indelible ink
-
Inedible Ink: తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు!
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు వదలడం లేదు. ఆమెకు ఇదో పెద్ద తలనొప్పిగా కూడా మారింది! షోరన్పూర్లోని గురువాయూరప్పన్ నగర్లో ఉండే 62 ఏళ్ల ఉష 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన ఇంకు గుర్తు 9 ఏళ్లయినా మాసిపోలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి ‘నువ్విప్పటికే ఓటేశావు పొ’మ్మన్నారట ఎన్నికల అధికారులు! పోలింగ్ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్‌ల్లో ఎందుకీ గోల అని 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు! ఈసారీ అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.ప్రచారానికి వచ్చిన ఓ నాయకునికి విషయం చెప్పడంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చారట. ఎన్నికల సిరా గుర్తు ఇంతకాలం పాటు చెరగకుండా ఉన్న ఘటనలు ఎక్కడా లేవని వారు విస్తుపోతున్నారు! అయితే ఇలా జరిగేందుకు అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ‘‘సిరా చుక్క గోళ్ల కింద చేరితే మచ్చ అలాగే ఉండే చాన్సుంది. సమగ్ర వైద్య పరీక్షలు చేస్తే కారణం తెలుస్తుంది’’ అని చెబుతున్నారు. -
చెరిగిపోని సిరాచుక్క
చూపుడువేలిపై సిరా చుక్క. ఓటేశామని చెప్పేందుకు తిరుగులేని గుర్తు. పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే చూపుడువేలిపై సిరా చుక్కను చూపిస్తూ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. ఆ ఇంకు కథ ఆసక్తికరం. ప్రపంచవ్యాప్తంగా.. మన దేశంలో 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి సిరా చుక్క వాడకం మొదలైంది. నాటినుంచి నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్సే దీన్ని సరఫరా చేస్తోంది. 30 పై చిలుకు దేశాలకు ఈ ఇంకును ఎగుమతి చేస్తోంది కూడా. ఇదీ ప్రత్యేకత... ► ఓటేసినట్లు రుజువుగా ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తా రు. ఎడమ చేయే లేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే? ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ చెబుతోంది. ► సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. గోరుపై మాత్రం వారాల పాటు ఉంటుంది. ► 5.1 మిల్లీలీటర్ల సీసాలోని ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26 లక్షల ఇంకు బాటిళ్లు ఆర్డర్ చేసింది. ► మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకేసారి ఈసీ అనుమతించింది. అదెప్పుడంటే.. కరోనా వ్యాప్తి సమయంలో. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఇంకును ఉపయోగించాయి. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
మూణ్నాళ్ల మురిపెం!ఆ సిరా గురుతు!!
కాకినాడ: ‘నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగు చుక్క’ అంటూ ఎన్నికల సంఘం ఓటు విలువను తెలియజేస్తుంటుంది. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి వ్యక్తికీ ఎడమచేతి బొటన వేలిపై సిరా చుక్క పెడతారు. చేతి వేళ్లులేని దివ్యాంగులకు కాలి వేళ్లకు సిరా చుక్క పెడతారు. ఇది ఓటేశామని గుర్తు మాత్రమే కాదు. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం. ఎన్నికలలో వాడే ఇండెలిబుల్ ఇంక్ వేలిపై పెడితే 72 గంటల పాటు చెరిగిపోదు. ఈ సిరాను 1962 నుంచి కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వారి్నష్ కంపెనీ తయారు చేస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ కంపెనీ నుంచే సిరా సరఫరా అవుతుంది. సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండడంతో ఎక్కువ కాలం చెరిగిపోకుండా ఉంటుంది. -
‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్
-
‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకుంటున్న వారికి ఇంకు గుర్తు వాడొద్దని సూచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోమయం నెలకొనే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది. నగదు మార్పిడి చేసుకుని సిరా చుక్క పెట్టించుకున్న వారు ఓటు వేయడానికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఇంకు గుర్తు వేయించుకుని పోలింగ్ బూత్ కు వస్తే అప్పటికే ఓటు వేశారన్న అనుమానం కలిగే అవకాశముందని వివరించింది. బ్యాంకుల్లో ఇంకు గుర్తు వేయడం మానాలని ఆర్థిక శాఖను ఈసీ కోరింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడికి వచ్చే వారికి వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఇంకు మహిమలు ఇంతింత కాదయా!
చూపుడు వేలు మీద చెరగని ఇంకు గీత! ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇదే. 'నేను వోటు వేశానోచ్' అని సగర్వంగా చెప్పుకునేందుకు ఇదొక తిరుగులేని సాక్ష్యం. ఈ సారి ఎన్నికల్లో కూడా దాదాపు 81.4 కోట్ల మంది ఓటర్లు దేశ వ్యాప్తంగా ఓటు చేయబోతున్నారు. వారందరి చూపుడు వేలిపైనా ఈ ఇంకు గీత దర్శనమిస్తుంది. ఇండెలిబుల్ ఇంక్ గా పేరొందిన ఈ చెరగని ఇంక్ గురించి కొన్ని కబుర్లు. * 1960 నుంచీ దేశంలో ఎన్నికల్లో ఈ చెరగని ఇంకు ను ఉపయోగిస్తున్నారు. దొంగవోట్లను నిరోధించేందుకు ఇదొక శక్తివంతమైన సాధనం. వేసీ వేయగానే ఈ ఇంకు ఆరిపోతుంది. దీన్ని చెరపడం చాలా కష్టం. ఈ ఇంకు ఆరు నెలల పాటు ఉంటుంది. * దేశం మొత్తం మీద ఇండెలిబుల్ ఇంక్ ను సరఫరా చేసేది మైసూర్ లోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే. అంటే దేశంలో ఎక్కడ ఓటు పడినా అక్కడ ఓ పిసరంత మైసూరు తప్పకుండా ఉంటుందన్న మాట. * ఈ సంస్థను 1937 లో అప్పటి మైసూరు మహారాజా నలవాది కృష్ణరాజ వడయార్ ఏర్పాటుచేశారు. ఈ సంస్థ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే లక్కను కూడా తయారు చేస్తుంది. 1962 నుంచి చెరగని ఇంకు తయారీ కోసం ఈ సంస్థ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. * ఈ ఎన్నికల్లో దాదాపు 21.65 ఫియల్స్ (బాటిల్స్) ఇంక్ ను సరఫరా చేసేందుకు ఆర్డర్ లభించింది. ప్రతి బాటిల్ లో 10 మిలీ ఇంక్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కి 3.2 లక్షల బాటిళ్లు, మహరాష్ర, ఆంధ్రప్రదేశ్ లకి చెరో రెండు లక్షల బాటిళ్ల ఇంక్ సరఫరా చేయబోతోంది. గత లోకసభ ఎన్నికల్లో ఎంపీవీఎల్ 19.4 లక్షల బాటిళ్ల ఇంకును సరఫరా చేసింది. * ఎన్నికల కోసం ఫిబ్రవరి నుంచే ఇంకు తయారీ మొదలైంది. .