ప్రజా సమస్యలపైన, సమాజంలో అక్రమాలు, అన్యాయాలపైన కర్ణాటకలో ఒక సుప్రసిద్ధ వారపత్రిక సంపాదకురాలిగా గౌరీ లంకేశ్ సాగిస్తూ వస్తున్న పోరును అధికార స్థానాల్లో ఉన్నవారు సహించలేకపోయారు. గౌరి భావాలనే కాదు, ఆమెనే అంతమొందించాలని కిరాయి మూకలను పురమాయించారు. గౌరీ లంకేశ్‌ను అంతమొందించిన కుట్ర కేసు విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు కుట్రదారుల ‘నసాళానికి’ అంటే తీర్పు ఇచ్చింది. ‘ఎందుకు’ అన్న ప్రశ్నను ఎందుకు వేయవలసిన అవసరం ఉంటుందో విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వాలకు ఓ పెద్ద గుణపాఠం! అధికారంలో ఉన్నది సామ్రాజ్యవాద వలస ప్రభుత్వమైనా, స్వతంత్ర భారత ప్రభుత్వ పాలకులైనా సరే.. వారికి మనం నిజాన్ని దాచుకోకుండా కుండబద్ధలుకొట్టి బోధపడేట్టు చేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు.
సుప్రసిద్ధ నవలా రచయిత, హేతువాది గోపీచంద్ తన సమర్థ సాహితీయాత్రలో భాగంగా లిఖించిన ‘అసమర్థుని జీవయాత్ర’ నవలా రచన సందర్భంగా మనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రపంచంలో ఇంతమంది మేధావులున్నారు గదా వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు? ఏ వాసన చూడటం వల్లో. ఏ గాలి పీల్చడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో మనకు ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు?... జీవితం ప్రవాహం. ఇదొక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు, అసమర్థులకు చోటు లేదు అని ప్రక టిస్తూ రాసిన గొప్ప నవలే ‘అసమర్థుని జీవయాత్ర!’.
ఈ నవలను తన తండ్రి, తెలుగునేలపై తొలి హేతువాద సాహితీ పరులలో ఉద్దండుడైన త్రిపురనేని రామస్వామి గారికి గోపీచంద్ ఈ నవలను ఎందుకు అంకితమివ్వవలసి వచ్చిందో చెప్పారు. ‘ఎందుకు’ అన్న ప్రశ్న నేర్పినందుకు అని రాశారు. అలా ప్రశ్న వేయగల వాళ్ళే సమర్థులని వేయలేని వాళ్ళు అసమర్థులనీ తేల్చేశాడు! ఆ ప్రశ్నించే తేకువ, తెగువ లేనివాళ్ళు అసమర్థులని గౌరీ లంకేశ్ హత్యకేసు విచా రణలో గౌరవ సుప్రీంకోర్టు, బెంచ్ కొద్దిరోజుల క్రితం ఇచ్చిన తీర్పు నిరూపించింది.
భావాలను కాదు... భౌతికంగా అంతమొందించారు!
ప్రజా సమస్యలపైన, సమాజంలో అక్రమాలు, అన్యాయాలకు వ్యతి రేకంగా, కర్ణాటకలో ఒక సుప్రసిద్ధ వారపత్రిక సంపాదకురాలిగా గౌరీ లంకేశ్ సాగిస్తూ వస్తున్న పోరును అధికార స్థానాల్లో ఉన్నవారు సహించలేకపోయారు. లంకేశ్ భావాలనే∙కాదు, ఆమెనే అంతమొం దించాలని కిరాయిమూకలను పురమాయించారు. గౌరీ లంకేశ్‌ను అంతమొందించిన కుట్ర కేసు విచారణ సందర్భంగానే దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కుట్రదారుల ‘నసాళానికి’ అంటే తీర్పు ఇచ్చింది. ‘ఎందుకు’ అన్న ప్రశ్నను ఎందుకు వేయవలసిన అవసరం ఉంటుందో విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వాలకు ఓ పెద్ద గుణపాఠం!
గౌరి తండ్రిపేరు లంకేశ్. ఆయన పేరిట ‘లంకేశ్’ అనే వార పత్రికను ప్రారంభించింది. కర్ణాటక సరిహద్దుల్ని దాటి దేశవ్యాపితం గానే దాని పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. ఫలితంగా అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ అవార్డులూ ఆమె పొందారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా ఎలు గెత్తి చాటగల ధైర్యసాహసాలకు పాలక వర్గాలనుంచి ఎదురవుతున్న, పెరిగిపోతున్న దాష్టీకాలకు తీవ్ర నిరసన ఎదురైంది.
దాంట్లో భాగంగానే గతంలో పాలకుల నుంచి పొంది ఉన్న జాతీయస్థాయి అవార్డులన్నింటినీ సుప్రసిద్ధ కవులు, రచయితలు, పాత్రికేయులు తమ బిరుదబీరాలతో సహా పాలకుల మొహం మీదే విసిరికొట్టి నిరసన తెలిపి ప్రజల ప్రశంసలకు పాత్రులైన విషయం కూడా తెలిసిందే. అందుకే పాలకుల అన్యాయాలు, దాష్టీకాలపై ‘ఎందుకు’ అన్న ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది! అది ఎంతో విశిష్టమైన ప్రశ్న. అంతేకాదు, గౌరీ లంకేశ్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, పౌరహక్కుల నాయకులైన గోవింద పన్సారే, డాక్టర్ దభోల్కర్, ప్రొఫెసర్ కల్బుర్గి వంటి ఎందరో మేధావులను కూడా గౌరీ లంకేశ్ కన్నా ముందే కిరాయిమూకల ద్వారా హతమార్చిన వైనాన్ని ఇక్కడ మరచిపోరాదు!
నిషేధాలు, నిర్బంధాలపై తలంటిన న్యాయస్థానం
ఇంతవరకూ ఈ హంతకుల ఆచూకీ తెలియకుండా పాలక వర్గాలు గోప్యతను నటిస్తూండడమూ రహస్యం కాదు. అందుకే ఒక సుప్రీం కోర్టు సుప్రసిద్ధ మాజీ న్యాయమూర్తి, బొంబాయి హైకోర్టు న్యాయ మూర్తి ఒకరూ.. ఒకనాడు బ్రిటిష్ హయాంలో ఆదివాసీలపై శ్వేత పాలకులు సాగించిన దాష్టీకాలకు నిరసనగా, బీమా కోరెగావ్‌లో జరుపుకుంటూ వస్తున్న సభలపై ఆంక్షలు, నిషేధాలు విధించే పాలకుల్ని తీవ్రంగా విమర్శించాల్సి వచ్చింది. ఆ సభలతో నిమిత్తం లేని ఇతర ప్రజాతంత్రవాదుల్ని, ప్రసిద్ధ కవులనూ ఆ సభలకు హాజర య్యారన్న మిషపైన అన్యాయంగా రెండేళ్ళకు పైగా వివిధ జైళ్లలో కుక్కి, నానా అగచాట్లకు గురిచేస్తున్నారు. దీన్ని సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ప్రశ్నించవలసిన సమయం కూడా వచ్చింది.
‘అసమర్థుని జీవయాత్ర’లో గోపీచంద్ ‘సీతారామారావు’ పాత్ర ద్వారా నిరూపించినట్టుగా ఈ ‘మహాసంగ్రామంలో పిరికివాళ్ళకూ, అసమర్థులకూ చోటులేదన్న’ నిర్ణయానికి ఇంకెన్నాళ్లు తలవంచుతూ పోవాలో.. ఎందుకు అని ప్రశ్నించగల ధైర్యాన్ని నేర్పే తల్లిదండ్రులను పూజించుకోవాలో తెలుసుకొనే జ్ఞానం దేశంలో పరిఢవిల్లే రోజుకోసం ఎదురుచూడాలి! విశిష్ట వ్యక్తిత్వంతో తనదైన ముద్రను దశాబ్దాలుగా వేనోళ్ళ చాటుకొంటూ వచ్చిన సుధామూర్తి అన్నట్టు ‘నిన్ను చుట్టు ముడుతున్న అగ్నికి మరింత ఆజ్యం పోయడం ద్వారానే అగ్నిని ఆర్పగలం’. అందుకే దేశంలో ప్రజాస్వామ్యం, సత్యం(నిజం) చెట్ట పట్టాలు కట్టుకుని ముందుకు సాగినప్పుడే పాలక నిరంకుశ ధోరణు లకు అడ్డుకట్ట వేయగలమనీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నది సామ్రాజ్యవాద వలస ప్రభుత్వమైనా, స్వతంత్ర భారత ప్రభుత్వ పాలకులైనా సరే.. వారికి మనం నిజాన్ని దాచుకోకుండా కుండబద్దలుకొట్టి బోధపడేట్టు చేయాలన్నారు. ప్రజలు బతికి బట్టకట్టాలంటే సత్యాన్ని పలికి తీరాల న్నారు జస్టిస్ చంద్రచూడ్.
సమాచార హక్కుకు మంగళమేనా?
సత్యాన్వేషణలో ఉన్న భారతపౌరులు ‘సమాచార హక్కు చట్టం’ని ఉపయోగించుకోకుండా, పాలకులు నిర్వీర్యం చేసిన దాని ఫలితం గానే లక్షలాది మందికి కోరిన సమాచారం అందకుండా పోయింది. సమాచారం ఎందుకు అందించలేకపోయారని అడిగితే, సమాచార కమిషన్‌లకు ‘సిబ్బంది కరువయ్యార’న్న ఒకే ఒక సమాధానం! అందాకా దేనికి? రెండేళ్లుగా దేశంలోని జర్నలిస్టులపైన ప్రజాతంత్ర కార్యకర్తలపైన, పౌరహక్కుల ఉద్యమకారులను వేధించడానికి, కేసులుపెట్టి బాధించడానికీ ఇజ్రాయెల్ స్పై కంపెనీ ‘పెగసస్’ను భారత పాలకులు రహస్యంగా వినియోగస్తున్నట్టు వెల్లడికావడం మరో సంచలనం! ఇంతకూ మన పాలకులు ‘పెగసస్’ గూఢచర్యాన్ని దేశ ప్రజలపైన వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఈ క్షణం దాకా పార్లమెంటుకు గానీ, సుప్రీంకోర్టు ప్రశ్నలకు గానీ సమాధానం చెప్ప కుండా పాలకులు దాచేస్తున్నారు.
బహుశా అందుకే, ఇలాంటి నగ్నసత్యాలను తన కాలంలో కూడా కాచి వడపోసిన తర్వాతనే ప్రపంచ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్త కారల్‌మార్క్స్ ఇలా చెప్పి ఉంటాడు... ‘మన సామాజిక వ్యవస్థ మూలంలోనే కుళ్ళిపోయి తిష్ఠవేసింది. ఈ వ్యవస్థ సమాజంలోని దైన్య స్థితిగతులను ఏమాత్రం మార్చకుండా కొంతమంది సంపదను మాత్రమే పెంచుకుంటూ పోతుంది’. అందుకే సుప్రసిద్ధ బ్రిటిష్ నాటకకర్త, సాహితీ దిగ్గజం జార్జి బెర్నార్డ్‌షా ‘ఈ ప్రపంచంలో ఇంతవరకూ ఏ మానవుడూ చేయని మహాప్రస్థానం మార్క్స్ చేశాడు! అదే యావత్ ప్రపంచం మనస్సునే మలచే యజ్ఞం’ అని కీర్తించాడు!!
-ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment