నాలుగో దశలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఎన్నికలు
ఏపీ అసెంబ్లీకి.. రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగించనున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు.
బరిలో 525 మంది..: లోక్‌సభ ఎన్నికల్లో 1,65,28,366 మంది పురుష ఓటర్లు, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 2,760 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,32,32,318 మంది ఓటేయనున్నారు. 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 525 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. ఇందులో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈవీఎంలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిశాక ఎన్నికల సిబ్బంది సంబంధిత లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్‌కు తీసుకెళ్లి ఈవీఎంలను అప్పగిస్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. మరోవైపు ఏపీ అసెంబ్లీకి కూడా సోమవారమే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి 25 ఎంపీ సీట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
గందరగోళ పడకుండా ఓటేయండి..: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది బరిలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో 7 లోక్‌సభ స్థానాల పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లతో, 9 లోక్‌సభ స్థానాల పరిధిలో రెండు బ్యాలెట్ యూనిట్లతో, ఒక లోక్‌సభ స్థానంలో ఒక బ్యాలెట్ యూనిట్‌తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా.. ఈవీఎంలో అభ్యర్థుల క్రమాన్ని పోలింగ్ బూత్‌ల బయట ప్రదర్శనకు పెట్టనున్నట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఇక దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిళ్లు, ర్యాంపులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్..
రాష్ట్రంలో మొత్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. ఆ డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి అప్పగిస్తారు.
గడువు ముగిసే సరికి.. క్యూలో ఉంటే ఓటేయవచ్చు..
పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. అలా క్యూలో ఉన్నవారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. సమయం ముగిశాక పోలింగ్ కేంద్రానికి చేరుకునేవారికి ఓటేసేందుకు అవకాశం ఉండదు. ఎండ పెరగక ముందే ఉదయమే ఓటేస్తే మంచిదని.. వానలతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గడం ఊరట కల్పించే అంశమని అధికారులు చెప్తున్నారు.
ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్..
రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని ఆదివారం రాత్రే తరలించామని అధికారులు వివరించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకే అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు ప్రారంభించనున్నారు.
10 మంది ఓటర్లకే పోలింగ్ కేంద్రం
ఈసారి అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్న ప్రాంతాల్లో సైతం పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లోని ఈ ఓటర్లు దూర ప్రాంతాలకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం లేకుండా చేసింది. అత్యల్పంగా 10 మంది, 12 మంది, 14 మంది ఓటర్లున్న మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 25మందిలోపు ఓటర్లున్నవి 11, 50 మందిలోపు ఉన్నవి 22, 100 మంది లోపు ఉన్నవి 54 పోలింగ్ కేంద్రాలు ఉండటం గమనార్హం.
హోరాహోరీగా పోరు!
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గట్టిగా పోరాడినా అధికారం పోగొట్టుకున్న బీఆర్‌ఎస్, కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇలా మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. 16 లోక్‌సభ స్థానాల్లో మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడనుండగా.. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇస్తున్నారు. గత నెల రోజులుగా మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో.. ఎక్కువ స్థానాల్లో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment