
కాకినాడ: ‘నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగు చుక్క’ అంటూ ఎన్నికల సంఘం ఓటు విలువను తెలియజేస్తుంటుంది. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి వ్యక్తికీ ఎడమచేతి బొటన వేలిపై సిరా చుక్క పెడతారు. చేతి వేళ్లులేని దివ్యాంగులకు కాలి వేళ్లకు సిరా చుక్క పెడతారు. ఇది ఓటేశామని గుర్తు మాత్రమే కాదు. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం.
ఎన్నికలలో వాడే ఇండెలిబుల్ ఇంక్ వేలిపై పెడితే 72 గంటల పాటు చెరిగిపోదు. ఈ సిరాను 1962 నుంచి కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వారి్నష్ కంపెనీ తయారు చేస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ కంపెనీ నుంచే సిరా సరఫరా అవుతుంది. సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండడంతో ఎక్కువ కాలం చెరిగిపోకుండా ఉంటుంది.