
స్టాక్ మార్కెట్ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్ 'మాదభి పురి బుచ్' (Madhabi Puri Buch)కు ఊరట లభించింది. పురి, మరో ఐదుగురిపై పోలీసు కేసు నమోదు చేయాలన్న దిగువ కోర్టు ఆదేశాన్ని, బాంబే హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్టాక్‌ఎక్స్ఛేంజ్‌లో కంపెనీలను లిస్ట్ చేయడంలో ఆర్ధిక పరమైన మోసం జరిగిందని ఆరోపిస్తూ.. సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇందులో పురి బుచ్ మాత్రమే కాకుండా.. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్లైన అశ్వని భాటియా, అనంత్ నారాయణ్, కమలేష్ చంద్ర వర్ష్నీలు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామమూర్తి, బిఎస్ఇ మాజీ చైర్మన్ & పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ ఉన్నారు.
ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల తరువాత.. పురి బుచ్, మిగిలిన ఐదుగురు హైకోర్టులో వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపి.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది.
పూర్తిస్థాయి పరిశీలన లేకుండానే.. కింది కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కనిపిస్తోంది. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత వాటిని నిలిపివేస్తున్నాం.. అని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ వరకు వీరిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని కూడా ఏసీబీని ఆదేశించింది.
నిజానికి పురి బుచ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అదానీ గ్రూపుకు చెందిన కొన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు.. గతేడాది ఆగస్టులో హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఆ తరువాత ఒక్కొక్కటిగా.. ఈమెపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన ఆరోపణలన్నీ ఒట్టివే అని పురి బుచ్ కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment