
ఇంకు మహిమలు ఇంతింత కాదయా!
చూపుడు వేలు మీద చెరగని ఇంకు గీత! ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇదే. 'నేను వోటు వేశానోచ్' అని సగర్వంగా చెప్పుకునేందుకు ఇదొక తిరుగులేని సాక్ష్యం. ఈ సారి ఎన్నికల్లో కూడా దాదాపు 81.4 కోట్ల మంది ఓటర్లు దేశ వ్యాప్తంగా ఓటు చేయబోతున్నారు. వారందరి చూపుడు వేలిపైనా ఈ ఇంకు గీత దర్శనమిస్తుంది. ఇండెలిబుల్ ఇంక్ గా పేరొందిన ఈ చెరగని ఇంక్ గురించి కొన్ని కబుర్లు.
* 1960 నుంచీ దేశంలో ఎన్నికల్లో ఈ చెరగని ఇంకు ను ఉపయోగిస్తున్నారు. దొంగవోట్లను నిరోధించేందుకు ఇదొక శక్తివంతమైన సాధనం. వేసీ వేయగానే ఈ ఇంకు ఆరిపోతుంది. దీన్ని చెరపడం చాలా కష్టం. ఈ ఇంకు ఆరు నెలల పాటు ఉంటుంది.
* దేశం మొత్తం మీద ఇండెలిబుల్ ఇంక్ ను సరఫరా చేసేది మైసూర్ లోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే. అంటే దేశంలో ఎక్కడ ఓటు పడినా అక్కడ ఓ పిసరంత మైసూరు తప్పకుండా ఉంటుందన్న మాట.
* ఈ సంస్థను 1937 లో అప్పటి మైసూరు మహారాజా నలవాది కృష్ణరాజ వడయార్ ఏర్పాటుచేశారు. ఈ సంస్థ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే లక్కను కూడా తయారు చేస్తుంది. 1962 నుంచి చెరగని ఇంకు తయారీ కోసం ఈ సంస్థ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
* ఈ ఎన్నికల్లో దాదాపు 21.65 ఫియల్స్ (బాటిల్స్) ఇంక్ ను సరఫరా చేసేందుకు ఆర్డర్ లభించింది. ప్రతి బాటిల్ లో 10 మిలీ ఇంక్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కి 3.2 లక్షల బాటిళ్లు, మహరాష్ర, ఆంధ్రప్రదేశ్ లకి చెరో రెండు లక్షల బాటిళ్ల ఇంక్ సరఫరా చేయబోతోంది.
గత లోకసభ ఎన్నికల్లో ఎంపీవీఎల్ 19.4 లక్షల బాటిళ్ల ఇంకును సరఫరా చేసింది.
* ఎన్నికల కోసం ఫిబ్రవరి నుంచే ఇంకు తయారీ మొదలైంది. .