
‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకుంటున్న వారికి ఇంకు గుర్తు వాడొద్దని సూచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోమయం నెలకొనే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది.
నగదు మార్పిడి చేసుకుని సిరా చుక్క పెట్టించుకున్న వారు ఓటు వేయడానికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఇంకు గుర్తు వేయించుకుని పోలింగ్ బూత్ కు వస్తే అప్పటికే ఓటు వేశారన్న అనుమానం కలిగే అవకాశముందని వివరించింది. బ్యాంకుల్లో ఇంకు గుర్తు వేయడం మానాలని ఆర్థిక శాఖను ఈసీ కోరింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడికి వచ్చే వారికి వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.