జస్టిస్ ఫిడ్జరాల్డ్ (1868 ఇంగ్లాండ్) ‘దేశద్రోహం’ అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు జర్నలిస్టుల కేసును విచారిస్తూ, జర్నలిస్టుల విమర్శనా హక్కును సమర్థిస్తూ, ప్రభుత్వ న్యాయపాలనా వ్యవస్థ నిర్ణయాలనే, దాని నిర్వాహకుల ఉద్దేశాలనే విమర్శించే హక్కు జర్నలిస్టులకు ఉంది. కాని ఇదే జర్నలిస్టులు తమ పరిధులు దాటి ప్రజలలో కావాలని ప్రభుత్వం పైన ఏహ్యతను, అగౌరవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే, చట్టం విద్రోహం కింద జమకడుతుందన్నాడు! అయితే అదే సమయంలో ప్రభుత్వ చర్యలను ఎంతగా విమర్శించినా ఆ చర్చ, ఆ విమర్శ, ఎంత స్వేచ్ఛగా సాగినా అది ప్రభుత్వంపై ప్రజలలో విద్వేషాన్ని, అసహనాన్ని రెచ్చగొట్టేదిగా ఉండకూడదు. ఆ పరిధి దాటినప్పుడే అది పనిగట్టుకుని రెచ్చగొట్టే రాతల కిందికి, చర్చల కిందికి వస్తుంది కూడా అని జస్టిస్ ఫిడ్జరాల్డ్ పేర్కొన్నాడు.
ఒక్కో చెట్టు నీడలో నిజం బతికి బట్టకట్టదు, న్యాయం చచ్చిపోతుందట! అలాగే కొందరు జర్నలిస్టులు ఏదో సాధిద్దామనుకొని తమ చేతిలో ఉన్న కలం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అర్ధ సత్యాలను వ్యాపింపజేస్తూ వాటినే తిరుగులేని సత్యాలుగా, ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి పత్రికలనే ‘దురదగొండి’ బాపతు అంటారు, కానీ ఆత్మనిగ్రహంతో సమన్వయ పూర్వకంగా నడిచే ప్రతిష్టాత్మక వార్తాపత్రికలకు, జర్నలిస్టులకు ఈ జబ్బు ఉండదు’’. – సుప్రసిద్ధ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. ఆర్. కృష్ణయ్యర్ ‘వెనల్–వెనియల్ జర్నలిజం, వల్నరబుల్ జ్యుడిషియలిజం’’ ‘రాజద్రోహ (దేశద్రోహ) నేరారోపణ కేసుల్లో జర్నలిస్టులకు రక్షణ అవసరం. ప్రభుత్వ విధానాలను లేదా చర్యలను విమర్శించే హక్కు, కఠినాతికఠినంగా విమర్శించే హక్కు ప్రభుత్వ విధానాలను మెరుగుపరిచే దృష్టితో లేదా వాటిని లీగల్ మార్గాల ద్వారా మరింత సవరించే హక్కు జర్నలిస్టులకు ఉంది. అందువల్ల జర్నలిస్టుల అభిప్రాయ ప్రకటనకు గల స్వేచ్ఛను సెడిషన్ అభియోగం నుంచి కాపాడి తీరాలి. ప్రజల స్థితిగతులను మెరుగుపరిచే దృష్ట్యా జర్నలిస్టులు, ప్రభుత్వ చర్యలపై నిశితంగా వ్యాఖ్యానించి విమర్శించే హక్కు ఉంది’’. –గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలో ఉన్న సుప్రీం బెంచ్ తీర్పు (3–6–21)
గత ఏడేళ్లుగానూ, అంతకుముందు కొన్ని సందర్భాలలోనూ పాలక వర్గాల ‘సన్నాయి నొక్కుళ్లకు’ అనేక సందర్భాలలో, ఊగిసలాడుతూ తిరుగులేని తీర్పులు ఇవ్వడంలో కొంత జంకుతూ వచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కొన్ని మాసాలుగా తన స్వతంత్రమైన విశిష్ట స్థానాన్ని జాగరూకతతో కాపాడుకుని నిలదొక్కుకోడానికి ప్రయత్నించడం హర్షణీయమూ, గర్వకారణం కూడా. సీనియర్ జర్నలిస్టు, ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత వినోద్ దువాపైన అరవైఏళ్లనాటి ‘రాజద్రోహ’ నేరం తాలూకు ‘కవిలకట్ట’ను బయటకు లాగి పాలకులు ప్రయోగించబోవడమే సుప్రీం తాజా నిర్ణయానికి కారణమయింది. ఇంతకుముందు కొలది రోజులనాడే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరోనా మహమ్మారి తాండవిస్తున్న సందర్భంలో ఎలక్షన్ కమిషన్ భారీఎత్తున సభలు, సమావేశాలు ఎలక్షన్ ర్యాలీలు అనుమతించినందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులపై హత్యానేరం ఎందుకు మోపకూడదని ఆ రాష్ట్ర ౖహై కోర్టు ప్రశ్నించింది. దానిపై ఎలక్షన్ కమిషన్, హైకోర్టు హెచ్చరికను పత్రికలు ప్రచురించకుండా చూడవలసిందిగా సుప్రీంబెంచ్‌కి మొరపెట్టుకున్నా సుప్రీం బెంచ్ పాటించ నిరాకరించడం సుప్రీంలో ఆలస్యంగానైనా వచ్చిన గుణాత్మకమైన మార్పులకు ఒక నిదర్శనంగా భావించవచ్చు.
అంతేకాదు, పత్రికాస్వేచ్ఛను కోర్టులో వాదోపవాదాల రిపోర్టింగ్ వరకూ విస్తరించ వలసిందేనని జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ తన తీర్పులో నొక్కి చెప్పింది! అంతేకాదు జస్టిస్ లలిత్ బెంచ్ 1962 నాటి కేదార్‌నాథ్ సింగ్ తీర్పును ఉదాహరిస్తూ ‘దేశద్రోహం అనే అభియోగం సెడిషన్ 124– ఎ క్రిమినల్‌లా కేవలం చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని హింసాచర్యల ద్వారా కూలద్రోసే ప్రయత్నాన్ని అడ్డుకోడానికి మాత్రమే ఉద్దేశించింది గాని, దేశప్రజల స్థితిగతులను మెరుగుపరచి తీరాలని, అందుకు సంబంధించిన చట్టాలను మార్చి తీరాలని కోరే డిమాండ్లకు ఆందోళనలకు వర్తించదని సుప్రీం తాజా తీర్పులో (లలిత్ బెంచ్) స్పష్టం చేసిందని గుర్తించాలి. అంతేకాదు ‘ ది గ్రేట్ రిప్రెషన్’ అన్న మకుటంలో సుప్రసిద్ధ జర్నలిస్టు, సుప్రీంకోర్టు న్యాయవాది, చిత్రాంషుల్ సిన్హా భారతదేశంలో ‘రాజద్రోహ/ దేశద్రోహం’ కేసుల పుట్టుపూర్వాలను జల్లెడ పడుతూ రాసిన గ్రంథం అనేక చారిత్రక సత్యాల పుట్ట (2019)! అందులో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్‌లోని ‘124–ఎ’ నేరం పేరిట 58 మందిని అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. కాగా అదే ‘దేశద్రోహం’ నేరం అభియోగం కింద అరెస్టుచేసిన 61 మంది కేసులు అతీగతి 2019 వరకూ తేలలేదు. కనీసం సుప్రీంకోర్టు ఈ కేసుల మంచి చెడులను 2019 వరకూ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు! అలాగే ‘రాజద్రోహ’ నేరానికి పాల్పడ్డారన్న అభియోగానికి సంబంధించి 33 శాతం కేసులు ఇంతవరకూ విచారణకు రాలేదని తెలిసి పోలీసులే ఆ కేసుల్ని మూసేశారట! ఇంక 2016లో ‘రాజద్రోహ’ నేరారోపణపై అరెస్టు చేసిన 48 మందిలో, 26 మందిపై చాలాకాలానికి గాని చార్జిషీట్లు తెరవలేదట! ‘పాలకులు పాల్పడే ఈ నిరంకుశ చర్యల్ని సుమోటోగా ప్రశ్నించిన దాఖలాలు లేవు! అదేమంటే ఆ పని శాసన వేదికల బాధ్యత అని సుప్రీం సరిపెట్టుకుంటుంది.!
చివరికి ఈ శాసనాలు, ఈ చట్టసభలు, న్యాయస్థానాలూ ‘ఎవరికి పుట్టిన బిడ్డలురా, ఎక్కెక్కి ఏడవను’ ప్రశ్నించనూ అన్న చందంగా ఉన్నాయి. ఇంత గందరగోళం మధ్య కూడా ప్రభుత్వ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, రాజ్‌దేశాయ్ లాంటి సీనియర్ జర్నలిస్టుపైన కోర్టు ధిక్కార నేరం మోపడానికి వ్యతిరేకించారు! అంతేకాదు పౌరహక్కుల ప్రసిద్ధ సుప్రీం న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి అక్కసు కొద్దీ చేసేది లేక ఒకే ఒక్క ‘‘రూపాయి జరిమానా’’ విధించి చిల్లరగా వ్యవహరించినప్పుడు కూడా అటార్నీ జనరల్ చాలా హుందాగా, బాహాటంగా విభేదించారు. అలాగే గతంలో జస్టిస్ ఫిడ్జరాల్డ్ (1868 ఇంగ్లాండ్) ‘దేశద్రోహం’ అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఇద్దరు జర్నలిస్టుల కేసును విచారిస్తూ, జర్నలిస్టుల విమర్శనా హక్కును సమర్థిస్తూ, ప్రభుత్వ న్యాయపాలనా వ్యవస్థ నిర్ణయాలనే, దాని నిర్వాహకుల ఉద్దేశాలనే విమర్శించే హక్కు జర్నలిస్టులకు ఉంది. కాని ఇదే జర్నలిస్టులు తమ పరిధులు దాటి ప్రజలలో కావాలని ప్రభుత్వం పైన ఏహ్యతను, అగౌరవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే, చట్టం విద్రోహం కింద జమకడుతుందన్నాడు! అయితే అదే సమయంలో ప్రభుత్వ చర్యలను ఎంతగా విమర్శించినా ఆ చర్చ, ఆ విమర్శ, ఎంత స్వేచ్ఛగా సాగినా అది ప్రభుత్వంపై ప్రజలలో విద్వేషాన్ని, అసహనాన్ని రెచ్చగొట్టేదిగా ఉండకూడదు. ఆ పరిధి దాటినప్పుడే అది పనిగట్టుకుని రెచ్చగొట్టే రాతల కిందికి, చర్చల కిందికి వస్తుంది కూడా అని జస్టిస్ ఫిడ్జరాల్డ్ పేర్కొన్నాడు.
కానీ మనకు స్వాతంత్య్రం సాధించడానికి నానా త్యాగాలు చేసి, చివరికి రాజద్రోహం నేరాలను కూడా బ్రిటిష్ వలస పరిపాలకుల నుంచి ఎదుర్కొన్న బాలగంగాధర తిలక్, గాంధీజీ, భగత్‌సింగ్, సుభాస్ చంద్రబోస్, గదర్ వీరులు, వీర సావర్కర్, సోషలిస్టు, కమ్యూనిస్టు విప్లవకారులంతా జైళ్లపాలైనవారే. అంతవరకూ ఇండియన్ పీనల్ కోడ్‌లో ‘ 124–ఎ’ సెక్షన్ చేర్చిన తరువాత 21 సంవత్సరాల దాకా శిక్షలు లేవు, విచారణా లేదు. జాతీయోద్యమం దశదిశలా అల్లుకుపోయేదాకా ఆ సెక్షన్ నిద్రావస్థలోనే ఉంది. ఆ తర్వాతనే దుమ్ముదులుపుకొని దేశభక్తులపైన, విప్లవకారులపైన 124–ఎ విరుచుకుపడి నాయకులు, కార్యకర్తలు అనేకమందికి యావజ్జీవ కారాగారశిక్షలు విధించింది. కొందరు జైళ్ళలోనే కాలం చేశారు. సొంత రాజ్యాంగం, స్వాతంత్య్రం వచ్చింది కాని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వారి అవసరాల కోసం, ప్రయోజనాల కోసం మనపై రుద్దిపోయిన, కాలం చెల్లిన ‘రాజద్రోహ’ నేరాభియోగ సెక్షన్ మాత్రం దేశంలో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది.
ఏబీకె ప్రసాద్
– వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment