అమెరికా అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న డోనాల్డ్ ట్రంప్
కామెంట్
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయిననాటికీ, తిరిగి ఇప్పుడు నాలుగేళ్ల విరామంతో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటికీ ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. సవాళ్లు, చిక్కుముడులు, అడ్డంకులు, అనివార్యతలు ఆయన ముందుకొచ్చి నిలబడ్డాయి. అధ్యక్షుడిగా గెలిచీ గెలవగానే ఆయన చేసిన వివాదాస్పద నియామకాలలో అవసరమైతే మార్పులు చేయాలి. యుద్ధాలు చేసుకుంటున్న దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించాలి. వందల మిలియన్ల డాలర్లను తన గెలుపు కోసం ఖర్చుపెట్టిన ఎలాన్ మస్క్‌ను సంతృప్తిపరచాలి. ఆయనే హామీ ఇచ్చిన విధంగా అమెరికాను ‘మళ్లీ గొప్ప దేశంగా’ నిలబెట్టాలి. ఇక భారత్‌తో ఆయన ఎలా ఉండబోతారన్నది మన వైపు నుండి ఉత్పన్నం అయ్యే ప్రశ్న.
కొన్నిసార్లు భవిష్యత్తును అర్థం చేసుకోవటానికి ఉత్తమమైన మార్గం, దాని గురించిన ప్రశ్నలను లేవనెత్తటమే! ఆ ప్రశ్నలకు మీకు సమాధానాలు లభించక పోవచ్చు; కనీసం ఆందోళన కలిగించగల అవకాశం ఉన్న అంశాలనైనా మీరు గుర్తిస్తారు. అది మిమ్మల్ని, భవిష్యత్తు ముడి విప్పబోయే వాటికి సంసిద్ధం చేస్తుంది.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ – ఒక పదవీకాల విరామంతో – రెండోసారి పదవిని చేపడుతున్నారు. ఈ తరుణంలో... మున్ముందరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న సందేహాలు సహజం. ఆ దిశగా కొన్ని ప్రశ్నలను నా వైపు నుంచి వేయనివ్వండి. ట్రంప్‌తో సన్నిహితంగా పని చేసిన ఇద్దరు వ్యక్తులు... మాజీ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ జాన్ కెల్లీ, మాజీ ‘డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్’ ఆంథోనీ స్కారమూచీ ఆయన్ని ఫాసిస్ట్ (తీవ్రమైన నియంతృత్వ వైఖరి కలిగిన జాతీయవాద పాలకుడు) అనేవారు. ఆ మాట నిజమే నని భవిష్యత్తు రుజువు చేయబోతోందా?
అధ్యక్షుడిగా గెలవగానే ట్రంప్ చేపట్టిన అనేక నియామకాలు వివాదాస్పదం అయ్యాయి. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సేత్, ఆరోగ్య మంత్రిగా రాబర్డ్ కెన్నెడీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్ పటేల్ (కశ్యప్ పటేల్), ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా తులసీ గబ్బార్డ్ నియామకాలు యథాతథంగా కొనసాగుతాయా, లేక మార్పులు జరుగుతాయా?
ఏమైనా, రెండు నియామకాలు మాత్రం ప్రశంసనీయార్హం అయ్యాయి. విదేశాంగ మంత్రిగా మార్కో రుబియో, జాతీయ భద్రతా సలహాదారుగా మైఖేల్ వాల్ట్‌జ్ – అయితే ఆ ఇద్దరూ నిజంగానే ట్రంప్ విదేశాంగ విధానాన్ని నిష్కర్షగా అమలు పరచ గలుగుతారా?
ఇక పారిశ్రామికవేత్త, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది బహుశా, మరింత ముఖ్యమైన ప్రశ్న. ట్రంప్‌కు ఆయన అత్యంత సన్నిహితులుగా ఉన్నారన్నది పైకే కనిపిస్తోంది. పైగా ట్రంప్‌ను అధ్యక్షుడిగా గెలిపించటం కోసం ఆయన 27 కోట్ల డాలర్లను ఖర్చు చేశారు. అది ఆయన్ను వైట్ హౌస్‌లో రాజ్యాంగేతర అధికార శక్తిగా నిలబెట్టే ప్రమాదం ఉంటుందా?
బ్రిటన్ ప్రధాని పదవి నుంచి కీర్ స్టార్మర్‌ను తప్పించేందుకు ఎలాన్ మస్క్ చర్చలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టార్మర్‌ను ఆయన ‘ఏమాత్రం తగని మనిషి’ అన్నారు. జర్మనీ ఎన్నికల్లో కూడా వేలు పెట్టారు. జర్మనీ చాన్స్‌లర్ షోల్జ్‌ను ‘బుద్ధిహీనుడు’ అన్నారు. ట్రంప్ అశీస్సులతోనే ఇదంతా జరిగి ఉంటుందా?
అన్ని దిగుమతులపై 20 శాతం సుంకాన్ని, చైనా ఎగుమతుల పైనైతే మరింత అత్యధిక సుంకాన్ని విధించే ఆలోచన ట్రంప్ మదిలో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. కెనడా, మెక్సికోలపై 25 శాతం వరకు సుంకం ఉంటుందని కూడా ఆయన బెదిరించారు. ఇది మనల్ని ఇబ్బందికరమైన వాణిజ్య యుద్ధంలోకి మళ్లిస్తుందా?
ఈ విషయంలో చైనా, దాని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో ట్రంప్ ఎలాంటి సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంది? భారత్‌కు ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి?
ఇక ఇప్పుడు రెండు పెద్ద విదేశాంగ విధానాలు విసిరే సవాళ్ల దగ్గరకు వద్దాం. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేయ గలనని ట్రంప్ గొప్ప ధీమాతో చెప్పారు. అయితే అది వట్టి ప్రగల్భమేనా, లేక ఆయన మనసు లోపలి నిజమైన ఉద్దేశమా? ఏ విధంగా చూసినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అది మంచి వార్తేమీ కాదు.
మళ్లీ ఇదే విషయానికి వస్తే, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ‘నాటో’ ఏ విధమైన భవిష్యత్తును ఎదుర్కోబోతోంది? ట్రంప్ ఆ సంస్థ సభ్య దేశాలను వాటి రక్షణ కోసం మరింత ఎక్కువగా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారా? లేకుంటే, నాటో ఐక్యతకు, ఉనికికి ఒక విపత్తులా పరిణమిస్తారా?
ఇంకొక అంతర్జాతీయ సవాలు ఇజ్రాయెల్–గాజా! ట్రంప్ ఇజ్రాయెల్‌కు, ముఖ్యంగా నెతన్యాహూకు మద్దతు ఇస్తున్నారు. అధ్యక్షుడిగా తన మొదటి హయాంలో యూఎస్ రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చారు. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న గోలన్ హైట్స్‌కు అధికార గుర్తింపునిచ్చారు. ఇప్పుడు నెతన్యాహూకు ఎలాంటి ధైర్యాన్నిస్తారు? ఇరాన్ మీద దాడి చేసేట్టుగానా?
మధ్య ప్రాచ్యం గురించి కనుక మాట్లాడుకుంటే, సిరియా మాటే మిటన్నది ప్రశ్న. గత నెలలో బషర్ అల్–అస్సద్ పదవీచ్యుతుడు అయినప్పుడు అక్కడ మనం ఒక రాజకీయ భూకంపాన్నే చూశాం. బైడెన్ ప్రభుత్వం డమాస్కస్ చేరుకోటానికి ప్రయత్నమన్నా చేసింది. కానీ ట్రంప్ వల్ల ఈ దౌత్య విధానం తారుమారవుతుందా?
మూడో అంతర్జాతీయ సమస్య కూడా ఉంది కానీ, ట్రంప్ దానిని ఎలా తీసుకుంటారనే దానిపై నేనేమీ చెప్పలేను. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. పనామా కాలువను వెనక్కు తీసుకుంటాననీ, కెనడాను యూఎస్‌లో కలుపుకొంటాననీ కూడా ఆయన మాట్లాడారు. ఇవన్నీ ఆయన నిజంగానే చేస్తారా, లేక నిస్పృహ నుంచి బయట పడే ప్రయత్నంగా మాత్రమే అలా అంటున్నారా?
చివరిగా, భారతదేశంపై దృష్టి పెడదాం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీకి, ట్రంప్‌కు మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆ స్నేహం ఇప్పుడు కూడా వికసి స్తుందా? లేదా పారిశ్రామికవేత్త అదానీ, పన్నూ(ఖలిస్తానీ నాయ కుడు గుర్పథ్‌వత్ సింగ్ పన్నూను చంపడానికి ఇండియా ప్రయత్నించిందన్న కేసు) కేసుల విషయమై ట్రంప్ ఒత్తిడి చేస్తే అది వడలి పోతుందా?
అత్యంత ఆందోళన కలిగించే విషయం – ట్రంప్ తరచూ ఇండియా విధించే సుంకాలు మితిమీరి ఉంటున్నాయని ఆరోపించే వారు. అందుకు ఆయన చూపించే నిదర్శనం హార్లీ–డేవిడ్‌సన్ మోటార్ బైక్ దిగుమతులపై భారత్ విధించే సుంకాలు. ఇప్పుడు మళ్లీ, భారతీయ సుంకాలు మరొకసారి ట్రంప్ దృష్టిలోకి వస్తాయా?
ఎటూ కదలని ఇంకొక అంశం హెచ్–1బి వీసాలు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ వీసాల గురించి ‘దారుణం’, ‘అన్యాయం’ అన్నారు. కానీ ఈసారి ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి (రిపబ్లికన్ నాయకుడు), శ్రీరామ్ కృష్ణన్ (కృత్రిమ మేధలో సీనియర్ విధాన సలహాదారు) హెచ్–1బి వీసాలకు గట్టి మద్దతుగా మాట్లాడారు. మస్క్ అయితే ఈ విషయమై యుద్ధాని కైనా తెగబడతానని అన్నారు. కాబట్టి ఈ వీసాల విషయంలో ట్రంప్ రెండో హయాం, ట్రంప్ మొదటి హయానికి భిన్నంగా ఉండబోతోందా?
ఈ ప్రశ్నలు ఏవీ సమగ్రమైనవి కావు. కానీ, ఆందోళన కలిగించే అంశాల విస్తృతిని సూచిస్తాయి. అధ్యక్షుడిగా ట్రంప్ రెండో హయాం ఎంత అస్థిరత్వంతో ఉండబోతున్నదో ఇవి వెల్లడిస్తాయి. కనుక మీరు ఎగుడు దిగుళ్ల రాళ్ల దారిలో ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment