Gauri Lankesh Murder Case
-
ఐదేళ్ల తరువాత నిరవధిక విచారణ
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో విచారణ పునఃప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల కిందట... సెప్టెంబరు 05, 2017 రాత్రి గౌరీలంకేశ్ ఆఫీసు నుంచి రాజరాజేశ్వరినగరలో ఇంటికి చేరుకున్న సమయంలో దుండగులు ఆమెను పిస్టల్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో 17 మంది నిందితులు ఉన్నారు. కుట్రదారు అమోల్ కాళే, కాల్పులు జరిపిన పరశురామ్ వాగ్మోరా, బైక్ నడిపిన గణేశ్ మిస్కిన్ తో పాటు 17 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. వీరి తరఫున 60 మందికి పైగా న్యాయవాదులు వాదిస్తున్నారు. పోలీసులు దర్యాప్తును పూర్తిచేసి పలు చార్జిషీట్లను దాఖలు చేశారు. మతాన్ని కించపరచడమే హత్యకు కారణంగా ప్రకటించారు. ప్రతి రెండోవారంలో ఐదు రోజులు కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కర్ణాటక నేరాల నియంత్రణ చట్టం (కేసీఓసీఏ– కోకా) కోర్టు న్యాయమూర్తి సీఎం.జోషి శనివారం మార్గదర్శకాలను నిర్ణయించారు. విచారణ కొన్ని వారాల పాటు జరుగుతుంది. నెలలో ప్రతి రెండోవారంలో ఐదురోజుల పాటు విచారిస్తారు. తొలుత జూలై 4 నుంచి జూలై 8 వరకు వాదనలు నిర్వహిస్తామని న్యాయమూర్తి జోషి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో భౌతికస్థితిలోనే విచారణ జరపాలని నిందితుల తరఫు లాయర్లు కోరగా, జడ్జి ఏకీభవించలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సాగుతుందని తెలిపారు. నిందితులు కొందరు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో, మరికొందరు ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. న్యాయవాదులు నిందితులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జడ్జి సూచించారు. (చదవండి: ట్రాఫిక్ జామ్‌పై నెటిజన్ వింత పోస్ట్.. వైరల్‌గా మారి నెట్టింట రచ్చ) -
నిజాలతోనే... నిరంకుశత్వానికి అడ్డుకట్ట
ప్రజా సమస్యలపైన, సమాజంలో అక్రమాలు, అన్యాయాలపైన కర్ణాటకలో ఒక సుప్రసిద్ధ వారపత్రిక సంపాదకురాలిగా గౌరీ లంకేశ్ సాగిస్తూ వస్తున్న పోరును అధికార స్థానాల్లో ఉన్నవారు సహించలేకపోయారు. గౌరి భావాలనే కాదు, ఆమెనే అంతమొందించాలని కిరాయి మూకలను పురమాయించారు. గౌరీ లంకేశ్‌ను అంతమొందించిన కుట్ర కేసు విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు కుట్రదారుల ‘నసాళానికి’ అంటే తీర్పు ఇచ్చింది. ‘ఎందుకు’ అన్న ప్రశ్నను ఎందుకు వేయవలసిన అవసరం ఉంటుందో విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వాలకు ఓ పెద్ద గుణపాఠం! అధికారంలో ఉన్నది సామ్రాజ్యవాద వలస ప్రభుత్వమైనా, స్వతంత్ర భారత ప్రభుత్వ పాలకులైనా సరే.. వారికి మనం నిజాన్ని దాచుకోకుండా కుండబద్ధలుకొట్టి బోధపడేట్టు చేయాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు. సుప్రసిద్ధ నవలా రచయిత, హేతువాది గోపీచంద్ తన సమర్థ సాహితీయాత్రలో భాగంగా లిఖించిన ‘అసమర్థుని జీవయాత్ర’ నవలా రచన సందర్భంగా మనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రపంచంలో ఇంతమంది మేధావులున్నారు గదా వీళ్ళలో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు? ఏ వాసన చూడటం వల్లో. ఏ గాలి పీల్చడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో మనకు ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు?... జీవితం ప్రవాహం. ఇదొక మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు, అసమర్థులకు చోటు లేదు అని ప్రక టిస్తూ రాసిన గొప్ప నవలే ‘అసమర్థుని జీవయాత్ర!’. ఈ నవలను తన తండ్రి, తెలుగునేలపై తొలి హేతువాద సాహితీ పరులలో ఉద్దండుడైన త్రిపురనేని రామస్వామి గారికి గోపీచంద్ ఈ నవలను ఎందుకు అంకితమివ్వవలసి వచ్చిందో చెప్పారు. ‘ఎందుకు’ అన్న ప్రశ్న నేర్పినందుకు అని రాశారు. అలా ప్రశ్న వేయగల వాళ్ళే సమర్థులని వేయలేని వాళ్ళు అసమర్థులనీ తేల్చేశాడు! ఆ ప్రశ్నించే తేకువ, తెగువ లేనివాళ్ళు అసమర్థులని గౌరీ లంకేశ్ హత్యకేసు విచా రణలో గౌరవ సుప్రీంకోర్టు, బెంచ్ కొద్దిరోజుల క్రితం ఇచ్చిన తీర్పు నిరూపించింది. భావాలను కాదు... భౌతికంగా అంతమొందించారు! ప్రజా సమస్యలపైన, సమాజంలో అక్రమాలు, అన్యాయాలకు వ్యతి రేకంగా, కర్ణాటకలో ఒక సుప్రసిద్ధ వారపత్రిక సంపాదకురాలిగా గౌరీ లంకేశ్ సాగిస్తూ వస్తున్న పోరును అధికార స్థానాల్లో ఉన్నవారు సహించలేకపోయారు. లంకేశ్ భావాలనే∙కాదు, ఆమెనే అంతమొం దించాలని కిరాయిమూకలను పురమాయించారు. గౌరీ లంకేశ్‌ను అంతమొందించిన కుట్ర కేసు విచారణ సందర్భంగానే దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కుట్రదారుల ‘నసాళానికి’ అంటే తీర్పు ఇచ్చింది. ‘ఎందుకు’ అన్న ప్రశ్నను ఎందుకు వేయవలసిన అవసరం ఉంటుందో విచ్ఛిన్నమవుతున్న వ్యక్తిత్వాలకు ఓ పెద్ద గుణపాఠం! గౌరి తండ్రిపేరు లంకేశ్. ఆయన పేరిట ‘లంకేశ్’ అనే వార పత్రికను ప్రారంభించింది. కర్ణాటక సరిహద్దుల్ని దాటి దేశవ్యాపితం గానే దాని పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. ఫలితంగా అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ అవార్డులూ ఆమె పొందారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా ఎలు గెత్తి చాటగల ధైర్యసాహసాలకు పాలక వర్గాలనుంచి ఎదురవుతున్న, పెరిగిపోతున్న దాష్టీకాలకు తీవ్ర నిరసన ఎదురైంది. దాంట్లో భాగంగానే గతంలో పాలకుల నుంచి పొంది ఉన్న జాతీయస్థాయి అవార్డులన్నింటినీ సుప్రసిద్ధ కవులు, రచయితలు, పాత్రికేయులు తమ బిరుదబీరాలతో సహా పాలకుల మొహం మీదే విసిరికొట్టి నిరసన తెలిపి ప్రజల ప్రశంసలకు పాత్రులైన విషయం కూడా తెలిసిందే. అందుకే పాలకుల అన్యాయాలు, దాష్టీకాలపై ‘ఎందుకు’ అన్న ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది! అది ఎంతో విశిష్టమైన ప్రశ్న. అంతేకాదు, గౌరీ లంకేశ్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, పౌరహక్కుల నాయకులైన గోవింద పన్సారే, డాక్టర్ దభోల్కర్, ప్రొఫెసర్ కల్బుర్గి వంటి ఎందరో మేధావులను కూడా గౌరీ లంకేశ్ కన్నా ముందే కిరాయిమూకల ద్వారా హతమార్చిన వైనాన్ని ఇక్కడ మరచిపోరాదు! నిషేధాలు, నిర్బంధాలపై తలంటిన న్యాయస్థానం ఇంతవరకూ ఈ హంతకుల ఆచూకీ తెలియకుండా పాలక వర్గాలు గోప్యతను నటిస్తూండడమూ రహస్యం కాదు. అందుకే ఒక సుప్రీం కోర్టు సుప్రసిద్ధ మాజీ న్యాయమూర్తి, బొంబాయి హైకోర్టు న్యాయ మూర్తి ఒకరూ.. ఒకనాడు బ్రిటిష్ హయాంలో ఆదివాసీలపై శ్వేత పాలకులు సాగించిన దాష్టీకాలకు నిరసనగా, బీమా కోరెగావ్‌లో జరుపుకుంటూ వస్తున్న సభలపై ఆంక్షలు, నిషేధాలు విధించే పాలకుల్ని తీవ్రంగా విమర్శించాల్సి వచ్చింది. ఆ సభలతో నిమిత్తం లేని ఇతర ప్రజాతంత్రవాదుల్ని, ప్రసిద్ధ కవులనూ ఆ సభలకు హాజర య్యారన్న మిషపైన అన్యాయంగా రెండేళ్ళకు పైగా వివిధ జైళ్లలో కుక్కి, నానా అగచాట్లకు గురిచేస్తున్నారు. దీన్ని సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ప్రశ్నించవలసిన సమయం కూడా వచ్చింది. ‘అసమర్థుని జీవయాత్ర’లో గోపీచంద్ ‘సీతారామారావు’ పాత్ర ద్వారా నిరూపించినట్టుగా ఈ ‘మహాసంగ్రామంలో పిరికివాళ్ళకూ, అసమర్థులకూ చోటులేదన్న’ నిర్ణయానికి ఇంకెన్నాళ్లు తలవంచుతూ పోవాలో.. ఎందుకు అని ప్రశ్నించగల ధైర్యాన్ని నేర్పే తల్లిదండ్రులను పూజించుకోవాలో తెలుసుకొనే జ్ఞానం దేశంలో పరిఢవిల్లే రోజుకోసం ఎదురుచూడాలి! విశిష్ట వ్యక్తిత్వంతో తనదైన ముద్రను దశాబ్దాలుగా వేనోళ్ళ చాటుకొంటూ వచ్చిన సుధామూర్తి అన్నట్టు ‘నిన్ను చుట్టు ముడుతున్న అగ్నికి మరింత ఆజ్యం పోయడం ద్వారానే అగ్నిని ఆర్పగలం’. అందుకే దేశంలో ప్రజాస్వామ్యం, సత్యం(నిజం) చెట్ట పట్టాలు కట్టుకుని ముందుకు సాగినప్పుడే పాలక నిరంకుశ ధోరణు లకు అడ్డుకట్ట వేయగలమనీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నది సామ్రాజ్యవాద వలస ప్రభుత్వమైనా, స్వతంత్ర భారత ప్రభుత్వ పాలకులైనా సరే.. వారికి మనం నిజాన్ని దాచుకోకుండా కుండబద్దలుకొట్టి బోధపడేట్టు చేయాలన్నారు. ప్రజలు బతికి బట్టకట్టాలంటే సత్యాన్ని పలికి తీరాల న్నారు జస్టిస్ చంద్రచూడ్. సమాచార హక్కుకు మంగళమేనా? సత్యాన్వేషణలో ఉన్న భారతపౌరులు ‘సమాచార హక్కు చట్టం’ని ఉపయోగించుకోకుండా, పాలకులు నిర్వీర్యం చేసిన దాని ఫలితం గానే లక్షలాది మందికి కోరిన సమాచారం అందకుండా పోయింది. సమాచారం ఎందుకు అందించలేకపోయారని అడిగితే, సమాచార కమిషన్లకు ‘సిబ్బంది కరువయ్యార’న్న ఒకే ఒక సమాధానం! అందాకా దేనికి? రెండేళ్లుగా దేశంలోని జర్నలిస్టులపైన ప్రజాతంత్ర కార్యకర్తలపైన, పౌరహక్కుల ఉద్యమకారులను వేధించడానికి, కేసులుపెట్టి బాధించడానికీ ఇజ్రాయెల్ స్పై కంపెనీ ‘పెగసస్’ను భారత పాలకులు రహస్యంగా వినియోగస్తున్నట్టు వెల్లడికావడం మరో సంచలనం! ఇంతకూ మన పాలకులు ‘పెగసస్’ గూఢచర్యాన్ని దేశ ప్రజలపైన వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఈ క్షణం దాకా పార్లమెంటుకు గానీ, సుప్రీంకోర్టు ప్రశ్నలకు గానీ సమాధానం చెప్ప కుండా పాలకులు దాచేస్తున్నారు. బహుశా అందుకే, ఇలాంటి నగ్నసత్యాలను తన కాలంలో కూడా కాచి వడపోసిన తర్వాతనే ప్రపంచ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతకర్త కారల్‌మార్క్స్ ఇలా చెప్పి ఉంటాడు... ‘మన సామాజిక వ్యవస్థ మూలంలోనే కుళ్ళిపోయి తిష్ఠవేసింది. ఈ వ్యవస్థ సమాజంలోని దైన్య స్థితిగతులను ఏమాత్రం మార్చకుండా కొంతమంది సంపదను మాత్రమే పెంచుకుంటూ పోతుంది’. అందుకే సుప్రసిద్ధ బ్రిటిష్ నాటకకర్త, సాహితీ దిగ్గజం జార్జి బెర్నార్డ్‌షా ‘ఈ ప్రపంచంలో ఇంతవరకూ ఏ మానవుడూ చేయని మహాప్రస్థానం మార్క్స్ చేశాడు! అదే యావత్ ప్రపంచం మనస్సునే మలచే యజ్ఞం’ అని కీర్తించాడు!! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కర్ణాటకలో హైఅలర్ట్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ప్రధాన పట్టణాల్లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరుతో పాటు కలబురిగి, రాయచూర్, చిత్రదుర్గ, మంగళూరు, ఉడిపి, మైసూరు, తుమకూరు సహా ముఖ్యమైన పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్లు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా జనసమ్మర్ధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులుచేసే అవకాశముందని చెప్పాయి’ అని అన్నారు. కల్బుర్గీ హత్య కేసులో చార్జిషీట్ హేతువాదులు కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్య కేసులో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. షూటర్ గణేశ్ మిస్కిన్, అమోల్ కాలే, ప్రవీణ్‌ప్రకాశ్, వసుదేవ్ భగవాన్, శరద్ కలస్కర్, అమిత్ రామచంద్ర వీరి హత్యలకు కుట్రపన్నారని సిట్ తెలిపింది. హిందూ అతివాద గ్రూపు ‘సనాతన సంస్థ’ ప్రచురించిన ‘క్షేత్ర ధర్మ సాధన’ అనే పుస్తకంతో వీరంతా స్ఫూర్తి పొందారంది. 2014, జూన్ 9న మూఢనమ్మకాలపై కల్బుర్గీ ఇచ్చిన ప్రసంగంతో ఆయన్ను చంపాలని ఈ బృందం నిర్ణయించుకుందని పేర్కొంది. అనుకున్నట్లుగానే ఓ తుపాకీని సేకరించి తర్ఫీదు పొందారనీ, దాడికోసం బైక్‌ను దొంగిలించారని సిట్ చెప్పింది. కల్బుర్గిని ఇంట్లోనే మిస్కిన్ కాల్చిచంపాడని తెలిపింది. -
రెండుసార్లు కాల్చి.. ఆయన్ని చంపేశాను!
ముంబై: ఆరేళ్ల కిందట జరిగిన ప్రముఖ హేతువాది నరేంద్ర ధబోల్కర్ (67) హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శరద్ కలస్కర్ కర్ణాటక పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. నరేంద్ర ధబోల్కర్‌ను రెండుసార్లు తుపాకీతో కాల్చానని, మొదట వెనుక నుంచి తలలోకి బుల్లెట్ దింపానని, దీంతో కుప్పకూలి పడిపోయిన ఆయన కుడికన్నులోకి మరో బుల్లెట్ దింపానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడు పోలీసుల విచారణలో నేరాంగీకరం వాంగ్మూల ఇచ్చాడు. మొత్తం 14 పేజీలు ఉన్న నిందితుడి వాంగ్మూలాన్ని ఓ జాతీయ మీడియా చానెల్ గురువారం ప్రసారం చేసింది. ఒక కేసు విషయంలో శరద్ కలస్కర్ గత అక్టోబర్‌లో అరెస్టై.. జైల్లో ఉన్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్, ప్రముఖ హేతువాది గోవింద్ పన్సారే హత్యకేసుల్లోనూ ఇతను నిందితుడిగా ఉన్నాడు. గౌరీ లంకేశ్ హత్యకు కుట్ర పన్ని చంపినట్టు అతనిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ హత్యకేసు గురించి విచారిస్తున్న సమయంలోనే నరేంద్ర ధబోల్కర్‌ను కూడా తానే హత్య చేసినట్టు శరద్ కలస్కర్ అంగీకరించడం గమనార్హం. మొదట 2013 ఆగస్టులో పుణెలో మార్నింగ్ వాక్కు వెళ్లిన నరేంద్ర ధబోల్కర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం 2015 ఫిబ్రవరిలో గోవింద్ పన్సారే కోల్హాపూర్‌లో హత్యకు గురయ్యారు. అదే సంవత్సరం ఆగస్టులో ఎంఎం కల్బుర్గీ దారుణ హత్య చోటుచేసుకుంది. 2017 సెప్టెంబర్‌లో బెంగళూరులోని తన నివాసం వద్దే జర్నలిస్ట్ గౌరీలంకేశ్‌ను హతమార్చారు. -
గౌరీ లంకేష్ హత్య కుట్రను ఛేదించారిలా..
ఏడాదిక్రితం ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ ను ఆమె నివాసం వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. ఈ హత్యోదంతాన్ని ఛేదించడానికి నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సాగించిన వేట తుది ఘట్టానికి చేరుకుంది. ఏడాదిపాటు సాగిన ఈ దర్యాప్తు ఫలితంగా గౌరీ లంకేష్ హంతకులనే కాదు ఇప్పటికీ అనేక హత్యలు చేసి, మరికొన్నింటికి వ్యూహం పన్నిన ఒక అజ్ఞాత సనాతన సంస్థ కుట్రను ఛేదించింది. రాజీవ్‌గాంధీ హత్యను పరిశోధించడానికి అప్పట్లో కార్తికేయన్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ సాగించిన దర్యాప్తు స్థాయిలో సాగిన కర్నాటక సిట్ విచారణ వూహించని మలుపులు తిరిగి చివరకి దేశంలో అనేక మంది ప్రముఖ ప్రజాస్వామిక వాదులను మట్టుపెట్టడానికి కుట్ర పన్నిన రహస్య ముఠా గుట్టు రట్టు చేయగలిగింది. మందకొడిగా మొదలయి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు తెలియకుండా ’స్లీపర్‌సెల్’ మాదిరిగా పనిచేస్తున్న ఈ ముఠా బండారం బట్టబయలు చేసే వరకూ సాగిన ఈ దర్యాప్తు వివరాలు ఇలా ఉన్నాయి. సీసీ ఫుటేజ్‌తో మొదలు... గౌరీలంకేష్ హంతకులను పట్టుకునేందుకు సిట్‌కు లభించిన ఏకైక ఆధారం హత్యచేస్తున్నప్పుడు రికార్డు అయిన సీసీ ఫుటేజీ. అయితే మొహం కనిపించకుండా హెల్మట్లు ధరించి ఉన్న హంతకులను గుర్తించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దర్యాప్తుని కొనసాగించడం కోసం సిట్ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రికార్డయిన ఫోన్ కాల్స్‌ను పరిశీలించడం మొదలు పెట్టింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సెల్ టవర్స్ ద్వారా సాగిన దాదాపు పది లక్షల ఫోన్ కాల్స్‌ను పరిశీలించింది. అయినా ఫలితం దక్కలేదు. పిస్టల్ ఒకటే. గౌరీ లంకేష్ శరీరంలో దిగిన బుల్లెట్ ను పరిశీలించిన పోలీసులకు అది 7.65 ఎంఎం పిస్టల్దేనని తెలిసింది. అంతకుముందు కర్ణాటకలో హత్యకు గురైన హేతువాది నరేంద్ర దబోల్కర్‌ను హత్యచేయడానికి కూడా ఇదే పిస్టల్ని వాడినట్లు కనుగొన్నారు. అయితే ఈ రెండు హత్యలకు సంబంధం ఏమిటి? హంతకులు ఎవరు? అన్న విషయంలో ఆధారాలు దొరకలేదు. కీలక ఆధారం దొరికింది.. సిట్ దర్యాప్తు ఎటూ సాగక దాదాపు నిలిచిపోయే దశలో ఆసక్తికరమైన సమాచారం లభించింది. ఆ సమాచారమే సిట్ తరువాత జరిపిన పరిశోధనకు కీలకమయ్యింది. స్థానికంగా పనిచేసే ఇంటలిజెన్స్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారం ఏమిటంటే గౌరీ లంకేస్ హత్య జరిగిన తరువాత నుంచి స్థానికంగా నివసించే కె.టి.నవీన్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదని. నవీన్ కుమార్ వివరాలు సేకరించిన సిట్ అతను మాండ్యా జిల్లా మద్దూర్ గ్రామానికి చెందినవాడని తెలిసింది. అతని ఆచూకీ కోసం శోధించగా అతను చిక్కమంగుళూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్నట్టు తెలిసింది. అతనికి తెలియకుండా పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. వారి ప్రయత్నం ఫలించింది. నవీన్ కుమార్ తరచూ కాయిన్ ఫోన్లతో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 128 పబ్లిక్ ఫోన్ల నుంచి ఎవరికో ఫోన్ చేస్తుండడం గమనించారు. అందులో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆరు ఫోన్లను టాప్ చేయటం మొదలుపెట్టారు. ఈ సంభాషణల ద్వారా గౌరీ లంకేష్ హత్య గురించి నవీన్‌కు స్పష్టంగా తెలుసునని, అంతేకాకుండా మరొకరి హత్యకు కూడా కుట్ర జరుగుతోందని దర్యాప్తు బృందానికి అర్థం అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న పోలీసులు నవీన్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతనివద్ద మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండవ అరెస్టు... నవీన్ కుమార్ ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి సుజిత్ కుమార్ అని పోలీసులు పసిగట్టారు. శికారి పురాకు చెందిన సుజిత్‌కు ప్రవీణ్ అనే పేరు కూడా ఉందని తేలడంతో మే 20న అతన్ని కూడా అరెస్టు చేశారు. సుజిత్ కుమార్‌ను ఇంటరాగేట్ చేసిన తరువాత అసలు కుట్రదారుల గుట్టు బయటపడింది. వ్యూహకర్త అమోల్ కాలే.. గౌరీ లంకేష్ హత్యకు కుట్రపన్నింది అమోల్ కాలే అలియాస్ భాయ్‌సాబ్, అమిత్ దిగ్వేకర్. బెంగుళూరుకు చెందిన 37 ఏళ్ళ అమోల్ ఇంజనీరు. అతని దగ్గర లభించిన డైరీ సాయంతో ఈ ముఠా సంగతి, వారు సాగించిన హత్యోదంతాలు, నిందితుల వివరాలన్నీ ఇందులో లభించాయి. అయితే కోడ్ భాషలో ఉన్న ఈ డైరీని అర్థం చేసుకోవడానికి సిట్ బృందానికి కొంత సమయం పట్టింది. సనాతన ధర్మాన్ని విమర్శించేవారు, ప్రజాస్వామిక వాదులు అనేక మందిని మట్టుపెట్టడానికి ఈ ముఠా పన్నిన వ్యూహం మొత్తం బట్టబయలు అయ్యింది. వీరితో పాటు పనిచేసిన రెండో వ్యక్తి మహారాష్ట్రకి చెందిన 38 ఏళ్ళ అమిత్ దిగ్వేకర్ అలియాస్ ప్రదీప్ మహాజన్. ఈ మొత్తం కుట్ర వీరిద్దరికి మాత్రమే తెలుసు. ఇందులో పాల్గొన్న మిగిలిన వారికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. సుజిత్ కుమార్ వెల్లడించిన విషయాల ఆధారంగా బృందం అమోల్‌కాలే, అమిత్ దిగ్వేకర్లను అరెస్టు చేసింది. వీరితో పాటు కర్ణాటకలోని విజయపుర కి చెందిన మనోహర్ ఎడవెను కూడా అరెస్టు చేసారు. గౌరీ లంకేష్ హంతకులను రిక్రూట్ చేసింది ఈ మనోహరే. అతని పని కర్ణాటక కేంద్రంగా ఈ ముఠాకు అవసరమైన వారిని రిక్రూట్ చేయడమే. మహారాష్ట్రలో అమోల్‌కాలే తో పాటు మరళి అనే వ్యక్తి, కర్ణాటకలో మనోహర్ ఎడవె, సుజిత్ కుమార్‌లు ఈ సంస్థ రిక్రూట్మెంట్లకు బాధ్యులు. మోహన్ నాయక్, 50. రెక్కీ నిర్వహణ, బెంగుళూరులో స్థావరాలు, వాహనాలు సరఫరా... అనుకున్న ప్లాన్ ప్రకారం హత్యచేసేందుకు వీలుగా బెంగుళూరులోనే హంతకులు మకాం వేసారు. మోహన్ నాయక్ బెంగుళూరులో ఇల్లు అద్దెకు తీసుకుని, హంతకులకు అవసరమైన వాహనాలు సరఫరా చేసేవాడు. రెక్కీ నిర్వహణ, షెల్టర్లు ఏర్పాటు చేయడం, వాహనాల సరఫరా బెంగుళూరుకి చెందిన 50 ఏళ్ళ మోహన్ నాయక్ పని. వృత్తి రీత్యా ఇతను ఆక్యుపంక్చరిస్ట్. మోహన్ నాయక్‌తో కాలే అనునిత్యం టచ్‌లో ఉంటాడు. ఈ లాజిస్టిక్ టీంలో హుబ్లీకి చెందిన అమిత్ బడ్డీ 27, బెలగాంకి చెందిన 37 ఏళ్ళ భరత్ కుర్నే, కె.టి.నవీన్ కుమార్ ఉన్నారు. మోహన్ నాయక్ తో సహా వాఘ్మేర్, మిస్కిన్, అమిత్ బడ్డిలను పోలీసులు జూలై 18న అరెస్టు చేసారు. ఆయుధ శిక్షణ రాజేష్ బంగేర... పేరులేని హంతక సంస్థలోకి వ్యక్తులను రిక్రూట్ చేసుకున్న తర్వాత వారికి ఆయుధ శిక్షణనిచ్చింది కర్నాటక లోని మడికేరికి చెందిన 38 ఏళ్ళ రాజేష్ బంగేర. ఇతనికి సనాతన్ సంస్థకి చాలా కాలంగా సంబంధం ఉందని భావిస్తున్నారు. ఇతనికి కరాటేలో బ్లాక్ బెల్టు ఉంది. ఇతని వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకీలున్నాయి. ఆయుధ శిక్షణనివ్వడంతో పాటు హత్యలకు అవసరమైన తూటాలను సరఫరా చేసింది కూడా ఇతనే. కాల్పులు జరిపింది పరుశురాం వాఘ్మేర్... గౌరీ లంకేష్ హత్య సందర్భంగా రికారై్డన సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను ఒకచోట చేర్చి గుజరాత్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపగా అసలు గౌరీ లంకేష్‌ని హత్యచేసింది పరుశురాం వాఘ్మేర్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. చిట్టచివరకు బెంగుళూరు ప్రత్యేక దర్యాప్తు బృందం గౌరీ లంకే ష్‌ని హత్య పరుశురాం వాఘ్మేర్ అనే 26 ఏళ్ళ హంతకుడిని పట్టుకుంది. ఇతను కర్నాటకలోని విజయపురలో వ్యాపారి అని తేలింది. ఇతను చాలాకాలంగా సనాతన్ సంస్థ సభ్యుడు. హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య కేసులోనూ, గోవింద్ పన్సారీ హత్యకేసులోనూ, ఎంఎం కల్బుర్గీ హత్య కేసులోనూ, గౌరీ లంకేష్ హంతకులతోనూ ఈ సంస్థకు సంబంధాలున్నట్టు బెంగుళూరు ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. -
వారి హత్యల మధ్య సంబంధాలు
పుణే: జర్నలిస్టు గౌరీ లంకేశ్, హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్యల మధ్య సంబంధం ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. దభోల్కర్ హత్య కేసు నిందితుల్లో ఒకరైన సచిన్ అందురే కస్టడీని పొడిగించాలని పుణే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ ఈ విషయం వెల్లడించింది. లంకేశ్ హత్యతో ప్రమేయమున్న నిందితుల్లో ఒకరు అందురేకు పిస్టోల్, మూడు బుల్లెట్లు అందచేసినట్లు సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు సచిన్ అందురే కస్టడీని ఆగస్టు 30 వరకూ పొడిగించింది. మరోవైపు దభోల్కర్ హత్య కేసులో మరో నిందితుడు శరద్ కలస్కర్ను కూడా తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం కలస్కర్ మరో కేసుకు సంబంధించి మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అదుపులో ఉన్నాడు. -
గౌరీ లంకేశ్ హత్య కేసులో ట్విస్టు
బనశంకరి: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితులు పరశురామ్ వాగ్మారే, అమోల్ కాలే ఒక పోలీస్ అధికారి ఇంటిని అద్దెకు తీసుకుని హత్యకు పథకం రచించినట్లు ప్రత్యేక విచారణ బృందం(సిట్) విచారణలో వెలుగుచూసింది. బెంగళూరు మాగడి రోడ్డులోని కడబనగర క్రాస్‌లో నివాసముండే ఏసీబీ ఇన్స్పెక్టర్కు చెందిన ఇంట్లో నిందితులు సురేశ్ అనే పేరుతో అద్దెకు దిగారు. ఆ ఇంట్లోనే లంకేశ్ హత్యకు కుట్ర రచించారు. దీనిపై ఆ ఇంటి యజమాని పోలీస్ అధికారి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. తన బంధువులకు ఆ ఇంటి బాధ్యతను అప్పగించాననీ, బాడుగకుఉండే వారి వివరాలు తనకు తెలియదని ఆయన సిట్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ కేసు నిందితుల్లో కొందరికి ఇంటిని అద్దెకు ఇవ్వడానికి సాయం చేశారనే ఆరోపణలపై మంగళూరుకు చెందిన మోహన్‌నాయక్ అనే వ్యక్తిని సిట్ అరెస్టు చేసింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగా హుబ్లీకి చెందిన ఇద్దరిని, మడికెరికి చెందిన ఒకరిని సిట్ అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది. -
లంకేశ్ హత్య: హిట్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు
సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు అమోల్ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ డైరీని పరిశీలించిన సిట్ అధికారులు హిట్ లిస్ట్‌లోని పేర్లను చూసి షాక్ తిన్నారు. హిందూత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మంది హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం (సిట్) అధికారులు తెలిపారు. లిస్ట్‌లో మొదటి పేరు కన్నడ ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. రెండో వ్యక్తిగా జర్నలిస్ట్ గౌరి లంకేశ్ ఉన్నట్లు గుర్తించారు. హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలతో లంకేశ్‌ను గత ఏడాది సెప్టెంబర్ 5న తన ఇంటి సమీపంలోనే కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. రాడికల్ హిందూత్వ గ్రూప్ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. అదే ముఠాకి చెందిన కొందరు సభ్యులు కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందుత్వ ధర్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మందిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 2016 నుంచి హిట్ లిస్ట్‌లో ఉన్న వారిపై హత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు డైరీలో వారు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు వెల్లడించారు. హిట్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా ఉన్న గిరీష్ కర్నాడ్‌కు కర్ణాటక పోలీసులు గట్టి భద్రత కల్పించారు. -
10 వేల మందికి ఫోన్‌కాల్స్
బనశంకరి: పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో సిట్ విచారణ సాగేకొద్దీ కొత్త పాత్రలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ముఖ్య నిందితుడు అమూల్ కాలేకు మాస్టర్ అయిన సుజిత్ అనే వ్యక్తి హిందూ సంఘాల సమావేశాల్లో పాల్గొంటున్న సుమారు 10 వేల మంది యువకుల ఫోన్ నంబర్లు సేకరించినట్లు సిట్ విచారణలో తేలింది. ఈ నంబర్లతో అతడు యువకులను పరిచయం చేసుకునేవాడు. కరడుగట్టిన హిందూ మతాభిమానులను సుజిత్ కలసి.. హిందూ వ్యతిరేకులను అంతమొందించాలనేవాడు. దాదా అనే మరో వ్యక్తి వెళ్లి యువకులను ఎంపిక చేసేవాడు. ఎంపికైన వారికి మహారాష్ట్ర, గోవా, బెళగావిలోని నిర్జన ప్రదేశాల్లో ఎయిర్‌గన్ ద్వారా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చేవాడు. షార్ప్షూటర్లుగా శిక్షణ పొందిన 100 మంది యువకులను అమూల్‌కాలేకు దాదా పరిచయం చేశాడు. ఈ యువకుల్లో గౌరీని హత్యచేసిన వాగ్మారే కూడా ఉన్నాడు. -
హంతకుడి డైరీలో సంచలన విషయాలు..
బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో అనుమానితుడు అమోల్ కలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో నుంచి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. గౌరీ లంకేశే కాకుండా మరో 36 మంది ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు డైరీలో రాసుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు వెల్లడించారు. హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే వీరి టార్గెట్. వీరి టార్గెట్‌లోమహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. కర్ణాటకు చెందిన 10 మంది ప్రముఖులను హత్య చేయాలని డైరీలో రాసుకున్నారు. హత్యల కోసం 50 మందిని రిక్రూట్ చేసుకొని వారికి గన్స్, తుపాకీ, పెట్రోల్ బాంబ్ పేల్చడం టాంటి వాటిలో శిక్షణ కూడా ఇచ్చారని డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారని ఓ అధికారి తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 5న తన నివాసం వద్ద ఉన్న గౌరీలంకేశ్‌పై బైకుపై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు. గౌరీ లంకేశ్ హత్యకోసం వాగ్మారే రూ.3000 అడ్వాన్స్‌గా తీసుకున్నారు. హత్యకు ముందు రోజు రూ. 10,000 తీసుకున్నారని విచారణలో వాగ్మారే తెలిపారు. -
కోర్టులో మాట మార్చాడు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, షూటర్ పరశురామ్ వాగ్మారే గురువారం మెజిస్ట్రేట్ కోర్టు ముందు మాట మార్చాడు. ఇంతవరకు గౌరీలంకేశ్‌ను తుపాకీతో కాల్చి చంపింది తానే అని ప్రత్యేక విచారణ బృందం(సిట్) ముందు తెలిపిన వాగ్మారే.. కాల్పులు జరిపింది తాను కాదని జడ్జి ముందు చెప్పడంతో సిట్ అధికారులు కంగుతిన్నారు. సుమారు 9 నెలల పాటు గాలించి సిట్ అధికారులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో వాగ్మారేనే సిట్‌కు హత్యాక్రమాన్ని వివరించాడు. తానే కాల్పులు జరిపానని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలో అతన్ని జ్యుడిషియల్ కస్టడీపై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ విచారణ జరిపారు. వాగ్మారే వాంగ్మూలమిస్తూ గౌరి హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఒక్కసారిగా తిరగబడ్డాడు. విచారణ అనంతరం వాగ్మారేకు కోర్టు జూలై 11 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. మరో నిందితునికి నార్కో పరీక్షలు ఈ కేసులో మరో నిందితుడు కేటీ.నవీన్‌కుమార్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు జరపడానికి సిట్ న్యాయవాదులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. గౌరి హత్యకు ఉపయోగించిన తూటాలు, నిందితుడు చెబుతున్న పిస్టల్‌కు సరిపోలడం లేదని సిట్ చెబుతోంది. దీంతో నార్కో పరీక్షల ద్వారా అతని నుంచి సమాచారం రాబట్టాలని సిట్ నిర్ణయించింది. -
హిట్‌లిస్టులో 60 మంది
బనశంకరి: బెంగళూరులో ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులో కీలక నిందితులు నివ్వెరపోయే నిజాలను బయటపెడుతున్నారు. తమకు మతం కంటే ఏదీ ఎక్కువ కాదని, మతాన్ని కించపరిస్తే సహించేది లేదని చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు కలిపి 5 రాష్ట్రాల్లో హిందూ వ్యతిరేకులుగా ఉన్న 60 మంది సాహితీవేత్తలు, సామాజికవేత్తల జాబితాను సిద్ధం చేసి వారిని అంతమొందించటానికి సిద్ధమైనట్లు గౌరీ లంకేశ్ హత్య కేసులో పట్టుబడిన షార్ప్‌షూటర్ పరశురామ్ వాగ్మారే సిట్ ముందు బయట పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరందరికీ ప్రాణభయం లేకుండా భారీ భద్రత కల్పించాలని వారికి సాయుధ భద్రత కల్పించాలని, కార్యాలయాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని, వీరు వెళ్లే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేయాలని సిట్ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, నటుడు గిరీష్ కర్నాడ్, సాహితీవేత్తలు కేఎస్.భగవాన్, నరేంద్రనాయక్, నిడుమామిడి మఠం శ్రీ వీరభద్ర చెన్నమల్లస్వామికి భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హిట్‌లిస్టులో ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
గౌరీ లంకేశ్ హత్య కేసు: హైకోర్టు సీరియస్
సాక్షి, బెంగళూరు: సంచలన సృష్టించిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులను పోలీసులు హింసిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా దిగువ న్యాయస్థానాల మెజిస్ట్రేట్లను ఆదేశించింది. ‘ఈ ఆరోపణలను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. 10 రోజుల్లో ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాలి’ అని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లు(ఏసీఎంఎం) ఇద్దరికీ.. హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితులలో ఒకడైన అమోల్ కాలే.. కస్టడీలో ఉండగా తనను పోలీసులు హింసించారని, మెజిస్ట్రేట్లు కూడా తన మొరను పట్టించుకోలేదని ఓ అఫిడవిట్ దాఖలు చేయించాడు. ‘నా క్లయింట్‌ని పోలీసులు విచక్షణ రహితంగా హింసించారు. మే 31వ తేదీన ఈ విషయాన్ని థర్డ్ ఏసీఎంఎంకు విన్నవించాం. కానీ, ఆయన పట్టించుకోలేదు. తిరిగి జూన్ 14వ తేదీన ఫస్ట్ ఏసీఎంఎంకు విన్నవించాం. ఆయన వైద్యపరీక్షలకు అనుమతించకుండా నివేదిక రూపొందించారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఉల్లంఘించటమే’ అని నిందితుడి తరపు న్యాయవాది అఫిడవిట్లో పేర్కొన్నారు. ‘పైగా కోర్టు ఆదేశాల ప్రకారం రహస్యంగా కాకుండా నిందితుల నుంచి బహిరంగంగా విచారణ చేపట్టి స్టేట్మెంట్లు నమోదు చేశారు. నష్టపరిహారంగా బాధితులకు రూ.25 లక్షలు చెల్లించేలా ఆదేశాలిప్పించండి’ అని న్యాయవాది విన్నవించాడు. వాదనలు విన్న న్యాయస్థానం మెజిస్ట్రేట్ల నుంచి వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. (ఏ కుక్క చచ్చిపోయినా.. ఆయనే బాధ్యుడా?) మరోవైపు నిందితులను హింసించారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక డీజీపీతోపాటు అధికారులకు హైకోర్టు జూన్12న నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5, 2017న గౌరీలంకేశ్ హత్యకు గురికాగా, సిట్ దర్యాప్తు ఆధారంగా నిందితులు అమోల్ కాలే, సుజిత్ కుమార్, మనోహర్ ఎడవే, అమిత్ రామచంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ అమ్మ’ -
గిరీష్ కర్నాడ్‌కు భద్రత పెంపు..
సాక్షి, బెంగళూర్ : హిందూ అతివాద సంస్థల హిట్ లిస్ట్‌లో ఉన్న ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్, హేతువాదులు కేఎస్ భగవాన్, నరేంద్ర నాయక్, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీలకు భద్రత కల్పించాలని జర్నలిస్ట్ గౌరీలంకేష్ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఈ నలుగురికి గన్మెన్లను కేటాయించడంతో పాటు వారి ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హోంశాఖకు రాసిన లేఖలో సిట్ కోరింది. హై స్టోరేజ్ సామర్థ్యంతో సీసీటీవీ యూనిట్లను నెలకొల్పాలని, కనీసం ఏడాది పాటు ఫుటేజ్‌ను స్టోర్ చేసే వెసులుబాటు ఉండాలని కోరింది. హిందూ సంస్థల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న ఈ నలుగురి కదలికలను, కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సిట్ అధికారులు సూచించారు. కాగా జర్నలిస్ట్ గౌరీలంకేష్ హత్య కేసులో ఘూటర్గా అనుమానిస్తున్న వ్యక్తితో సహా ఆరుగురు నిందితులను సిట్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గౌరీ లంకేష్ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారితో పాటు షూటర్ పరశురామ్ వాగ్మోర్కు ఆయుధాన్ని అందించిన వారి కోసం గాలిస్తున్నామని సిట్ వర్గాలు తెలిపాయి. -
గౌరీలంకేశ్ హత్య పథకం ‘ఆపరేషన్ అమ్మ’
బనశంకరి: పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కుట్రకు నిందితులు ‘ఆపరేషన్ అమ్మ’ అని పేరు పెట్టినట్లు సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణలో తేలింది. ఆమెను హత్య చేయడానికి రహస్య సంకేతాల ద్వారా కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో నిందితులు మాట్లాడినట్లు తెలిసింది. సుమారు ఏడాదిపాటు టెలిఫోన్ బూత్‌ల నుంచి మాట్లాడిన నిందితులు హత్య చేయాల్సిన వ్యక్తి పేరును మాత్రం ఎప్పుడూ ఉచ్చరించలేదు. కేవలం ‘ఆపరేషన్ అమ్మ’ అని మాత్రమే మాట్లాడుకున్నట్లు సిట్ గుర్తించింది. గత ఏడాది సెప్టెంబర్ 5న రాత్రి బెంగళూరులో ఇంటి వద్ద ఉన్న ఆమెను కొందరు దుండగులు కాల్చి చంపడం తెలిసిందే. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు. చివరివరకు టార్గెట్ తెలియదు సిట్ అదుపులో ఉన్న పరశురామ్ వాగ్మారే విచారణ సమయంలో గౌరీ లంకేశ్ అంటే తనకు తెలియదని, వారపత్రిక సంపాదకురాలు అని కానీ, సామాజికవేత్త అని కానీ తెలియదన్నాడు. అయితే, తాను ఎప్పుడూ హిందూ మతాన్ని నమ్ముతాననీ, తన మతాన్ని ఎవరైనా విమర్శిస్తే సహించలేనని చెప్పాడు. ‘ఒకరోజు కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి ఓ ప్రముఖ వ్యక్తిని హత్య చేయాలని చెప్పాడు. మొదట నేను ఒప్పుకోలేదు. గౌరీ లంకేశ్ హిందూ మతాన్ని కించపరిచేలా పత్రికల్లో రాస్తూ, సభల్లో మాట్లాడుతోందని అతడు తెలపడంతో ఆమెను చంపాలనే నిర్ణయానికి వచ్చా. నీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని వదలొద్దు. నువ్వు ఈ కార్యం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటే నీకు నేను అండగా ఉంటా’ అంటూ ఆ అపరిచితుడు బ్రెయిన్‌వాష్ చేసినట్లు సిట్ ఎదుట తెలిపాడని సమాచారం. మొదటిరోజు కుదరలేదు.. గౌరీ లంకేశ్‌ను హత్య చేసేందుకు అంగీకరించిన వెంటనే ఆ అపరిచితుడు తనను బెళగావిలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఎయిర్‌గన్‌తో శిక్షణ ఇచ్చాడని వాగ్మారే చెప్పాడు. ఇరవై రోజుల శిక్షణ సమయంలో సుమారు 500 రౌండ్లు కాల్చినట్లు తెలిపాడు. ఆ శిక్షణ అనంతరం ఆ వ్యక్తి ఇచ్చిన మొబైల్ నంబర్‌కు టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి గౌరీ లంకేశ్ హత్య పథకం గురించి తెలుసుకున్నాడు. అతని సూచన మేరకు సెప్టెంబర్ 3వ తేదీన బెంగళూరుకు వెళ్లి సుంకదకట్టెలోని ఓ ఇంట్లో బస చేశాడు. అదే ఇంట్లో సుజీత్ అలియాస్ ప్రవీణ్ కూడా ఉన్నాడు. సెప్టెంబర్ 4వ తేదీన గౌరీ లంకేశ్‌ను కాల్చి చంపడానికి సిద్ధపడినా, ఆ రోజు ఆమె తొందరగా ఇంట్లోకి వెళ్లిపోవడంతో కుదరలేదు. కానీ, సెప్టెంబర్ 5వ తేదీన గౌరీ ఇంటి సమీపంలోని పార్కుకు వెళ్లి ఎదురుచూశారు. గౌరీలంకేశ్ కారు రాగానే బైక్‌పై వెంబడిస్తూ ఆమె ఇంటి వద్ద కారు దిగి లోపలికి వెళ్తుండగా కాల్పులు జరిపినట్లు వాగ్మారే సిట్‌కు వివరించినట్లు సమాచారం. -
‘హిందూ వ్యతిరేకుల హతం కోసం ఓ సంస్థ’
సాక్షి, బెంగుళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ని కాల్చి చంపింది ఎవరో తెలిసిపోయింది. ఇప్పటి వరకు గుర్తించిన ఆరుగురు అనుమానితుల్లో ఒకరైన పరాశరన్ వాగ్మేర్ గౌరీని కాల్చి చంపాడని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) తేల్చింది. హత్య జరిగిన చోట ఉన్న సీసీటీవీ ఫుటేజిలో వాగ్మేర్ చిత్రం నమోదైందని సిట్ తెలిపింది. కాగా, నిందితున్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హిందుత్వ వ్యతిరేకులను అంతమొందించేందుకు ఒక అతివాద హిందుత్వ సంస్థ పనిచేస్తోందని సిట్ వెల్లడించింది. కార్యకర్తల్ని నియమించుకొని తమ చేతులకు మట్టి అంటకుండా హేతువాదులు, హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని హత్య చేయించేందుకు పథకాలు పన్నుతుందని తెలిపింది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అనుమానిత సంస్థ కార్యకలాపాలు నెరుపుతోందని వెల్లడించింది. ఆ తుపాకీ దొరకలేదు..! హేతువాదులు గోవింద్ పన్సారే, ఎంఎం కలబుర్గి తరహాలోనే గౌరీ హత్య జరిగింది. ఈ ముగ్గురిని హతమార్చడానికి ఒకే తుపాకీ వాడినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని సిట్ స్పష్టం చేసింది. అయితే, నిందితులను పట్టుకున్నా, హత్యలు చేయడానికి వాడిన ఆ తుపాకీని కనుగొనాల్సి ఉందని సిట్ బృందంలోని సభ్యుల్లో ఒకరు తెలిపారు. గౌరీ హత్య కేసులో అరెస్టయిన సజీత్ కుమార్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అనుమానిత అతివాద హిందూ సంస్థలో పనిచేసేందుకు కార్యకర్తల్ని నియమించుకున్నట్లు తమ దర్యాప్తులో బయటపడిందని సిట్ బృందం తెలిపింది. అయితే, హత్యలకు పాల్పడే ఆ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించింది. గౌరీ లంకేశ్ హత్య కేసుతో సంబంధమున్న మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని సిట్ వెల్లడించింది. మరోవైపు కన్నడ రచయిత ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ను చంపడానికి యత్నిస్తుండగా ఈ ముఠా సభ్యులను పట్టుకున్న సంగతి తెలిసిందే. -
కర్నాడ్కూ లంకేశ్ హంతకుల ముప్పు!
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులోని నిందితుల హిట్‌లిస్టులో ప్రముఖ నటుడు, నిర్మాత గిరీశ్ కర్నాడ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత లలితా నాయక్, నిదుమామిడి మఠం పీఠాధిపతి వీరభద్ర చన్నమల్లస్వామి, హేతువాది సీఎస్ ద్వారకనాథ్లకు కూడా వారి నుంచి ముప్పు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్వాధీనం చేసుకున్న ఓ డైరీలో ఈ వివరాలున్నట్లు పేర్కొన్నారు. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న ఈ ప్రముఖులను వారు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. డైరీలో కొంత సమాచారం సంకేత భాషలో ఉందని, దాని అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు, సిట్ మంగళవారం అరెస్ట్ చేసిన 26 ఏళ్ల పరశురామ్ వాగ్మారే అనే యువకుడు లంకేశ్‌ను కాల్చి చంపాడని వార్తలు వచ్చాయి. అయితే వాటిని సిట్ అధిపతి బీకే సింగ్ కొట్టిపారేశారు. లంకేశ్‌ను వాగ్మారే హత్యచేసినట్లు తమ విచారణలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ ఆరుగురిని అరెస్ట్ చేసింది. -
గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక పరిణామం
సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కేటీ నవీన్ కుమార్ స్టేట్మెంట్ను నమోదు చేసిన పోలీసులు, కోర్టులో దాఖలు చేసింది. ఇక ఛార్జీషీట్లో ఆమె హత్యకు గల కారణంపై సిట్ బృందం స్పష్టత ఇచ్చేసింది. ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు తనతో చెప్పినట్లు నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు ఛార్జీషీట్లో పొందుపరిచారు. అంతేకాదు ఆ ప్రధాన నిందితుడికి బుల్లెట్లు కూడా తానే సరఫరా నవీన్ ఒప్పుకున్నాడు. ఈ మేరకు మొత్తం 131 పాయింట్లతో 12 పేజీల ఛార్జీ షీట్‌ను రూపొందించిన సిట్ బృందం, మే 30న మెజిస్ట్రేట్‌కు సమర్పించింది. ఛార్జీషీట్లో వివరాలు... డిగ్రీ మధ్యలోనే ఆపేసిన కేటీ నవీన్ కుమార్.. హిందూ అతివాద సంఘాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2014లో హిందూ యువ సేనే అనే సంస్థను తానే సొంతంగా స్థాపించాడు. మంగళూర్ పబ్ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కున్న శ్రీరామ్ సేనే స్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌తో నవీన్ తరచూ భేటీ అయ్యేవాడు. మరోపక్క అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తాడన్న ఆరోపణలు నవీన్‌పై గతంలో వినిపించేవి. ఈ క్రమంలో ఓ సదస్సుకు హాజరైన నవీన్‌కు ప్రవీణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నిందితుడు నవీన్ కుమార్ బుల్లెట్ల కోసం... ఆ తర్వాత నవీన్‌తో సత్సంబంధాలు కొనసాగించిన ప్రవీణ్.. ఓ రోజు ఏకంగా ఇంటి వెళ్లి బుల్లెట్ల కోసం ఆరా తీశాడు. తొలుత నవీన్ అతనికి రెండు బుల్లెట్లు ఇవ్వగా.. ప్రవీణ్ మాత్రం నాణ్యమైనవి కావాలంటూ కోరాడు. ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి. ఆమెను చంపేందుకే ఈ బుల్లెట్లు’ అంటూ తనతో చెప్పినట్లు స్టేట్మెంట్లో నవీన్ పేర్కొన్నాడు. బెంగళూరు, బెలగామ్లో హత్యకు ప్రణాళిక రచించారని, హత్యకు ముందు ఆమె ఇంటి వద్ద పలు మార్లు హంతకులు రెక్కీ నిర్వహించారని నవీన్ పేర్కొన్నాడు. ఫ్లాన్ ప్రకారం చివరకు సెప్టెంబర్ 5వ తేదీన ఆమెను హత్య చేసినట్లు నవీన్ వివరించాడు. అయితే ఆమె హత్యకు గురైందన్న వార్త మరుసటి రోజు పేపర్లో చూసేదాకా తనకూ తెలీదని నవీన్ చెబుతున్నాడు. మరో హత్యకు కుట్ర... సాహితీవేత్త, హేతువాది కేఎస్ భగవాన్ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు నవీన్ అంగీకరించాడు. ఫోన్ కాల్స్‌లో సంభాషణల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి రాగా, విచారణలో నిందితుడు ఒప్పకున్నాడు. కాగా, ప్రముఖ రచయిత కుల్బర్గి హత్య(2015) తర్వాత.. భగవాన్‌కు పోలీసులు భద్రత పెంచిన విషయం తెలిసిందే. రచయిత ఎంఎం కుల్బర్గి ఒకే తుపాకీ... రెండేళ్ల క్రితం రచయిత ఎంఎం కుల్బర్గి(77) హత్య కోసం ఉపయోగించిన తుపాకీ, గౌరీ లంకేశ్ హత్య కోసం వాడిన తుపాకీ ఒక్కటేనని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు పోలీసులు మెజిస్ట్రేట్‌కు సమర్పించిన ఛార్జీషీట్లో ఈ విషయాన్ని పొందుపరిచారు. గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లౌకికవాదిగా, కన్నడ వార పత్రిక ‘లంకేశ్ పత్రికే’ ఎడిటర్‌గా ప్రసిద్ధి చెందిన గౌరీ హత్యకు గురికావడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. మాండ్యా జిల్లాకు చెందిన కేటీ నవీన్ కుమార్ ఈ ఏడాది మార్చిలో తన దగ్గర ఉన్న తుపాకీని ఓ వ్యక్తికి అమ్మేందుకు యత్నించాడు. అయితే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్.. అతనికి సహకరించిన వారు ఎవరన్నది తేలాల్సి ఉంది. -
గౌరీ లంకేశ్ కేసులో చార్జిషీట్ దాఖలు
బెంగళూరు: సంచలనం సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్(55) హత్యకేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం తొలి చార్జిషీట్‌ను బెంగళూరులోని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలుచేసింది. ఈ చార్జిషీట్లో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది. నిందితుడిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు ఆయుధ చట్టం కింద కేసు సిట్ నమోదుచేసింది. గౌరీ ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన నవీన్ ఆమె హంతకులకు ఆయుధాలను సరఫరా చేశాడని సిట్ చార్జిషీట్లో తెలిపింది. హత్యచేసేందుకు నిందితుల్ని గౌరి ఇంటివద్దకు నవీన్ తీసుకెళ్లాడని వెల్లడించింది. -
‘గౌరీ’ హత్య కేసులో మరో అరెస్ట్
సాక్షి, బెంగళూరు: గత ఏడాది సెప్టెంబర్‌లో హత్యకు గురైన సాహితీవేత్త, పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పురోగతి సాధించింది. ఈ హత్య కేసులో గోవాకు చెందిన వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా గుర్తించింది. ఇతడే మహారాష్ట్రకు చెందిన ఇద్దరు షార్ప్ షూటర్లతో లంకేశ్‌ను హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. లంకేశ్ హంతకులే బెంగళూర్‌కు చెందిన సాహితీవేత్త భగవాన్ను గత నెల హత్య చేయడానికి పథకం రచించినట్లు సమాచారం. -
గౌరీలంకేశ్ కేసులో పురోగతి
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య కేసులో బెంగళూరు పోలీసుల విచారణలో ఓ అడుగు ముందుపడింది. ఈ కేసుకు సంబంధించి మాండ్య జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ తర్వాత నవీన్ నేరాంగీకార వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఫిబ్రవరి 18నే నవీన్‌ను అరెస్టు చేసినా ఆలస్యంగా ఈ విష యం వెల్లడైంది. నవీన్‌ను అక్రమ ఆయుధాల కేసులో అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, తనే గౌరీని చంపినట్లు అంగీక రించినట్లు తెలిసింది. దీంతో నవీన్‌ను సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించింది. హత్య ప్రణాళిక, వినియోగించిన ఆయుధాలు తదితర అంశాలను రాబట్టింది. ‘ప్రస్తుతానికి ఒక నిందితుడినే అరెస్టు చేశాం. దీని ఆధారంగా కుట్రకు పాల్పడిన అందరినీ పట్టుకుంటాం’ అని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్మల తెలిపారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూర్ గ్రామానికి చెందిన నవీన్‌కు ‘హిందు యువసేన’తో సంబంధం ఉందని విచారణలో తేలిందన్నారు. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతోనే గౌరీలంకేశ్ హత్య జరిగిందని ఫొరెన్సిక్ లేబొరేటరీ గతంలోనే తెలిపింది. కన్నడ సాహితీవేత్త ఎంఎం కల్బుర్గీ, మహారాష్ట్ర వామపక్ష నేత గోవింద్ పన్సారేల హత్యల్లోనూ ఇలాంటి తుపాకులే వాడారు. -
ఒకే తరహాలో ముగ్గురి హత్య..
సాక్షి, బనశంకరి: సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, మానవ హక్కుల పోరాటయోధుడు గోవింద్పన్సారే హత్యకు వినియోగించిన రివాల్వర్‌నే గౌరీలంకేశ్ హత్యకు వినియోగించినట్లు ల్యాబొరేటరీ పరిశోధనల్లో రుజువైంది. కలుబురిగి, పన్సారే హత్యకు స్వదేశంలో తయారైన 7.65 ఎంఎం.రివాల్వర్ ద్వారా కాల్పులు జరిపి హత్యకు పాల్పడ్డారు. బెంగళూరు రాజరాజేశ్వరినగరలో తన ఇంటి వద్ద గౌరీని కూడా అదే రివాల్వర్‌కు బలయ్యారు. ముగ్గురు ఒకే తరహాలో హత్యకు గురికావడంతో హంతకులు ఒకే సంస్థకు చెందిన వారు కావొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న రాజరాజేశ్వరి నగరలో గౌరి హత్యకు గురయ్యారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బుల్లెట్లను హైదరాబాద్, బెంగళూరుల్లోని ల్యాబ్‌కు పంపించారు. నివేదికలో గతంలో సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, గోవింద్పన్సారేపై కాల్పులు జరిపిన రివాల్వర్తోనే గౌరిపై కూడా కాల్పులు జరిపినట్లు పరిశోధనలో తేలింది. -
గౌరి లంకేశ్ హంతకుల ఆచూకీ తెలిసింది
సాక్షి, బెంగళూరు: సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ హంతకుల ఆచూకీ తెలిసిందని, అతి త్వరలోనే నిందితులను అరెస్టు చేయనున్నట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి తెలిపారు. శనివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే.. గౌరి హంతకులు ఎవరనేది తెలిసింది. కొన్ని వారాల్లో నిందితులను అరెస్టు చేయటం తథ్యం. హంతకుల వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా తెలుసుకున్నాం. పదే పదే గొడవలకు దిగే గూండాలు, పోకిరీలతో పాటు సమాజ విద్రోహ శక్తులను నిర్దాక్షిణ్యంగా గూండాచట్టం కింద అరెస్ట్ చేసి ఆటకట్టించాలని, రాష్ట్రం నుంచి బహిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించాం. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు 30 అంశాల కార్యక్రమాన్ని పోలీసులకు అందజేశాం. మహిళా కాలేజీలు, స్కూళ్ల వద్దగూండా కార్యకలాపాలు కనిపిస్తే వాటిని అంతం చేయాలి.మహిళలకు తగిన రక్షణ క ల్పిం చాలని సూచించాం. ఆఫ్రికా,నైజీరి యా తదితర దేశాల విద్యార్థులు నగరంలో పా ల్పడుతున్న అల్లరి చేష్టలను అరికట్టాం. యువకులను తప్పుదారి పట్టిస్తూ గంజాయి, హఫీమ్ తదితర మాదక వస్తువుల సరఫరా చేస్తున్న వారిపై నిఘా వహించాలని ఆదేశించాం. నేను మృదు స్వభావం కలిగిన వ్యక్తినే అయినా అవసరమైనపుడు కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనుకంజ వేయను. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు. నెంబర్‌వన్ కావాలనుకోవడం లేదు ప్రభుత్వంలో నేను నెంబర్ వన్ కావాలనుకోవడం లేదు. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నవారే కొనసాగుతారు. నా కుమార్తెకు మొదటి నుంచి సామాజి క సేవలో చాలా ఆసక్తి ఉండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చినట్లయితే పోటీ చేస్తుంది. లేనిపక్షంలో కాంగ్రెస్ అ భ్యర్థి గెలుపునకు శ్రమిస్తారు. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి రాకూడదనే నిబంధన ఎక్కడా లేదు. అన్ని రాజ కీయ పార్టీల్లో నాయకుల పిల్లలు ఉన్నారన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. టిప్పు జయంతిని జరగనివ్వరాదని బీజేపీ నాయకులు రాజకీయ స్వార్థంతో వ్యతిరేకించారు. అయితే వారు అధికారంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, సదానందగౌడ, ఆర్.అశోక్ తదితరులు టిప్పు సుల్తాన్ కండువా వేసుకొని టిప్పు జయంతిని ఆచరించటాన్ని మరచిపోయారు. టిప్పు జయంతికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు వారికి నైతిక హక్కు లేదు. మా శాఖలో అవినీతి అక్రమాల నివారణకు అన్ని విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసు సంక్షేమ నిధిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణపై పరిశీలించి తగిన చర్యలు తీసుకొంటామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బెంగళూరులోనూ సరి– బేసి పరిశీలన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీలోని సరి– బేసి వాహన విధానాల్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. డిల్లీలో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చే విధానం సక్సెస్ అయితే బెంగళూరులోనూ పాటిస్తామని చెప్పారు. బెంగళూరులో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది, దీంతో వాయు మాలిన్యమూ పెరుగుతోంది, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్నారని రామలింగారెడ్డి ఆరోపించారు. తమ మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సదాశివ శెణై, ఉపాధ్యక్షుడు దొడ్డ బొమ్మయ్య, ప్రధానకార్యదర్శి కిరణ్, కోశాధికారి రమేశ్ పాల్గొన్నారు. -
గౌరీ లంకేశ్ హంతకుల గుర్తింపు?
సాక్షి, బెంగళూర్ : సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితులను గుర్తించామని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో తెలిపారు. హంతకులెవరో మాకు తెలుసు. త్వరలో అన్ని విషయాలను వెల్లడిస్తాం అని ఆయన చెప్పారు. అయితే అందుకు సంబంధించి సరైన సాక్ష్యాలను సేకరించే పనిలో సిట్ బిజీగా ఉందని, ప్రస్తుతానికి మిగతా విషయాలను మీడియాకు వెల్లడించటం కష్టమని రామలింగా రెడ్డి చిక్ బల్లాపురాలో విలేకరులతో చెప్పారు. అదే సమయంలో సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించటంతో ఆసక్తికర చర్చ మొదలైంది. సెప్టెంబర్ 5న తన ఇంటి వద్ద గౌరీ లంకేశ్‌ను దుండగలు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసింది అతివాద హిందుత్వవాద సంఘమని పలువురు ఆరోపిస్తుండగా.. నక్సలైట్ సంఘాల పని అయి కూడా ఉండొచ్చన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నిందితుల ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించటంతోపాటు ఇంటెలిజెన్స్ ఐజీపీ బీకే సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. -
క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్
-
క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్
బెంగళూరు: జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వబోనని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందికపోవడాన్ని నిరసిస్తూ జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని ఆయన అన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ... ‘నా ప్రతిభ, కష్టార్జితానికి గుర్తింపుగా దక్కిన జాతీయ అవార్డులను వెనక్కి ఇవ్వను. నేను అవార్డులు వాపస్ చేయనున్నానని వచ్చిన వార్తలు నిరాధారం. ఇలాంటి నాకు ఆలోచన లేద’ని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోను తన ట్విటర్ పేజీలో పెట్టారు. గౌరి లంకేష్ హత్యను ఖండించిన వారిపై సోషల్ మీడియాలో దూషణలకు దిగినవారిని ప్రధాని మోదీ ఏమీ అనకపోవడం పట్ల ప్రకాశ్ రాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఇంత జుగుప్సకరమైన భాషను నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. ప్రధాని మోదీ అనుచరులు ట్విటర్, ఫేస్బుక్లో నన్ను దారుణంగా తిట్టారు. అయినా ప్రధాని నోరు మెదపలేదు. గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్ట్ దారుణ హత్యకు గురైతే ప్రధాని ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయమే నన్ను బాధ పెడుతోందని అన్నాను తప్పా అవార్డులు వెనక్కు ఇచ్చేస్తానని చెప్పలేద’ని అన్నారు. -
ప్రధాని మోదీపై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకంటే పెద్ద నటుడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ గౌరి లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. తనను అనుకరించాలని అభిమానులకు నటుడు చెప్పినట్టుగా మోదీ మౌనం ఉందని పేర్కొన్నారు. దీన్నిబట్టే ఆయన తన కంటే పెద్ద నటుడన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘం డీవైఎఫ్ఐ 11వ రాష్ట్ర సమావేశంలో ఆదివారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘గౌరి లంకేశ్‌ను హత్యచేసిన వారిని పట్టుకోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారంతా ఎవరో, వారి సిద్ధాంతం ఏమిటో మనకు తెలుసు. వీరిలో కొంత మందిని నరేంద్ర మోదీ ఫాలో కావడం నన్ను కలవరపెడుతోంది. మోదీ మౌనం ఆందోళన కలిగిస్తోంది. తన మద్దతుదారులు చేసిన దారుణాన్ని సమర్థించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంద’ని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఇటువంటి దారుణాలపై ప్రధాని మోదీ మౌనం కొనసాగిస్తే తన ఐదు జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేందుకు వెనుకాడబోనని ఆయన ప్రకటించారు. బెంగళూరులోని తన నివాసంలో గౌరి లంకేశ్‌ను సెప్టెంబర్ 5న ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. గౌరి లంకేశ్ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. -
కేంద్రమంత్రిపై మండిపడ్డ సీఎం
సాక్షి, మైసూరు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌కు భద్రత కల్పించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘గౌరీ లంకేశ్ ప్రాణాలకు ముప్పు ఉందని మా ప్రభుత్వానికి ముందుగా తెలిసినట్టు ఆ కేంద్ర మంత్రి చెప్పారు. ఆమె కోరినా మేము భద్రత కల్పించలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి బాధ్యతారహితంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నార’ని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపిన గౌరికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని రవిశంకర్ ప్రసాద్ అంతకుముందు ప్రశ్నించారు. అయితే తన ప్రాణానికి ముప్పు ఉందన్న విషయం తమతో గౌరి చెప్పలేదని, భద్రత కూడా కోరలేదని సిద్ధరామయ్య తెలిపారు. గౌరీ లంకేశ్ చాలా మంచి మనిషి అని, ఆమెను ఎవరూ ద్వేషించరని చెప్పారు. గౌరికి ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి ఆమెకు భద్రత కల్పించారా, లేదా అని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగానని రవిశంకర్ ప్రసాద్ తాజాగా పేర్కొన్నారు. -
హంతకుల ఆచూకీ చెబితే భారీ రివార్డు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య చేసిన వారి ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. గౌరి హత్య కేసును విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బెంగళూరులోని రాజరాజేశ్వరనగర్‌లోని తన నివాసం వద్ద గౌరీ లంకేశ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి అతిసమీపం నుంచి కాల్చిచంపారు. గౌరి హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, గౌరీ లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం సిద్ధరామయ్య నిన్న తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తామేనాడూ చెప్పలేదని, గౌరి లంకేశ్ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. -
గౌరీ లంకేశ్ కేసు... సీబీఐ కాదు సిట్ కరెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అప్పగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ విచారణకు కూడా ఆదేశించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను అస్సలు నమ్మలేమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టే తాము సీబీఐ విచారణను వద్దంటున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ కేసు విచారణకు సిట్ కరెక్ట్. సీబీఐను నమ్మటానికి అస్సలు లేదు. అది నైతిక విలువలు లేని ఓ సంస్థ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మరో నేత పీఎల్ పునియా ఘటనను భావ ప్రకటన హక్కుపై దాడిగా అభివర్ణించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం వీలైనంత త్వరగా కేసు చిక్కుముడి విప్పుతుందని భావిస్తున్నట్లు పునియా తెలిపారు. ఐజీపీ ఇంటలిజెన్స్ అధికారి బీకే సింగ్ నేతృత్వంలో 19 మంది అధికారులతో కూడిన సిట్ బృందాన్ని కర్ణాటక ప్రభుత్వం గౌరీ లంకేశ్ హత్య కేసు కోసం నియమించింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబడుతుండగా, అందుకు తాము సిద్ధమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మాటలు రావడం లేదు: సీఎం
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గౌరి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీయిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో విచారణ కోసం ఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హంతకులు హెల్మెట్ ధరించి వచ్చి ఈ కిరాతకానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. గౌరీ లంకేశ్ ఇటీవలే తనను కలిశారని, ఎటువంటి ప్రాణహాని ఉందని చెప్పలేదన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయం డీజీపీకి వదిలిపెట్టామన్నారు. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కల్బుర్గీ, దభోల్కర్‌లను హత్యలకు... గౌరి హత్య కేసుకు సంబంధం ఉందో, లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాష్ట్రంలో అభ్యుదయవాదులందరికీ రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. గౌరీ లంకేశ్ హత్య తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఈ కిరాతకాన్ని ఖండించడానికి మాటలు రావడం లేదని మంగళవారం రాత్రి సిద్ధరామయ్య ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన హత్య. గౌరి మరణంతో కర్ణాటక బలమైన అభ్యుదయ గళాన్ని కోల్పోయింది. నేను స్నేహితురాలిని పోగొట్టుకున్నాన’ని ట్వీట్ చేశారు.