ఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ప్రాణ హాని ఉందన్న ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఆమె వినతి పిటిషన్‌కు సానుకూలంగా స్పందించింది.
ఆమెపై దాఖలైన అన్ని కేసులన్నింటిని కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఐఎఫ్‌ఎస్‌వో యూనిట్‌కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను బుధవారం ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. అంతేకాదు తనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను సైతం నూపుర్ శర్మకు ఇస్తున్నట్లు తెలిపింది.
తనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయని, అయితే విచారణ నిమిత్తం తాను అక్కడికి వెళ్తే దాడులు జరగొచ్చని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నూపుర్ శర్మ.. సుప్రీంలో వినతి పిటిషన్ వేసింది. కాబట్టి, తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరింది. ఈ మేరకు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని బెంచ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో కొత్తగా ఏదైనా ఎఫ్‌ఐఆర్ నమోదు అయినా కూడా ఢిల్లీకే బదిలీ చేయాలని సుప్రీం పేర్కొంది.
గతంలో ఇదే బెంచ్.. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి. ఆమెవి అహంకారపూరిత వ్యాఖ్యలు’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది కూడా.
ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్(ఐఎఫ్‌ఎస్‌వో) అనేది ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం. ద్వారకాలో దీని ఆఫీస్ ఉంది. ప్రధానమైన కేసులతో పాటు సున్నితమైన అంశాలను ఇది పరిశీలిస్తుంటుంది.
ఇదీ చదవండి: మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి-నూపుర్
Comments
Please login to add a commentAdd a comment