చంద్రబాబుకి అలా చెప్పిన అధికారి ఎవరు?: భూమన | Bhumana Karunakara Reddy Reacts On Chandrababu Tirumala TTD Drama | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి అలా చెప్పిన అధికారి ఎవరు?: భూమన

Published Sat, Mar 22 2025 1:44 PM | Last Updated on Sat, Mar 22 2025 1:51 PM

Bhumana Karunakara Reddy Reacts On Chandrababu Tirumala TTD Drama

తిరుపతి, సాక్షి: తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం మాత్రమే చంద్రబాబు, పవన​ కల్యాణ్‌లకు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakara Reddy) అంటున్నారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. 

గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి.  హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్ఆర్ పాలనలో తీసుకున్నదే. కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, తుడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలి.

.. తిరుమలలో ఆధ్యాత్మికానికి.. పర్యాటకానికి ఎక్కడా పొంతన ఉండదు. 2014-19 టీడీపీ పాలనలో దేవలోక్‌(Devlok)కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. అదీ మా పాలనపై రుద్దుతున్నారు. హిందూ ధర్మంకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసానికి స్వామీజీలు, సన్యాసులు అంతా కదన రంగానికి కదలి వచ్చారు. ఆ కారణంగా భయపడే విరమించుకున్నారు. 

శ్రీవాణి ట్రస్ట్ టీడీపీ హయాంలోనే ఏర్పాటు చేశారు. కానీ, వైఎస్సార్‌సీపీ(YSRCP) పాలనలో అత్యద్భుతంగా నిర్వహించాం. వేల కోట్ల రూపాయలు ఈ ట్రస్ట్‌ ద్వారానే జమ అయ్యాయి. టీటీడీ తరఫున దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాం. జగన్  పాలనలో 3,600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేయించారు. ఇది చూసి ఓర్వలేక.. ట్రస్ట్‌ నిధులు దుర్వియోగం అయ్యాయని అసత్యప్రచారాలకు దిగారు. విజిలెన్స్‌ విచారణ జరిపించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టగానే బీఆర్‌ నాయుడు ఆ ట్రస్ట్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ, విజిలెన్స్‌ రిపోర్ట్‌ సమర్థవంతంగా నిర్వహించిన్నట్లు వచ్చింది. దీంతో.. శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడటం మానేశారు. 

తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు అనడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో ఆలయం మూసి వేస్తామని చెప్పిన అధికారి ఎవరు?. అధికారులు మూసేయాలి అనుకున్నారు.. అని ఎలా చెప్తారు?. 90 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే .. వారిని అరెస్టు చేయిస్తామని హెచ్చరించడం ఏంటి?. ఏ చట్టంతో  మీరు అధికారులు ను అరెస్టు చేస్తారు? భయపెడుతున్నారు?. తప్పు చేసే అధికారులు అధికారులు తప్పు చేస్తే, వారినీ సస్పెండ్ చేయాలి లేదంటే బదిలీ చేయాలి. కేవలం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడానికి అధికారులను తెరపైకి తెస్తున్నారు. 

👉తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అయినా కూడా చంద్రబాబు తిరుమలకు ఎలా వస్తారు?. అదేమైనా చిత్తూరు జిల్లా  సాంప్రదాయం?.. సద్దులు చెప్పడానికేనా? మీరు పాటించరా చంద్రబాబు?. పైగా తిరుమల వేంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తారా?(అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన)

👉తిరుమలలో సీఎంవో కార్యాలయం నుంచే వీఐపీల దర్శన దందా నడుస్తోంది. ఈ కారణంగానే సామాన్యులకు మధ్యాహ్నం దాటితే కానీ దర్శనం కావడం లేదు. 

👉సనాతన ధర్మం కాపాడతాం అని చెప్పిన పవన్ కల్యాణ్‌.. విజయవాడలో గణపతి ఆలయం కూల్చివేస్తే ఎక్కడ ఉన్నారు?. మౌనంగానే ఉండి కాపాడుతున్నారా? ఇప్పటికైనా పవన్‌ సమాధానం చెప్పాలి. 

అధికారంలోకి రాగానే.. తిరుమలలో  ప్రక్షాళన శ్యామలరావుతో మొదలు పెట్టాం అని  చెప్పారు. శ్యామల రావు నెయ్యిలో ఎలాంటి జంతు పదార్థాలు కలవలేదు అని చెప్పారు. గతంలో అడిషనల్ ఈవో గా పనిచేసిన ధర్మా రెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న అడిషనల్‌ ఈవో.. తిరుమలలో ఉన్న నిర్వాసితులను వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ బెదిరిస్తున్నారు అంటూ భూమన మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement