న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్ చెల్లదని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కిందటి ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దీంతో.. రిమాండ్ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా పంకజ్ బన్సాల్ కేసును కోర్టు ప్రస్తావించింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్ బన్సాల్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్ స్పష్టం చేసింది.
చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్టోబర్ 3వ తేదీన న్యూస్‌క్లిక్‌పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అదే రోజు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు.
‘న్యూస్‌క్లిక్’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్‌సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.
ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
ఇంకోవైపు.. ‘న్యూస్‌క్లిక్’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు ఆ సమయంలో మండిపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment