ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు వదలడం లేదు. ఆమెకు ఇదో పెద్ద తలనొప్పిగా కూడా మారింది! షోరన్‌పూర్‌లోని గురువాయూరప్పన్ నగర్‌లో ఉండే 62 ఏళ్ల ఉష 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన ఇంకు గుర్తు 9 ఏళ్లయినా మాసిపోలేదు.
అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి ‘నువ్విప్పటికే ఓటేశావు పొ’మ్మన్నారట ఎన్నికల అధికారులు! పోలింగ్ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్‌ల్లో ఎందుకీ గోల అని 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు! ఈసారీ అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.
ప్రచారానికి వచ్చిన ఓ నాయకునికి విషయం చెప్పడంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చారట. ఎన్నికల సిరా గుర్తు ఇంతకాలం పాటు చెరగకుండా ఉన్న ఘటనలు ఎక్కడా లేవని వారు విస్తుపోతున్నారు! అయితే ఇలా జరిగేందుకు అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ‘‘సిరా చుక్క గోళ్ల కింద చేరితే మచ్చ అలాగే ఉండే చాన్సుంది. సమగ్ర వైద్య పరీక్షలు చేస్తే కారణం తెలుస్తుంది’’ అని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment