
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్ కల్యాణ్ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు.
లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్ ఫైనలియర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.
ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.
బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు.
సీసీ ఫుటేజీ ఎక్కడ?
బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది.
వాడిని చంపేయండి..!
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.