Indian Penal Code
-
వీరు నేరస్థులా?
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని వ్యవస్థీకృత నేరస్థులుగా చిత్రించే ప్రయత్నాలు ప్రమాదకరం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సెక్షన్లలో లేని శిక్షలను పేర్కొంటూ వచ్చిన ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాలకు వక్ర భాష్యం చెప్పే విధంగా ఉన్న అటువంటి వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అనిపిస్తోంది.సోషల్ మీడియా కార్యకర్తలు వ్యవస్థీకృత నేరస్థులని అందునా, ఒక పార్టీకి చెందిన వారి కోసం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏర్పాటయింది అనేటువంటి రీతిలో ఒక పత్రికలో వార్త చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, సెక్షన్లలో లేని శిక్షలు, అన్వయం కానివారికి అన్వయిస్తారు. ‘ఖబడ్దార్’ అనే రీతిలో భూతద్దంలో చూపించి భయభ్రాంతులను చేసే విధంగా, చట్టాలకు వక్రభాష్యం చెప్పే విధంగా ఉన్న ఆ వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అని పించింది. అందుకే అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111లో ఏముంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కాగా, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని ఎడాపెడా కేసులు బనాయిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. భారత అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పుల్లో ఇదే సత్యాన్ని స్పష్టం చేసింది. అంతెందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఒక హెచ్చరిక జారీ చేసింది. చట్టాలకు అతిశయోక్తులు జోడించి చెప్పటం, వక్ర భాష్యాలు చెప్పడం నేరం. చిన్న నేరాలకు సంబంధం లేని సెక్షన్లు పెట్టిన పోలీసు అధికా రులపై చర్యలు తీసు కున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 విషయానికి వచ్చినట్లయితే ఈ సెక్షన్ కింద సోషల్ మీడియాలో ఏ విధమైన పోస్టులు చేసినా వాళ్లకు భారీ శిక్షలు తప్పవు అని అర్థం వచ్చే రీతిలో ప్రచురితమైన వార్తను చూసినప్పుడు అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే, ఆ వార్తలోని అర్ధ సత్యం అర్థం అవుతుంది. కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూ దోపిడీ, కాంట్రాక్ట్ హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడటం సెక్షన్ 111 కిందికి వస్తాయి. సైబర్ నేరాలు అంటే... ఎవరైనా వ్యక్తులు గానీ, ఒక వ్యక్తి గానీ ఒక సమూహ గౌరవానికి, ఒక వ్యక్తి గౌరవానికీ భంగం కలిగించే విధంగా కానీ; శారీరకంగా, మానసికంగా బాధపెట్టే విధంగా కానీ ప్రవర్తిస్తే, అది ఐటీ చట్టం–2000 ప్రకారం సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది. విస్తృత ప్రజా ప్రయోజనాలతో కానీ, విశ్వసనీయ సమాచారంతో కానీ ప్రచురించినా, ప్రసారం చేసినా అది ఐటీ చట్టం కింద నేరంగా పరిగణించటం సాధ్యం కాదు. ఇటువంటివే మరి కొన్ని మినహాయింపులు ఈ చట్టపరిధిలో ఉన్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడీని దొంగిలించటం లేదా అతని అకౌంట్ మొత్తం హ్యాక్ చేయడం, ఈ–మెయిల్ పాస్వర్డ్ దొంగిలించి తద్వారా తప్పుడు మెసేజ్‌లు బయటికి పంపడం, అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి పంపడం; దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా నేరా లకు పాల్పడటం వంటివన్నీ సైబర్ నేరాలుగా పరిగణి స్తారు. సమాజంలో జరుగుతున్న వ్యవహారాన్ని వార్తలుగా కానీ రాజకీయ పరమైన విమర్శలుగా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి ఈ చట్టాలను ఆపాదించడం సరికాదు. ఇక వ్యవస్థీకృత నేరం అంటే, నేర కార్యకలా పాల్లో సిండికేట్ సభ్యునిగా లేదా ఉమ్మడిగా వ్యవహరించే ఏ వ్యక్తీ లేదా వ్యక్తుల సమూహం... హింసకు పాల్పడటం, బెదిరింపు, బలవంతం లేదా ఏదైనా ఇతర చట్టవిరు ద్ధమైన మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాన్ని పొందడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది. మరి ఇవన్నీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలా వర్తింపచేస్తారో గౌరవ న్యాయ స్థానాలే నిర్ణయించాలి. ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాన్ని కొనసాగించడం’ అంటే చట్టప్రకారం నిషేధించబడిన పనులు చేయడం. ఇందుకు గాను మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తారు. ఏ వ్యక్తి అయినా ఒక్క రుగా లేదా ఉమ్మడిగా, వ్యవస్థీకృత నేర సిండికేట్ సభ్యు నిగా చేస్తే, అదీ పదేళ్ల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇవి నేరాలకు అన్వయం కానీ రాజకీయ విమర్శలకు వర్తించవు.ఇక సోషల్ మీడియాకి సంబంధించిన శిక్షలు అంటూ కొన్ని సెక్షన్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సెక్షన్లు దేనికి అన్వయం అవుతాయో భారతీయ న్యాయ సంహిత ప్రకారం పరిశీలిద్దాం. ఐటీ యాక్ట్ 67 ప్రకారం... నేరాలకు పాల్పడిన వారికి అంటూ, వీరు దేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ఈ సెక్షన్ కింద ఐదేళ్ల జైలు శిక్ష, 70 లక్షల జరిమానా ఉంటుంది అని రాశారు. అసలు వాస్తవం పరిశీలిస్తే, 67 ప్రకారం రాజకీయపరమైన విమర్శలు ఈ చట్ట పరిధిలోకి రావు. అశ్లీల దృశ్యాలు ప్రచు రించినా, ప్రసారం చేసినా ఈ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా ఉంటుంది. వేరే వ్యక్తి పేర అకౌంట్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా కానీ మోసం చేయడం, ఇన్‌కమ్‌టాక్స్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సెక్షన్ 66డీ కిందకి వస్తుంది.ఈ నేరాలకు పాల్పడిన వారికి లక్ష జరిమానా, మూడు వేల జైలు. ఇక సెక్షన్ 356 ప్రకారం పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుంది. అయితే పరువు ప్రతిష్ఠ కేసులకు సంబంధించి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఇందులో కూడా విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న, నమ్మ దగిన సమాచారం ఉన్నా, సత్యనిష్ఠకు సంబంధించి రుజువు చేయగలిగితే అది డిఫమేషన్ కిందికి రాదు.అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1 )ఏ అండగా నిలుస్తుంది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతి రేకెత్తించడం, మహిళల్ని కించపరచటం కచ్చితంగా నేరాలే! ఈ నేరాలకు ఎవరు పాల్పడినా వాళ్లను శిక్షించవలసిందే! ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు కానీ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రత్యేకంగా ఒక పార్టీకో, ఒక పార్టీలో సోషల్ మీడియా వారి కోసమో నిర్దేశించినట్టుగా వార్తలు రాయడం సత్యనిష్ఠకు వ్యతిరేకం, భంగకరం. చట్టం ముందు అందరూ సమానులే! చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు కచ్చితంగా శిక్షార్హులే! అంచేత చట్టాల ఉల్లంఘనకు పాల్పడే వారిని రాజకీయాలకు అతీ తంగా శిక్షించడానికి పూనుకున్నప్పుడు సమాజం హర్షిస్తుంది. కాదంటే న్యాయ పరిరక్షణలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. వారు ఏ స్థాయిలో ఉన్నా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదు. పి. విజయ బాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు -
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్
టీకమ్గఢ్: మధ్యప్రదేశ్‌లోని టీకమ్గఢ్లో పొలం పనికి వెళ్లిన 13 ఏళ్ల గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఖర్గపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచెర్ గ్రామంలో ఆగస్ట్ 15వ తేదీన దారుణం చోటుచేసుకుంది. అయితే, బాధిత బాలిక కుటుంబీకులు గురువారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఇన్చార్జి మంత్రి కృష్ణ గౌర్‌కి విషయం తెలపడంతో వెలుగులోకి వచి్చంది. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, సలీం ఖాన్, లాలూ ఖాన్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత(బీఎన్ఎస్)తోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ రోహిత్ కష్వానీ చెప్పారు. ‘బాధిత బాలిక తండ్రి ఢిల్లీలో కార్మికుడిగా పనిచేస్తుండగా, గ్రామంలో తల్లి తన పిల్లలతో ఉంటోంది. ఆగస్ట్ 15న పొలం పనికి వెళ్లిన బాలికను నిందితులు తమ పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు’అని ఖర్గపూర్ స్టేషన్ ఇన్చార్జి మనోజ్ ద్వివేది తెలిపారు. బాధిత కుటుంబీకులు రేప్ విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోయారనే విషయమై దర్యాప్తు చేపట్టామన్నారు. -
అమల్లోకి కొత్త నేర చట్టాలు.. ఈ సంగతులు తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటినుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో ముగిసింది. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్టాన్రిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచి్చనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. → భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.→ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. → మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.→ కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతోపాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారు. -
Calcutta High Court: వారిని డార్లింగ్ అనడం లైంగిక వేధింపే
కోల్‌కతా: ఫూటుగా తాగి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరిచింది. పరిచయం లేని మహిళను అలా పిలవడడాన్ని ‘లైంగిక వేధింపు నేరం’గా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచి్చన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354ఏ (మహిళా గౌరవాన్ని భంగపరచడం), 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేలి్చంది. మహిళా కానిస్టేబుల్‌ను మద్యం మత్తులో డార్లింగ్ అని పిలిచిన జనక్ రామ్ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమరి్థస్తూ జస్టిస్ జై సేన్ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరిచింది. ‘‘ పరిచయంలేని మహిళను తాగిన/తాగని వ్యక్తి నడి వీధిలో డార్లింగ్ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తాం’ అని జడ్జి వ్యాఖ్యానించారు. అండమాన్ నికోబార్ ద్వీపంలోని మాయాబందర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనాన్ని అదుపు చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ‘చలాన్ వేయడానికి వచ్చావా డార్లింగ్?’ అంటూ జనక్‌రామ్ వేధించాడు. -
Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
186 ఏళ్ల తర్వాత.. కొత్త చరిత్రకు శ్రీకారం
ఢిల్లీ: భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్–ఐపీసీ), 1860, నేర విచారణ ప్రక్రియా స్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్–సీఆర్పీసీ), 1898, భారత సాక్ష్య చట్టం (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్), 1872 ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రక్రియ పార్లమెంటులో ప్రారంభమైంది. స్వతంత్ర భారతంలో ఇది విప్లవాత్మక చర్యగా భావిస్తున్నారు. ఈ నెల 11న ఈ మూడు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు (బీఎన్ ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు (బీఎన్ ఎసెస్), భారతీయ సాక్ష్య బిల్లు (బీఎస్)లను కేంద్ర హోం మంత్రి అమిత్ ప్రవేశపెట్టారు. కీలకమైన ఈ 3 మూడు బిల్లులను సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి, వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు సూచించడానికి పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లులను తర్వాత నివేదించారు. ► కాలం చెల్లిన చట్టాలను రద్దుచేయడం లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం, మార్పులు అవసరమైన చట్టాలను సవరించడం, మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాధారణం. అయితే, ఈ మూడు చట్టాలూ న్యాయవ్యవస్థ విచారణ ప్రక్రియకు సంబంధించినవి కావడంతో కొత్త బిల్లులపై ఆసక్తి పెరుగుతోంది. బ్రిటిష్ వారి పాలనాకాలంలో రూపొందించి, అమల్లోకి తెచ్చిన పై మూడు చట్టాలకూ తర్వాత, స్వతంత్ర భారతంలో అవసరమైన సవరణలు చేశారు. అయినా.. ► మారిన పరిస్థితులు, అభిప్రాయాల కారణంగా 21వ శతాబ్దంలో భారత పార్లమెంటు ఈ మూడింటి స్థానంలో కొత్త బిల్లులు రూపొందించి, వాటికి చట్ట రూపం కల్పించే ప్రక్రియను 17వ లోక్ సభ చివరి సంవత్సరంలో ప్రారంభించడం మంచి పరిణామమని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా వీటిలో అత్యంత కీలకమైన భారత శిక్షా స్మృతి (ఐపీసీ) ఎలా అమలులోకి వచ్చింది ఓసారి గుర్తుచేసుకుందాం. ఇంగ్లిష్ వారి హయాంలో 1862 నుంచి అమలులోకి వచ్చిన ఐపీసీ తొలుత ఈస్టిండియా కంపెనీ పాలనలో ఇండియాలోని మూడు ప్రధాన ప్రాంతాలను (కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలు) కేంద్రీకృత పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. కంపెనీ అధీనంలోని అన్ని భూభాగాల ప్రజల కోసం శాసనాలు చేయడానికి సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ ఏర్పాటయింది. కొత్తగా చేసే చట్టాల రూపకల్పనకు కౌన్సిల్ లో న్యాయవిభాగం సభ్యుడు థామస్ బీ మెకాలే అధ్యక్షతన రెండేళ్ల తర్వాత లా కమిషన్ ఏర్పాటు చేశారు. తమ మాతృదేశం బ్రిటన్‌లో అమలులో ఉన్న సాధారణ ఇంగ్లిష్ చట్టాల ఆధారంగా ఇండియాలో అమలు చేసే చట్టాలు ఉండాలనేది వారి అప్రకటిత లక్ష్యం. మొదట సమగ్రమైన పీనల్ కోడ్ (శిక్షా స్మృతి) ను రూపొందించే బాధ్యతను లా కమిషన్ కు అప్పగించారు. ► మెకాలే బృందం హడావుడిగా ఒక ముసాయిదా స్మృతిని నాటి గవర్నర్ జనరల్ కు 1837లో సమర్పించింది. కొన్నేళ్లు అధ్యయనం చేశాక మెకాలే వారసులు డ్రింక్ వాటర్ బెతూన్, బార్నెస్ పీకాక్ దాన్ని సంపూర్ణంగా సవరించారు. సవరించిన ముసాయిదాను 1856లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించారు. 1857లో తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయి తిరుగుబాటు) కారణంగా ఈ ముసాయిదాను చట్టంగా చేసే పని నిలిచిపోయింది. ఈ బెంబేలెత్తిన బ్రిటిష్ సర్కారు భవిష్యత్తులో ఇలాంటి ‘తిరుగుబాటుదారుల’ను అణచివేసే అధికారాన్ని దఖలు పరచుకుంటూ ఈ ముసాయిదాను మరోసారి సవరించింది. భారీ మార్పులతో రూపొందించిన ముసాయిదాను కేంద్ర చట్టసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించగా 1860లో దీన్ని ఆమోదించించారు. ► ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) పేరుతో 1862లో ఇది అమలులోకి వచ్చింది. వెంటనే నాటి న్యాయస్థానాల భాష అయిన ఉర్దూలోకి దీన్ని అనువాదం చేయించారు. ఉర్దూ తర్జుమా ప్రతికి ‘తాజీరాతే హింద్’ అని పేరుపెట్టారు. మొదట ఈ ఐపీసీలో 23 చాప్టర్ల కింద 511 సెక్షన్లు ఉన్నాయి. 11 ఐపీసీ సవరణ చట్టాల పేరుతో దానిలో మార్పులు చేశారు. చాప్టర్ల సంఖ్య 25కు పెంచారు. స్వతంత్ర భారతంలో 1959 నుంచి ఐపీసీని 12 పర్యాయాలు సవరించారు. 1860 నుంచి దానికి అదనంగా 61 సెక్షన్లు జోడించారు. అలాగే, అనవసరమని భావించిన 21 సెక్షన్లను తొలగించారు. ప్రస్తుతం ఐపీసీలో 555 సెక్షన్లు ఉన్నాయి. కోడ్ అనే మాటకు సంస్కృతంలో స్మృతి అంటారు. దాన్నే ఇప్పుడు హిందీలో సంహిత అనే పేరుతో కొత్త శాసనం రూపొందిస్తున్నారు. అయితే.. బ్రిటిష్ వారి జమానాలో ఐపీసీని భారతీయ దండ్ సంహిత అని హిందీలోకి అనువదించినప్పటికీ అప్పట్లో అది ప్రాచుర్యంలోకి రాలేదు. ::: విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలోనే చరిత్రాత్మకమని చెప్పదగ్గ ఘట్టం శుక్రవారం లోక్ సభలో ఆవిష్కృతమైంది. బ్రిటిష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రతిపాదిత చట్టాలు దేశ నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయి. ప్రతి భారతీయుని హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించాలన్న స్ఫూర్తికే పెద్ద పీట వేస్తాయి‘ అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమకాలీన అవసరాలు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు అవసరమైన అన్ని మార్పుచేర్పులను కొత్త బిల్లుల్లో పొందుపరిచినట్టు వివరించారు. వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కోరారు. మూడేళ్లలో న్యాయం ప్రతిపాదిత బిల్లులు ఆమోదం పొందితే నేర న్యాయ వ్యవస్థ సమూలంగా మెరుగు పడుతుందని అమిత్ షా అన్నారు. అంతేగాక ప్రతి పౌరునికీ గరిష్టంగా మూడేళ్లలో న్యాయం అందుతుందన్నారు. ‘కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. మూక దాడుల వంటి హేయమైన నేరాలకు కూడా నిర్దిష్టమైన శిక్షలను పొందుపరిచాం. తొలిసారిగా ఉగ్రవాదానికి కూడా నిర్వచించాం‘ అని ప్రకటించారు. ‘రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా ఎత్తేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది‘ అని వివరించారు. ‘ఈ బిల్లులు మన నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయని సభకు హామీ ఇస్తున్నా. వీటి లక్ష్యం శిక్ష విధింపు కాబోదు. న్యాయం అందేలా చూడటమే ప్రధానోద్దేశం. కొత్త చట్టాల్లో కేవలం నేరాలను నియంత్రించే లక్ష్యంతో మాత్రమే శిక్ష విధింపులు ఉంటాయి‘ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి ప్రస్తుత చట్టాల నిండా బానిసత్వపు చిహా్నలే ఉన్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ ఏదోలా శిక్షించడం వాటి ఏకైక లక్ష్యము. బ్రిటిష్ అధికారాన్ని పరిరక్షించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలవి. శిక్షించడమే వాటి ప్రధాన లక్ష్యం తప్ప న్యాయం అందించడం కాదు‘ అని ఆరోపించారు. శిక్ష పడే రేటును కనీసం 90 శాతానికి పెంచడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ వాడకాన్ని మరింతగా పెంచే యోచన కూడా ఉందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ► మూక దాడులకు, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష. ► దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ► కొన్ని రకాల చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ (అమల్లోకి వస్తే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అవుతుంది). ► వేర్పాటువాదం, తత్సంబంధ చర్యలు, సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం వంటి కొత్త నేరాలను పొందుపరిచారు. ► పలు నేరాలకు ఇకపై లింగ భేదం ఉండబోదు. ► పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ల వంటి ప్రలోభాలు చూపి, గుర్తింపును దాచి మహిళలను లైంగికంగా దోచుకోవడం నేరంగా పరిగణనలోకి వస్తుంది. ► గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, లేదా జీవిత ఖైదు. ► తీవ్రతను బట్టి మూక దాడులకు ఏడేళ్లు, జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష. ► తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం. ► ఉగ్రవాదుల ఆస్తుల జప్తు రాజకీయ రెమిషన్లకు చెక్... శిక్ష తగ్గింపు (రెమిషన్) వంటి సదుపాయాలను రాజకీయ లబి్ధకి వాడుకోవడాన్ని నిరోధించేందుకు ప్రతిపాదిత బిలుల్లో కొత్త సెక్షన్లు పొందుపరిచారు. వాటి ప్రకారం... ► ఇకపై మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలవుతుంది. ► జీవిత ఖైదును ఏడేళ్ల శిక్షగా మాత్రమే మార్చవచ్చు. ► బిహార్ కు చెందిన నేరమయ నేత ఆనంద్ మోహన్ కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రాజకీయ అండదండలున్న వారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకే ఈ సెక్షన్లను చేర్చినట్లు వివరించారు. కొత్త నేర–న్యాయ ప్రక్రియ ఇదీ ► 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ► పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వొచ్చు. ► దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి. ► విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి. న్యాయ సంహిత బిల్లు ప్రకారం ఉగ్రవాది అంటే... ► దేశంలో గానీ, విదేశాల్లో గానీ భారత దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడేవాడు. ► తద్వారా జన సామాన్యాన్ని, లేదా ఒక వర్గాన్ని భయభీతులను చేసేవాడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవాడు. రాజద్రోహం ఇక దేశద్రోహం బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తు చేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బీఎన్ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం... ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించినా, దేశ సార్వ¿ౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసినా, అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశ ద్రోహమే. ► దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశ ద్రోహంగానే పరిగణిస్తారు. ► శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయతి్నంచినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయతి్నంచినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసీ చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశ ద్రోహమే. ► నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, పదేళ్లకు మించని, లేదా ఏడేళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు. ‘నేర న్యాయ చట్టాలను సమూలంగా మదింపు చేయాల్సిన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని 70 ఏళ్ల ప్రజాస్వామ్య భారత అనుభవం చెబుతోంది. సబ్ కా సాత్ (అందరికీ తోడు), సాబ్ కా వికాస్ (అందరి అభివృద్ధి), సాబ్ కా విశ్వాస్ (అందరి నమ్మకం), సాబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అన్నదే కేంద్ర ప్రభుత్వ మంత్రం‘ – బీఎన్ఎస్ఎస్ బిల్లు లక్ష్య ప్రకటన -
ఇది పాక్ నుంచి మనం నేర్చుకోవాల్సిందే!
పాకిస్తాన్ నుంచి భారతదేశం నేర్చుకునే విషయాలు చాలా తక్కువ. కానీ ఆ దేశం నుంచి కూడా మనం నేర్చుకునే విషయాలు ఉన్నాయని లాహోర్ హైకోర్టు ఈ మధ్య ఇచ్చిన ‘రాజద్రోహం రద్దు’ తీర్పు చూసిన తరువాత అనిపిస్తుంది. పాకిస్తాన్ పీనల్ కోడ్‌లో ఉన్న సెక్షన్ 124(ఏ) అనేది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పును ప్రకటించింది. ఆ నిబంధన దుర్వినియోగం అవుతోందనీ, అది వలసవాదులు వదిలిన అవశేషమనీ లాహోర్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వాలు తమ ప్రత్య ర్థులకి వ్యతిరేకంగా ఈ నిబంధనను ఉపయోగిస్తున్నా యని దాఖలైన బ్యాచ్ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి షాహీద్ కరీమ్ ఈ నిబంధనును రద్దు చేశారు. పాకిస్తాన్ మాజీ నియంత జనరల్ పర్వేజ్ ముషా ఫ్ 2007వ సంవత్సరంలో రాజ్యాంగాన్ని తారుమారు చేసినందుకు... 2019వ సంవత్సరంలో ఆయనను దోషిగా నిర్ధారించి, మరణశిక్షను విధించిన న్యాయ మూర్తి జస్టిస్ కరీం. మన దేశం, పాకిస్తాన్ ఇరుదేశాలూ ఈ నిబంధనను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వారసత్వంగా పొందినవే. భారతీయులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన నిబంధన సెక్షన్ 124(ఏ). భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన వ్యక్తులనూ, అదే విధంగా అప్పుడు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వ్యక్తులనూ అణచి వేయడానికి తయారు చేసిన నిబంధన ఇది. మహాత్మాగాంధీ, బాల గంగాధర్ తిలక్ లాంటి వ్యక్తులు అందరూ ఈ నిబంధన బాధితులే. సెక్షన్ 124 (ఏ) నిబంధనను సుప్రీంకోర్టు గత సంవత్సరం రద్దు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను పునఃపరిశీలించే వరకు ఈ నిబంధనను ఆపేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఈ నిబంధన కింద కేసులను నమోదు చేయకూడదు. దీని కింద అభియోగాలు ఉన్న అన్ని విచారణలనూ, అప్పీళ్లనూ, ఇతర ప్రొసీడింగ్స్‌నూ ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మా సనం భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం దీనిని ఉపసంహరించడానికి ఎలాంటి ఆసక్తినీ కనబ రచడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు భారత ప్రభుత్వం పునఃపరిశీలన కూడా చేయలేదు. మన సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఈ నిబంధనను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని లేదా పరిశీలించాలని చెప్పింది. కానీ రద్దు చేయలేదు. కానీ పాకిస్తాన్ హైకోర్టు మన సుప్రీంకోర్టు కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి దీనిని రద్దు చేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కూడా ప్రకటించింది. అందుకని మనం ఈ విషయంలో పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. సెక్షన్ 124 (ఏ) అనేది మన దేశంలో, పాకిస్తాన్లో ఒకే విధంగా ఉంది. ఎవరైనా, మాటల ద్వారా, ద్వేషం వల్ల ధిక్కారాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేసినా, లేదా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి లేదా ప్రేరేపించ ప్రయత్నం చేసినా... వాళ్ళను ఈ నిబంధన కింద శిక్షించడానికి అవకాశం ఉంది. 1962వ సంవత్సరంలో ‘కేదార్నాథ్’ కేసులో ఈ నిబంధన చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ దీని పరిధిని పరిమితం చేసింది. అశాంతి సృష్టించే ఉద్దేశంతో లేదా హింసను ప్రేరేపించే చర్యలకు మాత్రమే ఈ నిబంధనను పరి మితం చేయాలని కోర్టు నిర్దేశించింది. కానీ పాలకులు దీన్ని పట్టించుకోలేదు. నిబంధనలో ఉన్న అంశాలను అక్షరాలా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి, దేశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేదు. నినాదాలు చేసినందుకు, శాంతియుతంగా నిరసన తెలిపినా, ప్రభు త్వాన్ని విమర్శిస్తూ పోస్టులను పెట్టినా వారిపై తరచూ దేశద్రోహ కేసులను నమోదు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిపోయింది. దేశ పౌరులను బెదిరించడం సర్వ సాధారణమై పోయింది. పాకిస్తాన్లో నెలకొని ఉన్న ప్రస్తుత రాజకీయ గందరగోళంలో ఈ నిబంధనను రద్దు చేయడం చరిత్రాత్మకమైన విషయంగా పేర్కొ నవచ్చు. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు. భారత పౌరుల హక్కులను ఇది కాలరాస్తోంది. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఇది ఉండటానికి వీల్లేదు. చాలా ప్రజాస్వామ్య దేశాలు దీన్ని రద్దు చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఈ నిబంధన రద్దు గురించి స్పందన కన్పించలేదు. కానీ ఆ దేశంలోని రాజకీయ పక్షాలు, పౌరులు, జర్నలిస్టులు, న్యాయ వాదులు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. పాకి స్తాన్‌లోని మానవ హక్కుల కమిషన్ కూడా ఈ రద్దును స్వాగతించింది. భారత ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ల దగ్గర నుంచి మనకు సంక్రమించిన చాలా శాసనాలను పురాత నమైనవిగా భావించి రద్దు చేసింది. దాదాపుగా 1500 చట్టాలను తొలగించింది. కాని, ఈ నిబంధనను తొలగించడానికి ఉత్సుకత చూపించడం లేదు. భారతదేశ మొదటి ప్రధాని దీని బాధితుడే. కానీ – భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవ రణ ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఏర్పడినాయి. ఇందిరాగాంధీ హయాంలో సెక్షన్ 124 (ఏ)ను కాగ్నిజబుల్ నేరంగా మార్చారు. అది 1974 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన దుర్వినియోగం జరుగుతున్నా పాల కులు దీనిని తొలగించడానికి ఇష్టపడడం లేదు. లాహోర్ హైకోర్టు తీర్పుతోనైనా మన దేశంలోనూ దీనిని త్వరగా తొలగిస్తే మన ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది. మంగారి రాజేందర్, వ్యాసకర్త మాజీ జిల్లా జడ్జి. -
కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు
న్యూఢిల్లీ: కోడలి నగలను అత్తింటి వారు భద్రపరిస్తే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 498–ఏ సెక్షన్ ప్రకారం అది క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్తింటి వారు తన నగలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనను వేధిస్తున్నారన్న ఆరోపణలపై భర్త, అత్త, బావపై పంజాబ్‌కు చెందిన ఒక మహిళ కేసు పెట్టింది. ఇలా నగలు తీసుకోవడం అత్తింటివారు కోడలిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త తిరిగి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆ భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం విచారించింది. ఎన్ని నగలు తీసుకున్నారో, వాటి విలువ ఎంత అనే వివరాలేవీ పిటిషనర్ వెల్లడించలేదని, తన జీవితం ఏ విధంగా నాశనం చేశారనే విషయాలనూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఈ కేసులో నగలు తీసుకోవడం సెక్షన్ 498ఏ కింద క్రూరత్వం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ , హరియాణా హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 12 డిసెంబర్ 2021న పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2009లో వివాహం చేసుకున్న వ్యక్తి 2017లో తనకు విడాకులు కావాలంటూ బటిండా ఫ్యామిలీ కోర్టులో కేసు వేశాడు. అందుకు కారణంగా భార్య ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. 2020లో బటిండా ఫ్యామిలీ కోర్టు ఆ రికార్డులను అంగీకరించింది. సంభాషణల రికార్డును పరిగణనలోకి తీసుకోవడం తన గోప్యతకు భంగం కలిగించడమేనని ఆ మహిళ పంజాబ్,హరియాణా హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమె వాదనలతో హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఏకీభవించింది. -
తాట తీసేందుకు కొత్త సెక్షన్
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఇదివరకే అనేక రకాల ప్రయోగాలు చేపట్టింది. ట్రాఫిక్ ఉల్లంఘనులపై ఇప్పటికే కొరడా ఝలిపిస్తోంది. తరచూ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తిగా శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రమాద స్థలాల వద్దకు రాగానే డ్రైవర్‌కు ఇండికేషన్ వచ్చే విధంగా గూగుల్ మ్యాప్స్ ద్వారా శ్రీకారం చుట్టారు. అయినా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడం, ప్రమాదాల్లో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరగడంతో ఈ సారి రోడ్డుప్రమాదాలపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ కఠిన విధానాన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరంలో అమలు చేస్తున్నారు. 2016 జూలై 1న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభం, శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందడంతో మొదటిసారి రోడ్డు ప్రమాదాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఏమిటా కఠినాస్త్రం ఇకపై నుంచి ఎవరైనా వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదుటి వారి మరణానికి కారణమైతే వారిపై ఇకనుంచి ఐపీసీ 304(2) సెక్షన్ కింద కేసు నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదైతే 10సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ సెక్షన్‌ను మర్డర్ కేసులకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ చట్టం ద్వారా హైదరాబాద్‌లో మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. 2016లో తొలి కేసు నమోదైనప్పటి నుంచి హైదరాబాద్ వాహనదారుల్లో గుబులు మొదలైంది. ఈ చట్టం కొంత మేర సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు పోలీస్‌శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి జిల్లాలో ఐపీసీ 304(2) కింద 10 కేసులు నమోదు చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. వస్తామో రామో తెలియని పరిస్థితి కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. మరో పక్క వాహనాల సంఖ్య సైతం రోజురోజుకూ పెరుగుతోంది. వాహనంపై బయటకెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. రాంగ్ రూట్లో వెళ్లడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తున్నారు. తప్పు చేశామో.. పదేళ్లపాటు జైలుకే ఇప్పటివరకు పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో న్యాయస్థానం ఒకటి, రెండు, మూడు రోజులు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పులు వెలువరిస్తోంది. ఈ విధానం వాహనదారులకు పరిపాటిగా మారింది. ప్రస్తుతం పోలీస్‌శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన వారిపై పోలీసులు ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేయనున్నారు. నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయి వాహనాదారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ప్రమాద స్థలాలను గుర్తించి బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేశాం. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతుండటం బాధాకరం. ఇప్పటికే కమిషనరేట్ పరి«ధిలో ఐపీసీ304(2) సెక్షన్ కింద 10 కేసులు నమోదు చేశాం. – సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ -
‘వాహన’ నేరాలకూ ఐపీసీ వర్తింపు: సుప్రీం
న్యూఢిల్లీ: వాహనాలను అధిక వేగంతో నడపడం, బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్ వంటివి మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించి చేసే నేరాలు. అయితే మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ రెండూ వాటి పరిధుల్లో చక్కగానే పనిచేస్తున్నాయని, ప్రమాదాల సమయంలో చట్టరీత్యా ఎదుర్కోవాల్సిన విచారణలో కూడా రెండూ సరిగ్గానే ఉన్నాయని అ. మోవా చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమంటూ 2008 డిసెంబరు 22న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారిస్తూ సుప్రీంకోర్టు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ కేసును విచారించింది. మోటారు చట్టంలో ఐసీపీని ప్రవేశ పెట్టొద్దంటూ అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్, గౌహతి హైకోర్టు ఇచ్చిన సూచనలను పక్కన పెట్టింది. మోటారు చట్టం చెప్పలేదు... బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్, అధిక వేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించినా, తీవ్రంగా గాయపడినా వారికి పడాల్సిన శిక్షపై మోటారు చట్టంలోని చాప్టర్ 8 క్షుణ్నంగా వివరించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఐపీసీ సెక్షన్ 279, 304 పార్ట్–2, 304ఏ, 337, 338లు వివరించాయని తెలిపింది. మోటారు చట్టంలోని చాప్టర్ 8 వాటి వల్ల జరిగే ప్రమాదాలన్నింటిని కలిపి చెప్పిందని పేర్కొంది. వాహన చట్టంలోకి ఐపీసీ అవకాశం ఇస్తే క్రిమినల్ చట్టం కూడా మోటారు చట్టంలో ప్రవేశిస్తుందని తెలిపింది. -
లాయర్ మంజిమా
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్‌ను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు కథానాయిక మంజిమా మోహన్. కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. ‘ఎఫ్.ఐ.ఆర్’ (ఫైజల్ ఇబ్రహీమ్ రైజ్) అనే సినిమాలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఈ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా పోలీసుల చేతిలో చిక్కిన ఓ ముస్లిం యువకుడి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జూనియర్ అడ్వకేట్‌గా మంజిమా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మంజిమా మోహన్ కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
యువరానర్...
కొంతకాలంగా కోర్టుకు వెళ్తున్నారు బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా. కోర్టుమెట్లు ఎక్కేంత తప్పు ఆమె ఏం చేశారనేగా మీ డౌట్. అయితే ఆమె కోర్టుకెళుతున్నది ‘సెక్షన్ 375’ అనే సినిమా కోసమని బాలీవుడ్ ఖబర్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 375 సెక్షన్ అనేది మానభంగానికి చెందిన సెక్షన్ అట. ఈ సినిమాలో లాయర్‌గా కనిపించనున్నారు రిచా. పాత్రకు న్యాయం చేయడానికి కోర్టు విధివిధానాలను పరిశీలించాలని ఆమె కోర్టుకు వెళ్తున్నారు. ‘‘నా స్నేహితురాలు ఒకరు కార్పొరేట్ కేసులను పరిష్కరించడంలో లాయర్‌గా నిపుణురాలు. కానీ, మా సినిమా ఆ సెక్షన్‌కు సంబంధించింది కాదు. డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. కానీ, కోర్టులో నేను తెలుసుకునే కొత్త విషయాలు నేను చేయబోయే పాత్రకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీలైనప్పుడు లాయర్స్‌తో మాట్లాడుతున్నాను’’ అని పేర్కొన్నారు రిచా. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కథానాయకుడిగా నటిస్తారట. పది నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. మనీష్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. షకీల బయోపిక్ ‘షకీల’ చిత్రంలో నటించారు రిచా. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
తప్పుడు కేసుకూ శిక్ష ఉండాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ఏ చట్టం కిందనైనా, ఎవరినైనా తప్పుడు కేసు బనాయించి విచారిస్తే అందుకు వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. పునరావాసం కల్పించాలి. ఇది మానవ హక్కులు, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలోని 14వ అధికరణలోని ఆరో సెక్షన్ తెలియజేస్తోంది. ఈ ఒప్పందాన్ని ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు ఆమోదించగా, భారత దేశమే ఇంకా ఆమోదించలేదు. రాజ్యం అంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించి నట్లయితే అందుకు కచ్చితంగా పరిహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని తీసుకొచ్చారు. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం భారతీయుడికి జీవించే హక్కును, స్వేచ్ఛ హక్కును ప్రసాదిస్తున్న కారణంగా ఇంతవరకు ఈ అంతర్జాతీయ చట్టాన్ని ఆమోదించలేదు. కానీ దేశంలో ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించినట్లయితే రాజ్యం తిరిగి ఇచ్చే ప్రసక్తి ఎలా ఉంటుంది? ఉండదుకనుక భారతీయ పౌరులు తప్పుడు కేసులకు బలవుతున్నారు. అందుకని బాధితులకు నష్టపరిహారం ఇచ్చి వారికి పునరావాసం కల్పించే అవకాశం ఉండాలని భారత లా కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ చట్టాన్ని కూడా తీసుకరావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 277వ నివేదికలో సిఫార్సు చేసింది. అమాయకులపై తప్పుడు కేసులను బనాయించిన అధికారులను ప్రాసిక్యూట్ చేసే చట్టం కూడా ఉండాలని లా కమిషన్ సూచించింది. ఇస్రో సైంటిస్ట్‌పై కేరళ పోలీసులు గూఢచర్యం కింద తప్పుడు కేసును బనాయించి సుదీర్ఘకాలం విచారించడం, ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేడం, బాధిత సైంటిస్ట్ నష్టపరిహారం కోసం కోర్టుకెక్కడం, ఆయనకు 25లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం తదతిర పరిణామాల నేపథ్యంలో లా కమిషన్ సిఫార్సు ప్రాధాన్యతను సంతరించుకుంది. -
బాగా పరిశీలించాకే నిర్ణయం
న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377కు సంబంధించి చట్టబద్ధమైన ప్రామాణికతను అన్ని రకాలుగా పరిశీలించాకే రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌లో స్వలింగ సంపర్కులపై తీవ్ర వివక్షకారణంగా అది వారి మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిందని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే 158 ఏళ్ల నాటి సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ధర్మాసనం సెక్షన్ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తమకే వదిలేసినప్పటికీ రాజ్యాంగపరంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా సెక్షన్ 377ను కొనసాగించాలని, దీనిపై ప్రజాభిప్రాయం సేకరించాలని న్యాయవాదులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని దానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది చూడాలని అభిప్రాయపడింది. కేంద్రం యూ టర్న్ తీసుకుందనడం సబబు కాదు కేంద్రం ఈ కేసులో ‘యూ టర్న్’ తీసుకుందన్న న్యాయవాదుల ఆరోపణను, వారి వ్యతిరేకతను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అయితే గోప్యతా హక్కుతో పాటు పలు తీర్పులను పరిగణనలోకి తీసుకుని చూస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ‘యూ టర్న్’గా అభివర్ణించడం సబబు కాదని పేర్కొంది. -
‘ఐపీసీ'పై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
కొచ్చి: ‘భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)’ 155 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ శిక్షాస్మృతిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జేఎన్‌యూ విద్యార్థులపై దేశద్రోహం కేసులు మోపిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాలం చెల్లిన ఐపీసీ చట్టాలను ఇంకా యథాతథంగా కొనసాగిస్తుండటంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీసీకి 155 ఏళ్లు నిండిన సందర్భంగా కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ ‘గత 155 ఏళ్లలో ఐపీసీ చాలా తక్కువ మార్పులకు గురైంది. అతి కొద్ది నేరాలు మాత్రమే శిక్షార్హమైన నేరాల జాబితాలో చేరాయి. ఇప్పడు ఇందులో ఉన్న నేరాలు బ్రిటిషు వారి పాలనా సౌలభ్యం కోసం వారే ఏర్పాటు చేసుకున్నారు. జాబితాలో చేరాల్సిన నేరాలు చాలానే ఉన్నాయి. దీన్ని 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చాలి. న్యాయవ్యవస్థను పోలీసులు నిబద్ధతతో అమలు చేయాలి. పురాతన పోలీసు వ్యవస్థను కాలానికి అనుగుణంగా మార్చడం మన న్యాయవ్యవస్థ నెరవేర్చాల్సిన కర్తవ్యం’ అని సూచించారు. -
ఫిర్యాదు చేస్తే, పోయేది అతగాడి పరువే!
మెన్‌టోన్ లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులందరూ మహిళలేనని, నిందితులందరూ పురుషులేనని మన సమాజానికి నిశ్చితాభిప్రాయం ఉంది. అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామిక లక్షణం. అందువల్ల ఘనత వహించిన మన పత్రికలు, ప్రసార సాధనాలు, న్యాయస్థానాలు ఈ అభిప్రాయాన్ని ఇతోధికంగా గౌరవిస్తూనే ఉన్నాయి. అభిప్రాయాలను గౌరవించడంలో ఎలాంటి పేచీ లేదు. అయితే, వాస్తవాలను కూడా గుర్తించాలి కదా అనేదే పురుషాధముల గోడు. అరివీరభయంకర మైకాసురుల విజృంభణ కొనసాగే మీడియాలో అభాగ్య పురుషాధముల గోడు ఎవరికి వినిపించాలి? అదంతా బధిర శంఖారావమే! మహిళల బారిన పడి లైంగిక వేధింపులకు గురవుతున్న పురుషుల సంఖ్య గడచిన రెండు దశాబ్దాలుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తోందని అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోను, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇదే పరిస్థితి. రాజ్యాంగం ప్రవచించే సమానత్వమేదీ లైంగిక వేధింపుల చట్టాల్లో మచ్చుకైనా కనిపించదు. మన దేశం సంగతే తీసుకుంటే, ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 354, 354 ఎ, బీ, సీ, డీ సహా సంబంధిత ఇతరేతర చట్టాల్లోని సెక్షన్లన్నీ లైంగిక వేధింపుల కేసుల్లో... సమాజంలో ఎక్కువ సమానులైన మహిళలనే బాధితులుగా గుర్తిస్తాయి. పురుషులకు మహిళల నుంచి లైంగిక వేధింపులు ఎదురైతే, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకోవాలో పోలీసులకు కూడా తెలియని పరిస్థితి. మహిళల నుంచి లైంగిక వేధింపులకు గురయ్యే మగాళ్లలో చాలామంది ఎలాంటి ఫిర్యాదులూ చేయరు. వేధింపులు మరీ శ్రుతిమించి, మితిమీరితే గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప పోలీస్ స్టేషన్లను, కోర్టులను ఆశ్రయించరు. కర్మకాలి ఎవడైనా మగాధముడు తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేస్తే, పోయేది అతగాడి పరువే! బాధితుడి గోడు ఆలకించి, సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు సైతం ముందు అతడినే గేలి చేస్తారు. ఇక వ్యవహారం మీడియా వరకు వెళితే రచ్చ రచ్చే! ఇంత జరిగినా బాధితుడికి న్యాయం జరుగుతుందని ఎలాంటి గ్యారంటీ లేదు. - దాసు -
ఐపీసీ నుంచి ‘రాజద్రోహం’ తొలగించాలి
విరసం నేత వరవరరావు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) నుంచి కుట్ర, రాజద్రోహం సెక్షన్లను తొలగించాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. విరసం కార్యవర్గ సభ్యుడు ఖాసీంపై పెట్టిన కేసుని తక్షణమే ఎత్తివేయాలంటూ గీతాంజలి అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాతెలంగాణ కోసం గొంతెత్తి నినదించిన ఖాసీంపై రాజద్రోహ నేరం మోపడం కుట్ర పూరితమన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో పత్రికల చందాదారుల రసీదు పుస్తకాలు, పత్రికలు రాజద్రోహ నేరానికి కారణమెట్లా అవుతాయో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. మావోయుస్టుల ఎజెండానే నా ఎజెండా అన్న కేసీఆర్ ప్రభుత్వానికి ఖాసీం కుట్రదారుడిగా ఎలా కనిపించాడన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని హరించే ఏ చర్యనైనా ఖండించాల్సిందేనని కవి శివారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజులున్నారని నిరూపించేందుకే రాజద్రోహ కేసు పెట్టారని తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. కల్బుర్గి నుంచి నిన్నటి రోహిత్ వరకు జరిగిన పరిణామాలు, నిషేధాలు అన్నీ తనతో కలిసి నడిచిన వారిని వదిలించుకునే చర్యల్లో భాగమేనని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. ఏ ప్రభుత్వమయినా తన అధికారాన్ని కాపాడుకోవడానికే పనిచేస్తుందని, వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతు నొక్కేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని కవి నిఖిలేశ్వర్ చెప్పారు. వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, ప్రజానాట్యమండలి ప్రతాపరెడ్డి, కవి యాకూబ్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, బమ్మిడి జగదీశ్వరరావు, బండారు విజయ, అమ్మంగి వేణుగోపాల్, జూలూరి గౌరీశంకర్, నలమాస కృష్ణ, డప్పు రమేష్ పాల్గొన్నారు. -
జనస్వామ్యంలో రాజద్రోహం!
రాజులు పోయారు... రాజరికాలూ పోయాయి. దేశం ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా మారి 66 ఏళ్లవుతోంది. కానీ ‘రాజద్రోహం’ సెక్షన్ (124 ఏ) మాత్రం భారత శిక్షాస్మృతిలో ఉండిపోయింది. అది నిరసన తెలిపేవారినీ, భిన్నాభిప్రాయాన్ని ప్రకటించేవారినీ వేధిస్తూనే ఉంది. ఎందరినో జైలుపాలు చేస్తూనే ఉంది. ఒకపక్క ఈ సెక్షన్‌ను శిక్షాస్మృతి నుంచి తొలగించాలన్న డిమాండ్ వస్తుండగా...దాని అమలులో అనుసరించాల్సిన విధానాలను పొందుపరుస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎలాంటివారిపై ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చునో, ఎవరి చర్యలు దాని పరిధిలోకి వస్తాయో ఆ సర్క్యులర్ ఏకరువు పెట్టింది. మూడేళ్లక్రితం కాన్పూర్‌కు చెందిన కార్టూనిస్టు అసిమ్ త్రివేదీని రాజద్రోహం నేరంకింద అరెస్టు చేయడం చెల్లదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాక ఎలాంటి సందర్భాల్లో ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చునో వివరిస్తూ పోలీసులకు మార్గదర్శకాలు జారీచేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యవసానంగానే ఈ సర్క్యులర్ వెలువడింది. హైకోర్టు ఆదేశాల్లో సదుద్దేశం ఉంది. అయినదానికీ, కానిదానికీ ఈ సెక్షన్‌కింద కేసులు పెట్టడం అలవాటుగా మార్చుకున్న పోలీసుల తీరును సరిచేయడానికి ఇది అవసర మని న్యాయస్థానం భావించింది. బహుశా ఈ సర్క్యులర్‌ను చూశాక లోపం పోలీ సుల్లో కాదు... పాలకుల్లోనే ఉందని న్యాయస్థానానికి కూడా అర్ధమై ఉంటుంది. సర్క్యులర్‌లోని అంశాల్లోకి వెళ్లేముందు అసలు అసీమ్ త్రివేదీ కేసు నేపథ్యమేమిటో తెలుసుకోవాలి. అన్నా హజారే నేతృత్వంలో నడిచిన అవినీతి వ్యతిరేక పోరాటంలో త్రివేదీ కార్యకర్తగా పనిచేశారు. పాలకుల అవినీతి పోకడలను నిశితంగా విమర్శిస్తూ కుంచె ఆయుధంగా, ఇంటర్నెట్ వాహికగా కార్టూన్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం దృష్టిలో అదే పెద్ద నేరమైంది. త్రివేదీపై రాజద్రోహం నేరం కింద కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై జాతీయంగా, అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తడం...బొంబాయి హైకోర్టు జోక్యం పరిణామాల కారణంగా త్రివేదీకి వెనువెంటనే బెయిల్ లభించింది. నిజానికి ఆ సెక్షన్ అత్యంత కఠినమైనది. నేరం చేసినట్టు రుజువైతే ఆ సెక్షన్‌కింద యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాంటి సెక్షన్‌ను ఎడాపెడా ఉపయోగించి ఎవరిని పడితే వారిని ‘రాజద్రోహులు’గా పరిగణించడం అలవాటుగా మారింది. ఆ సెక్షన్‌కింద ఆదివాసీలు, దళితులు, రచయితలు, కళాకారులు ఎందరో అరెస్టవుతు న్నారు. ఈ సమస్య మహారాష్ట్రకు పరిమితమైనది కాదు. దేశమంతా ఇలాగే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ ప్రాంతాల్లో అంకిత భావంతో వైద్య సేవలందించిన డాక్టర్ బినాయక్ సేన్‌ను అక్కడి ప్రభుత్వం రాజద్రోహ నేరం కింద అరెస్టు చేయగా... ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. యూపీలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలను బయటపెట్టిన జర్నలిస్టు సీమా ఆజాద్, ఆమె భర్త ఈ సెక్షన్‌కిందే జైల్లో మగ్గారు. తమిళనాడులోని కూదంకుళంలో అణు విద్యుత్ ప్రాజెక్టు వద్దన్న ఉద్యమకారులు కూడా ఈ సెక్షన్‌కిందే అరెస్టయ్యారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే దీని అమలు విషయంలో ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని న్యాయస్థానం భావించి ఉంటుంది. తీరా మహారాష్ట్ర సర్కారు వెలువరించిన సర్క్యులర్ దాన్ని మరింత జటిలం చేసింది. ప్రభుత్వంపై చేసే సహేతుక విమర్శను కూడా అది నేరంగా పరిగణిస్తున్నది. ఏ విమర్శ అయినా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా ఉన్నా, అగౌరవపరిచేలా ఉన్నా, కూలదోసేలా ఉన్నా అలాంటి విమర్శ నేరమే అవుతుందని, అలాంటి విమర్శ చేసిన వారిపై ఈ సెక్షన్‌కింద కేసు పెట్టొచ్చునంటున్నది. మాట్లాడటం ద్వారా, రాయడం ద్వారా లేదా ఇతరత్రా రూపాల్లో ప్రభుత్వానికి చెందిన రాజకీయ నాయకులపై, ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విమర్శలు చేసినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుందని మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే విద్వేషం, ధిక్కారం వంటివి లేకుండా చట్ట బద్ధమైన విధానాల ద్వారా ప్రభుత్వంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి నప్పుడు ఈ సెక్షన్ వర్తించదని ముక్తాయించారు. ఏతా వాతా రాజద్రోహం సెక్షన్ అమలును ఇది మరింత విస్తృతపరిచింది. దాన్ని మరింత కఠినం చేసింది. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు వీలు కల్పిస్తున్న 19వ అధికరణ స్ఫూర్తినే ఇది దెబ్బతీస్తున్నది. తమకు ముందున్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సర్క్యులర్ రూపకల్పన జరిగిందని ఒకసారి... హోం మంత్రిత్వ శాఖలోని సిబ్బంది అనువాదంలో చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని మరోసారి ప్రభుత్వం ఇస్తున్న సంజాయిషీ నిజాన్ని కప్పెట్టలేదు. అసలు ఇలాంటి సెక్షన్‌ను శిక్షాస్మృతిలో ఇంకా కొనసాగిస్తున్నందుకు మన పాలకులు సిగ్గుపడాలి. బ్రిటిష్ వలసపాలకులు ఈ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకూ, ప్రజా ఉద్యమాలను అణగదొక్కేందుకూ 1870లో దీన్ని శిక్షా స్మృతిలో చేర్చారు. బాలగంగాధర్ తిలక్, అనీ బిసెంట్, మహాత్మా గాంధీ తదితర స్వాతంత్య్ర సమర యోధులను బ్రిటిష్ పాలకులు నిర్బంధించారు. మన దేశ పౌరులను ఏళ్ల తరబడి నిర్బంధించి, జాతీయోద్యమాన్ని అణగదొక్కిన అలాంటి సెక్షన్‌ను ఉంచడం ఆ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధమని తొలి తరం పాలకులకు తట్టక పోవడమే ఆశ్చర్యకరం. విచిత్రమేమంటే ఈ తరహా సెక్షన్‌ను బ్రిటన్ పాలకులు దశా బ్దాల క్రితమే తమ శిక్షాస్మృతి నుంచి తొలగించారు. అమెరికా 200 సంవత్సరాల క్రితమే ఈ మాదిరి చట్టాన్ని రద్దు చేసింది. అందరినీ హడలెత్తించి, దబాయించి పాలించవచ్చుననుకుంటే... నిరసన గళాలను అణిచేయొచ్చుననుకుంటే ప్రజాస్వా మ్యంలో చెల్లదని పాలకులు గ్రహించాలి. సర్క్యులర్ సంగతలా ఉంచి అసలు ‘రాజ ద్రోహం’ శిక్షాస్మృతిలోనే ఉండరాదని అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. -
420 అంటే..?
మోసగాళ్లను మన దేశంలో ‘ఫోర్ట్వంటీ’అంటుంటాం. బ్రిటిష్ హయాంలోనే 1860లో ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. ఇందులోని సెక్షన్ 420 మోసాన్ని నిర్వచిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ పుణ్యాన మోసగాళ్లకు మన దేశంలో ‘ఫోర్ట్వంటీ’లుగా గుర్తింపు వచ్చింది. అమెరికాలో ‘ఫోర్ట్వంటీ’ వేరే అర్థంలో వాడుకలో ఉంది. అక్కడ ‘ఫోర్ట్వంటీ’ అంటే ఏప్రిల్ 20. నెల సంఖ్య ముందు, తేదీ సంఖ్య తర్వాత రాసే అమెరికన్ పద్ధతి ప్రకారం (4/20) అది మామూలే కదా అనుకుంటున్నారా..? నిజమే! అయితే, ఈ తేదీకి మరో విశేషం కూడా ఉంది. గంజాయి వినియోగాన్ని నియంత్రించడాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం అమలులోకి తెచ్చిన చట్టం కోడ్ నంబర్ కూడా 420. అయితే ఏప్రిల్ 20 గంజాయి పొగరాయుళ్ల అనధికారిక సెలవు. దాంతో కాలిఫోర్నియాలో ఏటా ఏప్రిల్ 20వ తేదీన గంజాయి పొగరాయుళ్లు గుంపులుగా గుమిగూడి ‘దమ్ మారో దమ్’ అంటూ ఊగి తూగుతుంటారు. -
మంచి నిర్ణయం
క్షణికావేశమో... అనుకున్నది సాధించలేదన్న నిరాశనో... కోరుకున్నది దక్కలేదన్న భావనో... సర్వం కోల్పోయామన్న బాధనో... పట్టరాని ఉద్రేకమో, ఉద్వేగమో, భయమో...ఏదైతేనేమి, బతకడానికి ఒక్క కారణమూ కనబడని క్షణాన ఏ అభాగ్యజీవి అయినా సేద తీరాలనుకునేది మృత్యుదేవత ఒడిలోనే. కానీ ఆ ప్రయత్నంలో పొందే వైఫల్యం మిగిలిన అన్ని వైఫల్యాలకంటే ఎక్కువగా బాధిస్తుంది. ఇరుగుపొరుగువారిలో తనపై అనవసర ఆసక్తిని రేకెత్తిస్తుంది. సిగ్గుతో చితికిపోయేలా చేస్తుంది. ఒక ముద్రపడేందుకు ఆస్కారం కల్పిస్తుంది. అయినవారికి సరేసరి... వారు నిరంతరమూ, అనుక్షణమూ ఆదుర్దాతో సతమతమవుతారు. వీటన్నిటికంటే ఆత్మహత్యాయత్నం చేసేవారిని ఎక్కువగా బాధించేది-దాన్ని నేరంగా పరిగణించే రాజ్యస్వభావం! ఎవరినీ ఏమీ అనలేని అశక్తతలో ప్రాణం తీసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా నేరం కావడమేమిటని అలాంటివారు తల్లడిల్లుతారు. ఇక ఆత్మహత్య మహాపాపమని...దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసుకునే హక్కు ఎవరికీ లేదని దాదాపు అన్ని మతాలూ బోధిస్తాయి. ఆత్మహత్యాయత్నం చేసేవారిని దోషులుగా పరిగణించి ఏడాది శిక్ష విధించడం అత్యంత దుర్మార్గమూ, అమానుషమూ అనీ... అది మానవహక్కుల భావనకు విరుద్ధమని సామాజిక కార్యకర్తలు ఏనాటినుంచో వాదిస్తున్నారు. అలాంటివారి వాదనలు ఫలించి ఇన్నాళ్లకు భారత శిక్షాస్మృతినుంచి ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 309 రద్దవుతున్నది. దీన్ని తొలగించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బుధవారం ప్రకటించింది. వాస్తవానికి ఈ అమానవీయ నిబంధనను తొలగించాలన్న ప్రయత్నం ఈనాటిది కాదు. 1971లో అప్పటి లా కమిషన్ తన 42వ నివేదిక ద్వారా దీని రద్దుకు తొలిసారి సిఫార్సుచేసింది. అందుకు అనుగుణంగా 1978లో ప్రవేశపెట్టిన భారత శిక్షాస్మృతి సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది కూడా. దురదృష్టవశాత్తూ అప్పుడు లోక్‌సభ రద్దుకావడంతో అది కాస్తా మురిగిపోయింది. 1997లో మాత్రం లా కమిషన్ వేరే వైఖరిని తీసుకున్నది. దీన్ని కొనసాగించాలంటూ 156వ నివేదికలో సూచించింది. జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ నేతృత్వంలోని లా కమిషన్ 2008లో ఇచ్చిన 210వ నివేదిక ఈ సెక్షన్‌ను తొలగించాలని సిఫార్సు చేసింది. ఇక న్యాయస్థానాలు కూడా ఈ నిబంధనపై ఒక్కోసారి ఒక్కోరకంగా స్పందించాయి. మానవ సమాజంలో ఈ సెక్షన్ ఉండతగనిదని ఢిల్లీ హైకోర్టు 1981లో అభిప్రాయపడింది. ఆత్మహత్యాయత్నం నేరం కాదని 1994లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సెక్షన్ 309 చెల్లదన్నది. జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా చేస్తున్న రాజ్యాంగంలోని 21వ అధికరణంలోనే ‘బలవంతంగా జీవించకూడదని కోరుకునే హక్కు’ కూడా ఇమిడి ఉన్నదని... అలా చూస్తే 309 రాజ్యాంగ విరుద్ధమవుతుందని అభిప్రాయపడింది. అయితే, ఈ అభిప్రాయాన్ని 1996లో సుప్రీంకోర్టే మార్చుకుంది. 21వ అధికరణానికి ఇలాంటి భాష్యం చెప్పడం సరికాదని తీర్పునిచ్చింది. మొత్తానికి విషయం మొదటికొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆదినుంచీ ఆత్మహత్యకు ప్రయత్నించడమనేది మానసిక సమస్యేనని చెబుతున్నది. అలాంటివారిని నేరస్తులుగా చూడటంకంటే అనారోగ్యానికి లోనైనవారిగా పరిగణించి చికిత్స జరిపించాలని కోరుతున్నది. ప్రపంచదేశాల్లో మనతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, సింగపూర్ వంటివి మినహా మిగిలినవన్నీ ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే చట్టాలను రద్దుచేశాయి. ఇతరత్రా జరిగే ఆత్మహత్యల సంగతలా ఉంచి అందరికీ అన్నంపెట్టే రైతులు రుణభారంతో కుంగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో నానాటికీ ఆత్మసై్థర్యం కొరవడి బలవన్మరణాలకు మొగ్గుచూపుతున్నారని ఈమధ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంక సహితంగా తెలిపింది. 2013లో దేశవ్యాప్తంగా 1,34,799 ఆత్మహత్యలు చోటుచేసుకోగా అందులో 90,543 మంది పురుషులైతే 44,256మంది మహిళలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ధోరణే కనబడింది. ఆ ఏడాది 9,902 మంది పురుషులు, 4,705 మంది మహిళలు ఉసురు తీసుకున్నారు. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ తొలి స్థానంలో ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకటించింది. ఆత్మహత్యలకు పురిగొల్పే కారణాలను నివారించలేకపోతున్న మన ప్రభుత్వాలు రాజకీయ ఉద్దేశాలతో చేసే నిరశన దీక్షలను ఆత్మహత్యాయత్నంగా పరిగణించి 309 నిబంధనను విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నాయి. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 14 ఏళ్లనుంచి నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ మణిపూస ఇరోం షర్మిలను ఈ సెక్షన్‌కిందే పదే పదే అరెస్టుచేసి ఖైదుచేసి బలవంతంగా ఆహారాన్ని ఎక్కిస్తున్నారు. ఈ సెక్షన్‌ను తొలగిస్తే ఆత్మహత్యలు పెరగవచ్చునని ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఆమరణ దీక్షలు చేసేవారి సంఖ్య పెరుగుతుందని మధ్యప్రదేశ్ అభిప్రాయపడి తే... రైతులను బలవన్మరణాల జోలికిపోకుండా నివారించే చట్టమేదీ ఉండదని పంజాబ్ ఆందోళన వ్యక్తంచేసింది. మొత్తానికి 309 తొలగింపునకు 18 రాష్ట్రాలు అనుకూలంగా, అయిదు రాష్ట్రాలు వ్యతిరేకంగా స్పందించాయి. ఆత్మహత్యల విషయంలో ఈ సెక్షన్‌కు పరిమితం కాకుండా ఆలోచించగలిగితే నివారణమార్గాలు దొరుకుతాయి. వాటి సంగతలా ఉంచి ఆత్మహత్యాయత్నం చేసినవారిని ముందు పోలీస్‌స్టేషన్‌లో, ఆ తర్వాత కోర్టు బోనులో, ఆనక జైల్లో ఉంచడం కాకుండా నిపుణులు సూచిస్తున్నట్టు వైద్య చికిత్సకు పంపడమే సరైంది. చావుబతుకుల పొలిమేరల్లోకి వెళ్లి వచ్చినవారిని చేరదీసి సాంత్వన చేకూరిస్తే...నిరాశానిస్పృహల నుంచి వారిని దూరం చేస్తే, ఆత్మవిశ్వాసాన్ని పెంచితే నిండు జీవితాలు నిలబడతాయి. ఇందుకవసరమైన కౌన్సెలింగ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు ఇకనైనా ప్రయత్నించాలి. -
అత్యాచారంపై తప్పుడు ఫిర్యాదు... మహిళకు శిక్ష
ఇండోర్: తనపై అత్యాచారం చేసినట్లు ఒక వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ ఇండోర్ అదనపు సెషన్స్ జడ్జి ఇందిరా సింగ్ తీర్పునిచ్చారు. చంచల్ రాఠోడ్ (35) అనే మహిళ తనపై తన ఇంటి యజమాని రూప్‌కిశోర్ అగర్వాల్ (53) అత్యాచా రానికి పాల్పడ్డారంటూ 2012 డిసెంబర్లో పలాసియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీని ఫలితంగా రూప్‌కిశోర్ రెండున్నర నెలలు జైలులో గడపాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక మనస్తాపంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, గత మే 13న అదనపు సెషన్స్ జడ్జి సవితా దుబే విచారణ జరిపినప్పుడు చంచల్ మాట మార్చింది.