న్యూఢిల్లీ: కోడలి నగలను అత్తింటి వారు భద్రపరిస్తే భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 498–ఏ సెక్షన్ ప్రకారం అది క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్తింటి వారు తన నగలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా తనను వేధిస్తున్నారన్న ఆరోపణలపై భర్త, అత్త, బావపై పంజాబ్‌కు చెందిన ఒక మహిళ కేసు పెట్టింది. ఇలా నగలు తీసుకోవడం అత్తింటివారు కోడలిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడమేనంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త తిరిగి వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆ భర్త వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం విచారించింది. ఎన్ని నగలు తీసుకున్నారో, వాటి విలువ ఎంత అనే వివరాలేవీ పిటిషనర్ వెల్లడించలేదని, తన జీవితం ఏ విధంగా నాశనం చేశారనే విషయాలనూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఈ కేసులో నగలు తీసుకోవడం సెక్షన్ 498ఏ కింద క్రూరత్వం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు పంజాబ్ , హరియాణా హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా?
భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చేయడం గోప్యతకు భంగం కలిస్తుందా? అనే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. 12 డిసెంబర్ 2021న పంజాబ్–హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2009లో వివాహం చేసుకున్న వ్యక్తి 2017లో తనకు విడాకులు కావాలంటూ బటిండా ఫ్యామిలీ కోర్టులో కేసు వేశాడు. అందుకు కారణంగా భార్య ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. 2020లో బటిండా ఫ్యామిలీ కోర్టు ఆ రికార్డులను అంగీకరించింది. సంభాషణల రికార్డును పరిగణనలోకి తీసుకోవడం తన గోప్యతకు భంగం కలిగించడమేనని ఆ మహిళ పంజాబ్,హరియాణా హైకోర్టులో అప్పీలు చేసింది. ఆమె వాదనలతో హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఏకీభవించింది.
Comments
Please login to add a commentAdd a comment