
పూర్వం అనుభవజ్ఞులైన ఆలోచనాపరులు జీవితానికి సంబంధించి వివిధ దశలలో వివిధ నియమాలను, జీవన పద్ధతులను నిర్దేశించి చెప్పి, ఆ పద్ధతుల ప్రకారం జీవనం సాగిస్తే జీవితం సాఫీగా సాగడమే కాకుండా, ఇహలోకం నుండి నిష్క్రమించడం కూడా అంతగా బాధ అనిపించకుండా జరుగుతుందని చెప్పారు. ఆ పద్ధతులలో ఒక వ్యక్తి గృహస్థుడిగా జీవితాన్ని గడిపి, నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నిర్వర్తించాక, వృద్ధాప్యంలో సన్యాసాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయి, శేషజీవితం అక్కడ గడిపి ప్రశాంతంగా ఇహలోకాన్ని వదిలి ప్రకృతిలో కలిసి పొమ్మన్నారు. అయితే, సన్యాసం స్వీకరించడం అందరూ చేయగలిగే పని కాదనీ, ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న బంధాలను ఒక్కసారిగా తెంచు కుని వెళ్ళిపోవడం ఏ కొద్దిమందికో మాత్రమే సాధ్యమయ్యే పనీ అని ఆచరణలో తేలింది. ఫలితంగా, అడవులకే వెళ్ళాలా? అన్న ప్రశ్న ఉదయించి, అన్నిటికీ మనసే మూలం కనుక, మనసు చేసే ఆలోచనలను కట్టడి చేస్తే, అడవులకు వెళ్ళవలసిన పనిలేదని చెప్పుకోవడం జరిగింది.
ఈ విషయంపై దంతులూరి బాపకవి రచించిన ‘మూర్తిత్రయో పాఖ్యానము’ ద్వితీయాశ్వాసంలో ఆసక్తికరమైన వివరణ ఉంది. ‘ఇల్లు వదిలిపెట్టి అడవులలోకి అడుగుపెట్టగానే కామ సంబంధమైన ఆలో చనలు కరిగిపోయి, బుద్ధి నిష్కామమై మిగులుతుందా? మిగలదు కదా! అలాగే క్రోధ మోహ మద మాత్సర్యాలనే లక్షణాలు కూడా జీవితంలో ఏదో ఒక క్షణం నుండి మొదలై, మరొక క్షణంలో అంత మవ్వాలని కోరుకున్నప్పుడు అంతమయ్యేవిగా ఉండవు. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే, తాను అలా అయిపోయానని అంటే... అతడిని మించిన మోసగాడు మరొకడు ఉండడు!’ అన్నది ఆ వివరణ సారాంశం. ఆ సందర్భంలో ముఖ్య విషయానికి ముక్తాయింపుగా ఈ క్రింది పద్యం చెప్పబడింది.
చదవండి: UoH వర్సిటీ భూములను కాపాడాలి!
తే. మనసు నిలుపలేని మనుజుండు వనములో
నున్నయంత మోక్షయుక్తి లేదు
వహ్నిలోన నెన్ని వారముల్ వైచినం
గుప్యమునకు హేమగుణము గలదె?
‘మనసును కట్టడి చేసుకోలేకపోతే అడవిలో ఉండి కూడా ప్రయో జనం ఏమీ కలగదు. అగ్నిలో ఎన్ని వారాల పాటు మండించి కరి గించినా కుప్యం (బంగారం, వెండి తక్క అన్యలోహం) బంగారమవు తుందా? కాదు కదా! ఆ విధంగానే ఆలోచనలను అదుపులో ఉంచు కోకుండా కొనసాగించే అడవులలో జీవనం ప్రయోజనం లేనిదిగా పరిణమిస్తుంద’ని భావం.
ఇదీ చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
– భట్టు వెంకటరావు
Comments
Please login to add a commentAdd a comment