పాకిస్తాన్ నుంచి భారతదేశం నేర్చుకునే విషయాలు చాలా తక్కువ. కానీ ఆ దేశం నుంచి కూడా మనం నేర్చుకునే విషయాలు ఉన్నాయని లాహోర్ హైకోర్టు ఈ మధ్య ఇచ్చిన ‘రాజద్రోహం రద్దు’ తీర్పు చూసిన తరువాత అనిపిస్తుంది. పాకిస్తాన్ పీనల్ కోడ్‌లో ఉన్న సెక్షన్ 124(ఏ) అనేది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పును ప్రకటించింది. ఆ నిబంధన దుర్వినియోగం అవుతోందనీ, అది వలసవాదులు వదిలిన అవశేషమనీ లాహోర్ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వాలు తమ ప్రత్య ర్థులకి వ్యతిరేకంగా ఈ నిబంధనను ఉపయోగిస్తున్నా యని దాఖలైన బ్యాచ్ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి షాహీద్ కరీమ్ ఈ నిబంధనును రద్దు చేశారు.
పాకిస్తాన్ మాజీ నియంత జనరల్ పర్వేజ్ ముషా ఫ్ 2007వ సంవత్సరంలో రాజ్యాంగాన్ని తారుమారు చేసినందుకు... 2019వ సంవత్సరంలో ఆయనను దోషిగా నిర్ధారించి, మరణశిక్షను విధించిన న్యాయ మూర్తి జస్టిస్ కరీం. మన దేశం, పాకిస్తాన్ ఇరుదేశాలూ ఈ నిబంధనను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వారసత్వంగా పొందినవే. భారతీయులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన నిబంధన సెక్షన్ 124(ఏ). భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచిన వ్యక్తులనూ, అదే విధంగా అప్పుడు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వ్యక్తులనూ అణచి వేయడానికి తయారు చేసిన నిబంధన ఇది. మహాత్మాగాంధీ, బాల గంగాధర్ తిలక్ లాంటి వ్యక్తులు అందరూ ఈ నిబంధన బాధితులే.
సెక్షన్ 124 (ఏ) నిబంధనను సుప్రీంకోర్టు గత సంవత్సరం రద్దు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను పునఃపరిశీలించే వరకు ఈ నిబంధనను ఆపేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఈ నిబంధన కింద కేసులను నమోదు చేయకూడదు. దీని కింద అభియోగాలు ఉన్న అన్ని విచారణలనూ, అప్పీళ్లనూ, ఇతర ప్రొసీడింగ్స్‌నూ ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మా సనం భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం దీనిని ఉపసంహరించడానికి ఎలాంటి ఆసక్తినీ కనబ రచడం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టు భారత ప్రభుత్వం పునఃపరిశీలన కూడా చేయలేదు. మన సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఈ నిబంధనను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని లేదా పరిశీలించాలని చెప్పింది. కానీ రద్దు చేయలేదు. కానీ పాకిస్తాన్ హైకోర్టు మన సుప్రీంకోర్టు కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి దీనిని రద్దు చేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని కూడా ప్రకటించింది. అందుకని మనం ఈ విషయంలో పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాల్సి ఉంది.
సెక్షన్ 124 (ఏ) అనేది మన దేశంలో, పాకిస్తాన్‌లో ఒకే విధంగా ఉంది. ఎవరైనా, మాటల ద్వారా, ద్వేషం వల్ల ధిక్కారాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేసినా, లేదా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడానికి లేదా ప్రేరేపించ ప్రయత్నం చేసినా... వాళ్ళను ఈ నిబంధన కింద శిక్షించడానికి అవకాశం ఉంది. 1962వ సంవత్సరంలో ‘కేదార్‌నాథ్’ కేసులో ఈ నిబంధన చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ దీని పరిధిని పరిమితం చేసింది.
అశాంతి సృష్టించే ఉద్దేశంతో లేదా హింసను ప్రేరేపించే చర్యలకు మాత్రమే ఈ నిబంధనను పరి మితం చేయాలని కోర్టు నిర్దేశించింది. కానీ పాలకులు దీన్ని పట్టించుకోలేదు. నిబంధనలో ఉన్న అంశాలను అక్షరాలా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి, దేశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేదు. నినాదాలు చేసినందుకు, శాంతియుతంగా నిరసన తెలిపినా, ప్రభు త్వాన్ని విమర్శిస్తూ పోస్టులను పెట్టినా వారిపై తరచూ దేశద్రోహ కేసులను నమోదు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిపోయింది. దేశ పౌరులను బెదిరించడం సర్వ సాధారణమై పోయింది. పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న ప్రస్తుత రాజకీయ గందరగోళంలో ఈ నిబంధనను రద్దు చేయడం చరిత్రాత్మకమైన విషయంగా పేర్కొ నవచ్చు. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు. భారత పౌరుల హక్కులను ఇది కాలరాస్తోంది. ప్రజాస్వామ్య వ్వవస్థలో ఇది ఉండటానికి వీల్లేదు. చాలా ప్రజాస్వామ్య దేశాలు దీన్ని రద్దు చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఈ నిబంధన రద్దు
గురించి స్పందన కన్పించలేదు. కానీ ఆ దేశంలోని రాజకీయ పక్షాలు, పౌరులు, జర్నలిస్టులు, న్యాయ వాదులు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. పాకి స్తాన్‌లోని మానవ హక్కుల కమిషన్ కూడా ఈ రద్దును స్వాగతించింది.
భారత ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ల దగ్గర నుంచి మనకు సంక్రమించిన చాలా శాసనాలను పురాత నమైనవిగా భావించి రద్దు చేసింది. దాదాపుగా 1500 చట్టాలను తొలగించింది. కాని, ఈ నిబంధనను తొలగించడానికి ఉత్సుకత చూపించడం లేదు. భారతదేశ మొదటి ప్రధాని దీని బాధితుడే. కానీ – భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవ రణ ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఏర్పడినాయి. ఇందిరాగాంధీ హయాంలో సెక్షన్ 124 (ఏ)ను కాగ్నిజబుల్ నేరంగా మార్చారు. అది 1974 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ నిబంధన దుర్వినియోగం జరుగుతున్నా పాల కులు దీనిని తొలగించడానికి ఇష్టపడడం లేదు. లాహోర్ హైకోర్టు తీర్పుతోనైనా మన దేశంలోనూ దీనిని త్వరగా తొలగిస్తే మన ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది.
మంగారి రాజేందర్, వ్యాసకర్త మాజీ జిల్లా జడ్జి.
Comments
Please login to add a commentAdd a comment