రాజులు పోయారు... రాజరికాలూ పోయాయి. దేశం ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా మారి 66 ఏళ్లవుతోంది. కానీ ‘రాజద్రోహం’ సెక్షన్ (124 ఏ) మాత్రం భారత శిక్షాస్మృతిలో ఉండిపోయింది. అది నిరసన తెలిపేవారినీ, భిన్నాభిప్రాయాన్ని ప్రకటించేవారినీ వేధిస్తూనే ఉంది. ఎందరినో జైలుపాలు చేస్తూనే ఉంది. ఒకపక్క ఈ సెక్షన్‌ను శిక్షాస్మృతి నుంచి తొలగించాలన్న డిమాండ్ వస్తుండగా...దాని అమలులో అనుసరించాల్సిన విధానాలను పొందుపరుస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎలాంటివారిపై ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చునో, ఎవరి చర్యలు దాని పరిధిలోకి వస్తాయో ఆ సర్క్యులర్ ఏకరువు పెట్టింది.
మూడేళ్లక్రితం కాన్పూర్‌కు చెందిన కార్టూనిస్టు అసిమ్ త్రివేదీని రాజద్రోహం నేరంకింద అరెస్టు చేయడం చెల్లదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాక ఎలాంటి సందర్భాల్లో ఈ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చునో వివరిస్తూ పోలీసులకు మార్గదర్శకాలు జారీచేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యవసానంగానే ఈ సర్క్యులర్ వెలువడింది. హైకోర్టు ఆదేశాల్లో సదుద్దేశం ఉంది. అయినదానికీ, కానిదానికీ ఈ సెక్షన్‌కింద కేసులు పెట్టడం అలవాటుగా మార్చుకున్న పోలీసుల తీరును సరిచేయడానికి ఇది అవసర మని న్యాయస్థానం భావించింది. బహుశా ఈ సర్క్యులర్‌ను చూశాక లోపం పోలీ సుల్లో కాదు... పాలకుల్లోనే ఉందని న్యాయస్థానానికి కూడా అర్ధమై ఉంటుంది.
సర్క్యులర్‌లోని అంశాల్లోకి వెళ్లేముందు అసలు అసీమ్ త్రివేదీ కేసు నేపథ్యమేమిటో తెలుసుకోవాలి. అన్నా హజారే నేతృత్వంలో నడిచిన అవినీతి వ్యతిరేక పోరాటంలో త్రివేదీ కార్యకర్తగా పనిచేశారు. పాలకుల అవినీతి పోకడలను నిశితంగా విమర్శిస్తూ కుంచె ఆయుధంగా, ఇంటర్నెట్ వాహికగా కార్టూన్ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం దృష్టిలో అదే పెద్ద నేరమైంది. త్రివేదీపై రాజద్రోహం నేరం కింద కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై జాతీయంగా, అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తడం...బొంబాయి హైకోర్టు జోక్యం పరిణామాల కారణంగా త్రివేదీకి వెనువెంటనే బెయిల్ లభించింది. నిజానికి ఆ సెక్షన్ అత్యంత కఠినమైనది. నేరం చేసినట్టు రుజువైతే ఆ సెక్షన్‌కింద యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది.
అలాంటి సెక్షన్‌ను ఎడాపెడా ఉపయోగించి ఎవరిని పడితే వారిని ‘రాజద్రోహులు’గా పరిగణించడం అలవాటుగా మారింది. ఆ సెక్షన్‌కింద ఆదివాసీలు, దళితులు, రచయితలు, కళాకారులు ఎందరో అరెస్టవుతు న్నారు. ఈ సమస్య మహారాష్ట్రకు పరిమితమైనది కాదు. దేశమంతా ఇలాగే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ ప్రాంతాల్లో అంకిత భావంతో వైద్య సేవలందించిన డాక్టర్ బినాయక్ సేన్‌ను అక్కడి ప్రభుత్వం రాజద్రోహ నేరం కింద అరెస్టు చేయగా... ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. యూపీలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలను బయటపెట్టిన జర్నలిస్టు సీమా ఆజాద్, ఆమె భర్త ఈ సెక్షన్‌కిందే జైల్లో మగ్గారు. తమిళనాడులోని కూదంకుళంలో అణు విద్యుత్ ప్రాజెక్టు వద్దన్న ఉద్యమకారులు కూడా ఈ సెక్షన్‌కిందే అరెస్టయ్యారు.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే దీని అమలు విషయంలో ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని న్యాయస్థానం భావించి ఉంటుంది. తీరా మహారాష్ట్ర సర్కారు వెలువరించిన సర్క్యులర్ దాన్ని మరింత జటిలం చేసింది. ప్రభుత్వంపై చేసే సహేతుక విమర్శను కూడా అది నేరంగా పరిగణిస్తున్నది. ఏ విమర్శ అయినా ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా ఉన్నా, అగౌరవపరిచేలా ఉన్నా, కూలదోసేలా ఉన్నా అలాంటి విమర్శ నేరమే అవుతుందని, అలాంటి విమర్శ చేసిన వారిపై ఈ సెక్షన్‌కింద కేసు పెట్టొచ్చునంటున్నది. మాట్లాడటం ద్వారా, రాయడం ద్వారా లేదా ఇతరత్రా రూపాల్లో ప్రభుత్వానికి చెందిన రాజకీయ నాయకులపై, ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విమర్శలు చేసినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుందని మార్గదర్శకాలు చెబుతున్నాయి.
అయితే విద్వేషం, ధిక్కారం వంటివి లేకుండా చట్ట బద్ధమైన విధానాల ద్వారా ప్రభుత్వంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించి నప్పుడు ఈ సెక్షన్ వర్తించదని ముక్తాయించారు. ఏతా వాతా రాజద్రోహం సెక్షన్ అమలును ఇది మరింత విస్తృతపరిచింది. దాన్ని మరింత కఠినం చేసింది. రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు వీలు కల్పిస్తున్న 19వ అధికరణ స్ఫూర్తినే ఇది దెబ్బతీస్తున్నది. తమకు ముందున్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సర్క్యులర్ రూపకల్పన జరిగిందని ఒకసారి... హోం మంత్రిత్వ శాఖలోని సిబ్బంది అనువాదంలో చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని మరోసారి ప్రభుత్వం ఇస్తున్న సంజాయిషీ నిజాన్ని కప్పెట్టలేదు.
అసలు ఇలాంటి సెక్షన్‌ను శిక్షాస్మృతిలో ఇంకా కొనసాగిస్తున్నందుకు మన పాలకులు సిగ్గుపడాలి. బ్రిటిష్ వలసపాలకులు ఈ దేశంలో తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకూ, ప్రజా ఉద్యమాలను అణగదొక్కేందుకూ 1870లో దీన్ని శిక్షా స్మృతిలో చేర్చారు. బాలగంగాధర్ తిలక్, అనీ బిసెంట్, మహాత్మా గాంధీ తదితర స్వాతంత్య్ర సమర యోధులను బ్రిటిష్ పాలకులు నిర్బంధించారు. మన దేశ పౌరులను ఏళ్ల తరబడి నిర్బంధించి, జాతీయోద్యమాన్ని అణగదొక్కిన అలాంటి సెక్షన్‌ను ఉంచడం ఆ ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధమని తొలి తరం పాలకులకు తట్టక పోవడమే ఆశ్చర్యకరం. విచిత్రమేమంటే ఈ తరహా సెక్షన్‌ను బ్రిటన్ పాలకులు దశా బ్దాల క్రితమే తమ శిక్షాస్మృతి నుంచి తొలగించారు. అమెరికా 200 సంవత్సరాల క్రితమే ఈ మాదిరి చట్టాన్ని రద్దు చేసింది. అందరినీ హడలెత్తించి, దబాయించి పాలించవచ్చుననుకుంటే... నిరసన గళాలను అణిచేయొచ్చుననుకుంటే ప్రజాస్వా మ్యంలో చెల్లదని పాలకులు గ్రహించాలి. సర్క్యులర్ సంగతలా ఉంచి అసలు ‘రాజ ద్రోహం’ శిక్షాస్మృతిలోనే ఉండరాదని అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
జనస్వామ్యంలో రాజద్రోహం!
Published Tue, Sep 8 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement
Advertisement