భారీస్థాయిలో ఓటెత్తిన జనం
భారీస్థాయిలో ఓటెత్తిన జనం
Published Sat, Feb 4 2017 7:09 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 50-60 శాతం పోలింగ్ జరిగిందన్న విషయాలే వింటూ వచ్చాం. కానీ, గోవా అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 83 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పంజాబ్‌లో సైతం 70 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. గోవాలో ఎన్నికలు సాధారణంగానే జరిగినా, పంజాబ్‌లో మాత్రం ఈవీఎంలు మొరాయించడం, వాతావరణం అనుకూలించకపోవడంతో కాస్త ఆలస్యమైంది. అయినా కూడా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 11వ తేదీన వెలువడతాయి.
గోవా, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ తుది వివరాలు తెలిసేసరికి పోలింగ్ శాతం మరికొంత పెరగొచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు ఉండటమే అందుకు కారణం. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో ఓటింగ్ బాగా జరిగింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మాల్వా బెల్టులోనే 69 ఉన్నాయి. దాంతో.. ఇక్కడ ఏ పార్టీ గాలి వీస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొత్తగా వచ్చిన ఆప్ కూడా ఇక్కడ గట్టిగా పోటీపడుతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకుంటే మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుకు ప్రజామోదం ఉన్నట్లు భావించాలి. నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్య వల్ల పేదలకు డబ్బు దొరకడం కష్టం కావడంతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా మందగించింది. కానీ నోట్ల రద్దు కష్టాలను ప్రజలు మర్చిపోయినట్లే ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలు చెప్పాయి. తుది ఫలితాలు వస్తే తప్ప అసలు విషయం ఏమిటన్నది తెలియదు.
Advertisement
Advertisement