
కర్ణాటక హోంమంత్రి రామలింగా రెడ్డి
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య చేసిన వారి ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. గౌరి హత్య కేసును విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బెంగళూరులోని రాజరాజేశ్వరనగర్‌లోని తన నివాసం వద్ద గౌరీ లంకేశ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి అతిసమీపం నుంచి కాల్చిచంపారు. గౌరి హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, గౌరీ లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం సిద్ధరామయ్య నిన్న తెలిపారు. కేసును సీబీఐకి అప్పగించబోమని తామేనాడూ చెప్పలేదని, గౌరి లంకేశ్ కుటుంబ సభ్యులు కోరితే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.