Dermatitis
-
Inedible Ink: తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు!
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు వదలడం లేదు. ఆమెకు ఇదో పెద్ద తలనొప్పిగా కూడా మారింది! షోరన్పూర్లోని గురువాయూరప్పన్ నగర్లో ఉండే 62 ఏళ్ల ఉష 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన ఇంకు గుర్తు 9 ఏళ్లయినా మాసిపోలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి ‘నువ్విప్పటికే ఓటేశావు పొ’మ్మన్నారట ఎన్నికల అధికారులు! పోలింగ్ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ బూత్‌ల్లో ఎందుకీ గోల అని 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయలేదు! ఈసారీ అదే సమస్య ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు.ప్రచారానికి వచ్చిన ఓ నాయకునికి విషయం చెప్పడంతో ఆయన ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని వాళ్లు హామీ ఇచ్చారట. ఎన్నికల సిరా గుర్తు ఇంతకాలం పాటు చెరగకుండా ఉన్న ఘటనలు ఎక్కడా లేవని వారు విస్తుపోతున్నారు! అయితే ఇలా జరిగేందుకు అవకాశం ఉందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. ‘‘సిరా చుక్క గోళ్ల కింద చేరితే మచ్చ అలాగే ఉండే చాన్సుంది. సమగ్ర వైద్య పరీక్షలు చేస్తే కారణం తెలుస్తుంది’’ అని చెబుతున్నారు. -
మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!
'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్ డర్మటైటిస్’ అంటారు. ఈ సీజన్లో నెలల పిల్లలు మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్ డర్మటైటిస్ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.' అటోపిక్ డర్మటైటిస్లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) సాగుతుంటాయి. కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్ డర్మటైటిస్ సమస్య ఎక్కువ. వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఇలా.. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్ డర్మటైటిస్’ అంటారు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. చికిత్స / మేనేజ్మెంట్ తొలి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్): అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం: సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి. ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్ తో శుభ్రం చేసుకోవాలి. పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి. పూత మందులతో చికిత్స: పిల్లలకు ఎమోలియెంట్స్ అని పిలిచే.. లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్‌ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్ కాంబినేషన్స్‌ను వాడవచ్చు. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు: నిద్రకు ముందు డాక్టర్ సలహా మేరకు నాన్ సెడెటివ్ యాంటీహిస్టమైన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. రెండోదశ చికిత్స: మొదటిదశ చికిత్స (ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ చికిత్స: కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్): నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటి ఈ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి. వెట్ ర్యాప్ టెక్నిక్.. అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్ ర్యాప్ టెక్నిక్’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్‌ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే వెట్ ర్యాప్ టెక్నిక్ అంటారు. దీంతో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రతను తగ్గించవచ్చు. లక్షణాలు.. చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు. ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్) మారుతుంది. కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు. మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్). ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..! -
రోల్డ్‌గోల్డ్ నగలతో ర్యాష్ వస్తుంటే...
హోమియో కౌన్సెలింగ్స్ నేను అప్పుడప్పుడూ రోల్డ్‌గోల్డ్ నగలు వేసుకుంటుంటాను. ఈ మధ్య వాటిని వేసుకున్న తర్వాత మెడ భాగంలో, చేతులకు దురద, పొక్కులు వస్తున్నాయి. అదే గోల్డ్ నగలు వేసుకుంటే ఏమీ కాదు. దీనికి కారణం ఏమిటి? హోమియోలో పరిష్కారం చెప్పండి. – సునీత, హైదరాబాద్ మీరు చెప్పిన కారణాలతో చర్మ శోధ రావడం వల్ల కలిగే ఈ పరిణామాన్ని డర్మటైటిస్గా చెప్పవచ్చు. ఇలా జరిగినప్పుడు చర్మం ఎర్రబారి దురద, మంట వస్తాయి. ఇది శారీరకంగా సమస్యగా పరిణమించడంతో పాటు మానసికంగానూ కుంగదీస్తుంది. డర్మటైటిస్‌ను వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి... కాంటాక్ట్ డర్మటైటిస్ : దీన్ని స్పర్శ చర్మశోధగా చెప్పవచ్చు. ఇందులో చర్మంపై సాధారణంగా గులాబి లేదా ఎరుపు దద్దుర్లు వస్తాయి. దురద కూడా ఉంటుంది. ఇది చికాకు, అలర్జీని కలిగిస్తుంది. మీరు చెప్పినట్లుగా ఆభరణాలు, రబ్బరు తొడుగులు దీనికి కారణమవుతాయి. అలాగే కొన్ని రకాల పరిమళ ద్రవ్యాలు, జుట్టు రంగులు(హెయిర్‌డై), చర్మ సంబంధిత ఉత్పత్తుల వల్ల కూడా ఇది సంభవించవచ్చు. నుమ్యులార్ డర్మటైటిస్ : ఇందులో మచ్చలు నాణెం ఆకృతిలో ఎరుపు ఫలకాల్లా ఉంటాయి. ఇది సాధారణంగా కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై కనిపిస్తుంది. ఇది స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 55 నుంచి 65 ఏళ్ల మధ్య వారిలో ఎక్కువ. ఎగ్జిమా : ఇది కూడా ఒక రకమైన డర్మటైటిస్. క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ని ఎగ్జిమా అంటారు. ఎగ్జిమాలో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లుగా కనిపించడం, కొద్దిగా పొరలుగా తయారవ్వడం, వాపు, దురద దీనిలో ప్రధాన లక్షణాలు. ఎగ్జిమా బయటపడేప్పుడు మొదట చర్మం కమిలినట్లగా ఎరుపురంగుకి మారుతుంది. తర్వాత పొక్కుల్లా వచ్చి, అవి క్రమంగా నీటిపొక్కుల ఆకృతిని సంతరించుకుంటాయి. సెబోరిక్ డర్మటైటిస్ : ఇది పిల్లల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖం, తల మీది చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా కనిపిస్తుంది. ఇంకా కనుబొమల సమీపంలో, ముక్కుకు ఇరుపక్కలా వ్యాపిస్తుంది. ఇది అధిక ఒత్తిడి వల్ల రావచ్చు. కారణాలు : ∙రోల్డ్‌గోల్డ్ నగలు ∙కొన్ని రకాల మందులు వాడటం వల్ల ∙జుట్టు కోసం వాడే రంగులతో ∙ఇక బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో కూడా డర్మటైటిస్ రావచ్చు. చికిత్స : డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీమోనియమ్ క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ముక్కులు బిగదీసుకుపోయి వాసనలు తెలియడం లేదు నా వయసు 28 ఏళ్లు. నాకు గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారవడంతోపాటు ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – రవికిరణ్, కోదాడ మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటు వాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ : ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం ∙చల్లిని వాతావరణానికి దూరంగా ఉండటం, ∙పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స : హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది నా వయసు 58 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటం, కీళ్లవద్ద ఎర్రగా మారడం జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఫణీంద్ర, కాకినాడ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి. ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్