ మస్క్‌ ఆమెపై వెటకారంగా ఓ పోస్ట్‌ చేసి వదిలేశాడు.

అయితే.. మస్క్‌ తేలికగా తీసుకుంటున్నా లూమర్‌ మాత్రం తన విమర్శల దాడిని ఆపడం లేదు. మస్క్‌ పచ్చి స్వార్థపరుడని, చైనా చేతిలో పావు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మార్‌ ఏ లాగో(ట్రంప్‌ నివాసం)లో మస్క్‌ ఎక్కువసేపు గడుపుతున్నాడని.. తనకు లాభం వచ్చే పనులు ట్రంప్‌తో చేయించుకునేందుకు ప్లాన్‌లు వేసుకుంటున్నాడని, తన స్నేహితుడు జీ జిన్‌పింగ్‌(చైనా అధ్యక్షుడు) కోసమే ఆరాటపడుతున్నాడంటూ తిట్టిపోసింది.

ఎగిరిపోయిన బ్లూ టిక్‌.. మరో చర్చ
తప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు పోస్ట్‌ చేస్తోందన్న కారణాలతో.. గతంలో లారా లూమర్‌(Laura Loomer) ట్విటర్‌ అకౌంట్‌పైనా నిషేధం విధించారు. అయితే ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ కొనుగోలుచేసిన కొన్నాళ్లకే..ఫ్రీ స్పీచ్‌ పేరిట చాలా మంది అకౌంట్‌లు పునరుద్ధరణ అయ్యాయి. అందులో ట్రంప్‌ అకౌంట్‌ కూడా ఉందన్నది తెలిసిందే. 

అయితే తాజాగా లారా ఎలిజబెత్‌ లూమర్‌ హెచ్‌1బీ వీసాల వ్యవహారంతో ఎలాన్‌  మస్క్‌నే టార్గెట్‌ చేయడంపై.. ఆమెపై ఎక్స్‌(పూర్వపు ట్విటర్‌) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అకౌంట్‌ నుంచి బ్లూ టిక్‌ ఎగిరిపోవడంతో పాటు ఓ వార్నింగ్‌ కూడా ఇచ్చింది.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరో పోస్ట్‌ చేశారు. ట్విటర్‌(ఇప్పుడు ఎక్స్‌) కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్‌.. ఇప్పుడు తోక ముడిచారా? అని ఆమె ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement