యూపీలో బీజేపీ వ్యూహం ఇదీ..!
యూపీలో బీజేపీ వ్యూహం ఇదీ..!
Published Mon, Feb 6 2017 10:27 AM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM
ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ప్రచారపర్వం బాగా వేడెక్కింది. బీజేపీ అగ్రనాయకులంతా ప్రచార రంగంలోకి దూకారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాటు పెద్దనోట్ల రద్దును ప్రధాన ఆయుధాలుగా ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదం, అవినీతిపై మోదీ ప్రభుత్వం చేసిన పోరాటంగా పెద్ద నోట్ల రద్దును బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనాయకులంతా ఉత్తరప్రదేశ్ మీదే దృష్టిపెట్టారు. సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి సర్జికల్ స్ట్రైక్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయని చెబుతున్నారు. ఈ రెండు అంశాలు ప్రజల్లోకి కూడా బాగానే వెళ్లాయని పరిశీలకులు అంటున్నారు. మీరట్, అలీగఢ్ నియోజకవర్గాల్లో జరిగిన భారీ ర్యాలీలలో ప్రధాని మోదీ, మథుర, అమ్రోహాలలో అమిత్ షా, ఆగ్రాలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారపర్వాన్ని పూర్తిచేశారు. ప్రధాని మోదీ తన ఎన్నికల ర్యాలీలలో పెద్దనోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ అంశాలను ప్రస్తావించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో.. పెద్దనోట్ల రద్దుపై మొదట్లో ఉన్నంత వ్యతిరేకత తర్వాత లేదని.. ఇప్పుడా అంశం ప్రజల్లోకి బాగానే వెళ్లిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా సామాన్యులు దీన్ని బాగా స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అంచనా.
అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ రెండు అంశాలను గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయితే సర్జికల్ స్ట్రైక్స్ గురించి చాలా గట్టిగా చెబుతున్నారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరగవని తాము చెప్పలేమని కూడా ఆయన టీవీ ఇంటర్వ్యూలలో అంటున్నారు. గోవాలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా యూపీ ప్రచారపర్వంలోకి దిగుతారని, బీజేపీ నాయకులు చెబుతున్నారు. మోదీ సభలకు జనం భారీగానే వస్తున్నా, స్థానిక నాయకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మోదీ సభలను మరీ ఎక్కువగా షెడ్యూలు చేయకుండా ఆపారు. స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. దానివల్ల ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీ మేనేజర్లు అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా ప్రతి దశకు సంబంధించి మూడు నాలుగు ర్యాలీలలో మాత్రమే మోదీ పాల్గొంటారు. తొలి దశ ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో త్వరలో ఆగ్రాలో ఒక ర్యాలీ నిర్వహిస్తారు.
Advertisement
Advertisement