
వాషింగ్టన్:టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ ప్రమాణస్వీకారం రోజే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీఓజీఈ) బాధ్యతల నుంచి తప్పుకోవడంపై రామస్వామి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తాజాగా స్పందించారు.
మస్క్‌కు సాంకేతికతను ఎక్కువగా నమ్ముతాడని తాను రాజ్యాంగం మీద ఆధారపడి నడిచే శాసనవ్యవస్థను ఎక్కువగా నమ్ముతానని చెప్పారు. ఇంతేతప్ప ఇద్దరి మధ్య విభేదాలు ఏమీ లేవన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకే డీఓజీఈ బాధ్యత నుంచి తప్పుకున్నారా అన్న ప్రశ్నకు లేదని వివేక్ సమాధానమిచ్చారు.
అయితే 2026లో జరగనున్న ఒహియో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని వివేక్ చెప్పారు. డీఓజీఈ బాధ్యతలను రామస్వామి,మస్క్‌లకు సంయుక్తంగా ట్రంప్ ఇటీవలే అప్పగించిన విషయం తెలిసిందే.
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను రామస్వామి ప్రశంసించారు.కాగా, వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవడం కోసం రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్‌తో తలపడ్డ విషయం తెలిసిందే.ఆ తర్వాత రామస్వామి ప్రైమరీల నుంచి తప్పుకుని ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment