చూపుడువేలిపై సిరా చుక్క. ఓటేశామని చెప్పేందుకు తిరుగులేని గుర్తు. పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే చూపుడువేలిపై సిరా చుక్కను చూపిస్తూ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. ఆ ఇంకు కథ ఆసక్తికరం.
ప్రపంచవ్యాప్తంగా..
మన దేశంలో 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి సిరా చుక్క వాడకం మొదలైంది. నాటినుంచి నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్సే దీన్ని సరఫరా చేస్తోంది. 30 పై చిలుకు దేశాలకు ఈ ఇంకును ఎగుమతి చేస్తోంది కూడా.
ఇదీ ప్రత్యేకత...
► ఓటేసినట్లు రుజువుగా ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తా రు. ఎడమ చేయే లేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే? ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ చెబుతోంది.
► సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. గోరుపై మాత్రం వారాల పాటు ఉంటుంది.
► 5.1 మిల్లీలీటర్ల సీసాలోని ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26 లక్షల ఇంకు బాటిళ్లు ఆర్డర్ చేసింది.
► మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకేసారి ఈసీ అనుమతించింది. అదెప్పుడంటే.. కరోనా వ్యాప్తి సమయంలో. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఇంకును ఉపయోగించాయి.
– సాక్షి, ఎలక్షన్ డెస్క్
చెరిగిపోని సిరాచుక్క
Published Tue, Apr 16 2024 12:51 AM | Last Updated on Tue, Apr 16 2024 12:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment