
న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ శిక్షణా అధికారిణి పూజా ఖేద్కర్‌కు సుప్రీం కోర్టు(Supreme Court)లో మరోసారి ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను మంగళవారం మరోసారి కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో.. దర్యాప్తు ఆలస్యంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తనంతట తానుగా విచారణకు సహకరిస్తానని ఆమె చెప్పారు. అయినా కూడా ఇంత ఆలస్యం దేనికి? అంటూ ఢిల్లీ పోలీసులపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వెల్లగక్కింది. ఈ కేసులో త్వరగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పరీక్షలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారని పూజా ఖేద్కర్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి.. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు దానిని తిరస్కరించడంతో.. ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయతే ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే.. ఈ ఏడాది జనవరిలో ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఆదేశాలను పొడిగించింది.
పూజా ఖేద్కర్(Puja Khedkar) వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఢిల్లీ పోలీసుల తరఫు వాదనలు వినిపించిన అదనపు సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు. కానీ, పరీక్ష రాసే సమయం నాటికి ఆమెకు కంటి చూపు సరిగా లేదని, ఆమె ఫోర్జరీకి పాల్పడిందన్న అభియోగంలోనూ నిజం లేదని పూజా తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు ఆమె లాయర్‌కు తేల్చి చెప్పింది.
ఈ పిటిషన్‌పై ఇప్పటివరకు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఫోర్జరీ వ్యవహారంపై విచారణకు ఆమెను కస్టడీలోకి తీసుకునే విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో విచారణ త్వరగతిన పూర్తయ్యేలా చూడాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ పూజా పిటిషన్ విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment