Punjab elections
-
భజనలు చేస్తూ మోదీ.. లంగర్లో వడ్డిస్తూ రాహుల్
వారణాసి/ఢిల్లీ: పంజాబ్ ఎన్నికల సందడి అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ వారణాసిలో కనిపించింది. కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరూ గురు రవిదాస్ సంస్మరణలో మునిగితేలారు. 15వ శతాబ్దానికి చెందిన దళిత నాయకుడు గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాజకీయ నాయకులు, భక్తులతో వారణాసి కిటకిటలాడిపోయింది. రవిదాస్ అనుచరుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని అన్ని పార్టీల వారు పోటీలు పడి మరీ ప్రార్థనలు చేశారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో రవిదాస్ ఆలయాన్ని సందర్శించి మహిళా భక్తులతో కలిసి కూర్చొని భజనలు చేశారు. రవిదాస్ జన్మస్థలమైన వారణాసిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఒక ఎంపీగా తనకా అవకాశం దక్కడం అదృష్టమని మోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారణాసిలోని రవిదాస్ ఆలయంలో లంగర్ (సమూహ భోజనాలు)లో భక్తులకు భోజనాలు వడ్డించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెల్లవారుజామున 4 గంటలకే రవిదాస్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ కూడా ప్రార్థనలు చేశారు. రవిదాస్‌కి ఎందుకింత ప్రాధాన్యం ► గురు రవిదాస్ వారణాసిలోని గోవర్ధన్‌పూర్ గ్రామంలో చర్మకారుల కుటుంబంలో జన్మించారు. రవిదాసియా అనే ప్రత్యేక మతాన్ని వ్యాప్తి చేశారు. పంజాబ్‌లో ప్రముఖ డేరా సచ్చఖానంద్ బల్లాన్ రవిదాసియా మతాన్నే ఆచరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ డేరాకు 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ► చిన్నప్పట్నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఆయన సమాజంలో నెలకొన్న వర్ణ వివక్షను ప్రశ్నిస్తూ కవిత్వం రాశారు. ఆయన రాసిన కవిత్వానికి, రవిదాసులో సాహితీవేత్తకి కులాలకతీతంగా అభిమానులున్నారు. ► సిక్కు రాడికల్ సంస్థకు చెందిన కొందరు నాయకులు 2009లో వియన్నాలో గురు రవిదాస్ డేరాలపై జరిపిన దాడిలో ఒక నాయకుడు మరణించాడు. దీంతో సిక్కు మతంతో తమకు సంబంధం లేదని ఆ డేరా ప్రకటించింది. గురు గ్రంథ సాహిబ్ స్థానంలో రవిదాస్ రచించిన 200 కీర్తనలతో కూడిన అమృత్వాణిని తీసుకువచ్చారు. అదే తమకు మత గ్రంథమని ప్రకటించుకున్నారు. ► పంజాబ్ జనాభాలో 32 శాతం దళితులున్నారు. వారిలో ఎక్కువ మంది రవిదాస్ అనుచరులు కావడంతో రాజకీయ పార్టీల తలరాతలు మార్చే ఓటు బ్యాంకుగా మారారు. ► ఈ సారి పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14నే జరపాలని తొలుత ఎన్నికల సంఘం నిర్ణయించినప్పటికీ రవిదాస్ జయంతి కోసం ఎన్నికల్ని కూడా 20 తేదీకి వాయిదా వేసింది. ► పంజాబ్‌లో దళితుల ఓట్లను ఆకర్షించడానికి గతంలో బీఎస్పీ ప్రయత్నించి కొంత సఫలమైంది. అయితే ఆ పార్టీకి రామ్‌దాసియా సిక్కుల మద్దతు మాత్రమే లభించింది. ఈసారి వీరి ఓట్ల కోసం ప్రతీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వారణాసిలోని రవిదాస్ ఆలయంలో వడ్డిస్తున్న రాహుల్ -
Punjab Election 2022: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన
-
కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ..
ఛండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆదీ పార్టీ(ఆప్) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు అంటూ విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పని తేలాయని, నిజాలేంటో బయటకు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో భారతదేశాన్ని దోచుకోవడానికి ఆంగ్లేయులు ఎలాగైతే దేశానికి వచ్చారో.. ఇప్పుడు పంజాబ్‌ను దోచుకోడానికి క్రేజీవాల్‌తో సహా మరికొందరు నేతలు వస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి గురించి పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు అలాంటి వారికి ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఓటేయొద్దు.. -
చన్నీ మంత్రం ఫలించేనా?
అందరి దృష్టీ ఉత్తర ప్రదేశ్ (యూపీ), పంజాబ్‌ల మీదే నెలకొన్న వేళ... కాంగ్రెస్ పార్టీ తన సాధారణ పద్ధతికి భిన్నంగా పంజాబ్‌లో ముందుగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. రకరకాల ఊహాగానాలొస్తున్న నేపథ్యంలో మరో తడవ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ ఎట్టకేలకు ఆదివారం ప్రకటించింది. సొంత పార్టీలోనే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న మిగతా పోటీదారుల సమక్షంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ ప్రకటనతో తాంబూలాలు ఇచ్చేశారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘టీమ్ పంజాబ్ కాంగ్రెస్’ సమష్టిగా ఎన్నికల పోరాటం చేస్తుందని పైకి చెబుతున్నా, పార్టీలో ప్రకంపనలు ఆగడం లేదు. అభ్యర్థిగా చన్నీని ప్రకటించిన కాసేపటికే, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు – సీఎం కావాలని తపిస్తున్న మరో ఆశావహుడు సునీల్ జాఖడ్ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై కొడుతున్నానన్నారు. అయిదు నెలల క్రితమే సీఎం మార్పు వేళ కూడా తన పేరును పరిశీలించ లేదని అలిగిన జాఖడ్ మళ్ళీ అలకపాన్పు ఎక్కేశారు. పార్టీ ఇచ్చిన పని చేస్తానంటూనే, పంజాబ్‌లో సీఎం కాగల సత్తా ఉన్న నేతలు చాలామంది ఉన్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తన మనసులోని ఇదే బాధ సిద్ధూకు కూడా ఉంటుందంటూ, ఆయననూ గిల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, అధిష్ఠానానికి కావాల్సిందల్లా ఢిల్లీ నుంచి తాము చెప్పినట్టల్లా ఆడే బలహీన ముఖ్యమంత్రి మాత్రమేనంటూ పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ శనివారమే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆదివారం నాటి సభలో మాత్రం రాహుల్ ముందు కాస్తంత తగ్గి, తనకు కావాల్సింది పదవి కాదు, పంజాబ్ ప్రజల జీవితాల బాగు అని ప్లేటు తిప్పారు. ఆయన ఈ మాటకు కట్టుబడి ఎన్నాళ్ళు సొంత పార్టీ, సొంత సీఎంపై బాణాలు సంధించకుండా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఆ మాటకొస్తే ప్రతిక్షణం పాదరసంలా జారిపోయే సిద్ధూ కూడా చెప్పలేరు. కాకపోతే, ఈ సరిహద్దు రాష్ట్రంలోని దాదాపు ప్రధాన పార్టీలన్నిటితోనూ ఖటీఫ్ చెప్పి, కాంగ్రెస్‌కు వచ్చిన సిద్ధూకు ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు. ప్రస్తుతానికి తాను పోటీ చేస్తున్న అమృత్సర్ తూర్పు స్థానంలో గెలిచి, సమయం కోసం వేచి చూడడమే కీలకమని ఆయనకూ తెలుసు. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ అయిన సునీల్ జాఖడ్ కారులోనే చన్నీ, సిద్ధూలతో కలిసొచ్చి మరీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అందరూ కలిసే ఉన్నారని సంకేతించాలని రాహుల్ శ్రమించారు. అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా, దళిత సీఎం చన్నీని కాదని మరొకరి పేరు ప్రకటిస్తే, మొదటికే మోసం వస్తుందని ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి బాగా తెలుసు. అధికారంలో ఉన్న కాసిన్ని రాష్ట్రాలనూ కాపాడుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ఓ అగ్నిపరీక్ష. మునుపటి దామోదరం సంజీవయ్య, భోలా పాశ్వాన్, జగన్నాథ్ పహాడియా, సుశీల్ కుమార్ షిండేల వరసలో చన్నీతో దళిత బాంధవ పార్టీగా నిలవాలనీ, పంజాబ్‌లోని 31 శాతం ఉన్న దళిత ఓటర్ల మనసు గెలవాలనీ కాంగ్రెస్ ఆలోచన. ఇక, గత ఏడాది సెప్టెంబర్ 20న పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 58 ఏళ్ళ చన్నీకేమో ఇది ఊహించని అవకాశం. షెడ్యూల్డ్ కులాల వర్గం నుంచి పంజాబ్ పీఠమెక్కిన తొలి వ్యక్తిగా ఆయనకు రికారై్డతే దక్కింది. కానీ, రామ్‌దాసియా, రవిదాసియా అని పంజాబీ దళితుల్లో రెండు వర్గాలున్నాయి. తొలి వర్గానికి చెందిన చన్నీ అందరినీ ఆకట్టుకొని, అయిదు నెలలైనా కాక ముందే పార్టీని గెలిపించడం అత్యవసరమైంది. గ్రామీణ పంజాబ్‌లోని పేద కుటుంబం నుంచి పైకొచ్చిన ఈ మృదుభాషికీ కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన అసమ్మతి సహజగుణమే. మునుపటి కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్‌పై ధ్వజమెత్తినవారిలో చన్నీ కూడా ఉన్నారు. తీరా అమరీందర్ స్థానంలో తనకే సీఎం పీఠం వస్తుందని ఆయన ఊహించలేదు. గద్దెనెక్కాక ఇంటిపోరు ఆయనకూ అనుభవంలోకి వచ్చింది. ఒకే విడతలో ఫిబ్రవరి 20న జరిగే పంజాబ్ ఎన్నికల ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు మినహాయించడం లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ మల్హోత్రాకు కినుక తెప్పించింది. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన వేళ ఏర్పడ్డ భద్రతా వైఫల్యంపై మనీశ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కథనానికి దగ్గరగా ఉండడమే అందుకు కారణమని కథనం. ఆయనా ఇప్పుడు తిరుగుబాటు జెండా పట్టే పనిలో ఉన్నారు. ఈ అనైక్యతా రాగం చన్నీ మాటెలా ఉన్నా పార్టీని ఇరుకున పెడుతోంది. దీనివల్ల విజయావకాశాలు దెబ్బ తింటే చన్నీకి పెద్దగా పోయేదేమీ లేదేమో కానీ, పార్టీకే నష్టం. అనైక్యతను భరిస్తూ, ఎన్నికల్లో గెలుపు చన్నీకి సవాలే. మరోపక్క చన్నీ సన్నిహితగణంపై కేంద్ర దర్యాప్తు సంస్థల తాకిడీ మొదలైపోయింది. చన్నీ మేనల్లుణ్ణి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీటన్నిటి మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ, కొందరు రైతుల కొత్త జెండా ఎస్ఎస్ఎం, బీజేపీ– అమరీందర్ సింగ్‌ల పీఎల్సీ, అకాలీదళ్ – బీఎస్పీలతో బహుముఖ పోరులో చన్నీ విజేతగా బయట పడగలరా? దారిద్య్రం నుంచి పైకొచ్చిన చన్నీకి ప్రజల కష్టాలు తెలుసన్నారు రాహుల్. ప్రజలదే కాదు... ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ని బాధిస్తున్న అధికార దారిద్య్రం కూడా ఆయనకు తెలుసు. పంజాబ్‌లో పార్టీని మరోసారి గెలిపించి, ఆ దారిద్య్రాన్ని ఆయన పోగొట్టగలరా అన్నదే శేషప్రశ్న. -
పాటియాలా నుంచి అమరీందర్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఛండీఘర్: పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆదివారం ప్రకటించారు. మరో రెండు రోజుల్లో రెండో జాబితా కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. మొదటి జాబితాలో తొమ్మిది మంది జాట్ సిక్కులు, నలుగురు ఎస్పీ, ముగ్గురు ఓబీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. ఏమేరకు ప్రభావం చూపనుందో చూడాలి. -
కేజ్రీవాల్ క్రేజీ ఐడియా సూపర్ సక్సెస్
-
పంచముఖ పంజాబీ చిత్రం
ఎన్నికలు రెండు, మూడు నెలల్లో ఉన్నాయనగా రాజకీయాలు వేడెక్కడం మామూలు. ఎత్తులు, కొత్త పొత్తులతో రంగస్థలం రంజుగా మారడమూ సాధారణం. కానీ, పంజాబ్‌లో శరవేగంతో మారుతున్న సమీకరణాలు ఎవరూ ఊహించనివి అనే చెప్పాలి. మరోసారి గెలుపు పక్కా అనుకున్న పంజాబ్‌లో కాంగ్రెస్ కష్టాల్లో పడడం, ఆ రాష్ట్రంలో ‘ఆప్’ క్రమంగా పాగా వేస్తుండడం, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన మాజీ సీఎం అమరీందర్ సింగ్‌తో – శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్) అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం, రైతు సంఘాలు కలసి ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం – ఇవన్నీ ఫిబ్రవరి, మార్చిలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రాన్ని చకచకా మార్చేస్తున్నాయి. నిన్నటి దాకా రెండున్నర పార్టీల రణస్థలి లాంటి రాష్ట్రం ఇప్పుడు కొత్త ఆటగాళ్ళతో క్రిక్కిరిసి, ఉత్కంఠ రేపుతోంది. ఏడాది పైగా సాగిన రైతు ఉద్యమంతో కొత్త సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న తర్వాత పంజాబ్‌లో జరిగిన తాజా తొలి ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. సోమవారం వెలువడ్డ పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 2016 నుంచి ఇప్పటి దాకా మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ కార్పొరేషన్లో అధికారంలో ఉన్న బీజేపీని రెండో స్థానానికీ, అలాగే కాంగ్రెస్‌ను మూడో స్థానానికీ నెట్టేస్తూ, 35 స్థానాలకు గాను 14 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుపొందింది. 2016 కన్నా బీజేపీ స్కోరు 8 తగ్గి, 12 వార్డుల దగ్గర నిలిచింది. బీజేపీ ప్రస్తుత మేయర్ – ఇద్దరు మాజీ మేయర్లు ఓడిపోవడం, తొలిసారి అక్కడ మునిసిపల్ బరిలోకి దిగుతూనే ‘ఆప్’ పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. ఢిల్లీ ముఖ్యమంత్రి – ‘ఆప్’ సారథి అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో చెప్పాలంటే, ‘‘పంజాబ్‌లో మారుతున్న పరిస్థితులకు ఇది సూచన’’. ప్రతిసారీ కాంగ్రెస్, బీజేపీల మధ్య సాగే చండీగఢ్ ఎన్నికలు ఈసారి ‘ఆప్’ రాకతో, త్రిముఖ పోటీగా మారడం గమనార్హం. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను పంజాబ్ అంతటికీ బారోమీటర్ అనలేం. కానీ, ఒక్క చండీగఢ్‌లోనే కాదు... రాష్ట్రం మొత్తం మీద కొత్త రాజకీయ ఆటగాళ్ళు పెరిగారు. కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ, కేంద్ర బీజేపీ సర్కారుపై పోరాడిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం)లో భాగమైన 22 రైతు సంఘాలు కలసి తాజాగా ‘సంయుక్త సమాజ్ మోర్చా’ (ఎస్ఎస్ఎం) పేరిట ఓ రాజకీయ పార్టీ పెట్టాయి. సీనియర్ రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ కొత్త రాజకీయ కూటమి తాలూకు ముఖచిత్రం. పంజాబ్‌లోని 117 స్థానాలకూ పోటీ చేస్తామని ఈ రైతు సంఘాల పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కానీ, కొన్ని రైతు సంఘాల ఈ రాజకీయ రంగ ప్రవేశాన్ని సాక్షాత్తూ వాటన్నిటికీ గొడుగు సంస్థ లాంటి ఎస్కేఎం వ్యతిరేకించింది. ప్రజా ఉద్యమానికి పరిమితులున్నా, అలా కొనసాగినప్పుడు జనంలో ఉండే గౌరవం, ప్రతిష్ఠ వేరు. పార్టీ పెట్టేసరికి ఉద్యమాన్నీ రాజకీయ దృష్టితోనే చూస్తారనేది కొట్టిపారేయలేం. మరి, ఉద్యమం ద్వారా రైతులను ఏకం చేయగలిగిన సంఘాలకు రేపు ఎన్నికలలో ఓట్లు రాలతాయా అన్నది చెప్పలేం. ఏడెనిమిది నెలల క్రితం పంజాబ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొంత అయోమయంలో పడింది. పంజాబ్ పీసీసీ సారథిగా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను బరిలోకి దింపి, సీఎం స్థానంలోని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పొమ్మనకుండా పొగబెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వమే! తీరా అమరీందర్ ఇప్పుడు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంత కుంపటి పెట్టుకొని, బీజేపీతో కలసి కాంగ్రెస్‌ను మట్టి కరిపించే పనిలోకి సీరియస్‌గా దిగారు. దళిత సిక్కు చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం పీఠమెక్కించి, ఓటర్ల కులసమీకరణాల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారుతుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. మరోపక్క సొంత ప్రభుత్వం పైనే విమర్శల బ్యాట్ జళిపిస్తున్న సిద్ధూ ఆ పార్టీకి చెప్పుకోలేని తలనొప్పిగా తయారయ్యారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలన్నిటిలో జరిగిన తాజా ‘ఔట్లుక్ – హన్సా రిసెర్చ్’ పంజాబ్ మనోగతం సర్వేలో సీఎం అభ్యర్థిగా మంచి మద్దతే లభించడం కాంగ్రెస్‌కు కాస్తంత ఊరట. చతికిలబడ్డ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం – పంజాబ్ బరిలో కీలక అంశాలు కానున్నాయని సర్వేల మాట. అమరీందర్, బీజేపీ నేతలేమో జాతీయ భద్రతను అస్త్రంగా ఎంచు కుంటారు. అందుకే, ఇటీవల జరిగిన పవిత్ర స్థలాల అపవిత్ర యత్నం, నిందితుల్ని కొట్టి చంపడం, బాంబు పేలుడు ఘటనల్లో కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. తగినంత మంది అభ్యర్థులైనా లేని బీజేపీ ఇప్పటికే జాట్ సిక్కు రైతుల కోపానికి గురై, ఎలాగోలా ఉనికి నిలుపు కోవాలని తపిస్తోంది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తమలోకి కలుపుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇక, సర్వం తానే అయిన కేజ్రీవాల్ ప్రచారం చూసి, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలనకు పంజాబీలు సిద్ధపడతారా అన్నదీ ప్రశ్నే. ఏమైనా, కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, బీజేపీ, రైతు పార్టీల పంచముఖ పోరులో ఏ ఒక్క పార్టీకో సొంతంగా మెజారిటీ వస్తుందా అన్నది ఇప్పటికైతే సందేహమే. ముఖచిత్రం మారుతోంది. అనిశ్చితి పెరుగుతోంది. ఓ ‘ఆప్’ ఎమ్మెల్యే అన్నట్టు, చండీగఢ్ మునిసిపల్ ఎన్నికలు రానున్న అసెంబ్లీ పోరుకు ట్రైలర్. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే, సినిమా మరింత ఆసక్తికరంగా ఉండనుంది. దాని కోసం మార్చిలో రిజల్ట్స్ రిలీజ్ దాకా వేచిచూడక తప్పదు. -
నేను బీజేపీలో చేరడం లేదు..టీమిండియా క్రికెటర్
Harbhajan Singh Not joining In BJP: త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో తనపై ప్రచారంలో ఉన్న వార్తలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు సామాజిక మధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటిని ప్రజలు పట్టించుకోరాదని కోరాడు. కాగా, భజ్జీతో పాటు టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్‌పై ఇలాంటి ప్రచారమే జరుగుతుంది. ఈ విషయమై యువీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా భజ్జీపై ఇలాంటి ప్రచారమే జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో భజ్జీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, హర్భజన్ త్వరలోనే అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి ఐపీఎల్లో కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి . చదవండి: Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడు..! -
రాహుల్ గాంధీతో పీకే కీలక భేటీ..
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసంలో మంగళవారం వీరు భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సమాచారం. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్-నవజోత్ సింగ్ సిద్ధుల మధ్య సయోధ్య గురించి ఈ భేటీలో చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, హరీష్ రావత్ హాజరయ్యారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రియాంక గాంధీ మంగళవారం లక్నోలో పర్యటించాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో పీకేతో భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. మోదీకి ధీటైన, బలమైన ప్రధాని అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ పలుమార్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత శరద్ పవార్ నివాసంలో ఎనిమిది మంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశం అయ్యారు. మిషన్ 2024 లక్ష్యంగా మూడో కూటమి ఏర్పాటు కోసమే వీరు భేటీ అయినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుండానే సమావేశం కొనసాగింది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా మూడో కూటమి ఏర్పాటు సాధ్యం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్-పీకేల భేటీపై సర్వత్రా ఆసక్తి నేలకొంది. ఈ సమావేశంలో వీరు థర్డ్ ఫ్రంట్‌పై చర్చించనున్నారా లేక వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల గురించి మాత్రమే చర్చిస్తున్నారా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. -
పంజాబ్ ‘పవర్’ పాలిటిక్స్
ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రోజుకు 14 గంటలు గృహవిద్యుత్ కోత. ఈ శుక్రవారం నుంచి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు. ఆఫీసుల్లో ఏసీల వాడకంపై నిషేధం విధిస్తూ సాక్షాత్తూ ప్రభుత్వ ఆదేశాలు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలంటూ, వీలైనంత ఆదా చేయాలంటూ విజ్ఞప్తులు. ఉష్ణోగ్రతలు పెరిగి, వరి నాట్లు జోరుగా సాగుతున్న వేళ పొలాల్లో కరెంట్ లేదు. ఇంట్లో చమటలు కక్కుతున్నా కనీసం ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదు. చివరకు వ్యవసాయానికి కీలకమైన ఈ సీజన్లో పొలాలకూ, ఇళ్ళకూ కరెంట్ సరఫరాను మళ్ళించడం కోసం అక్కడి రాష్ట్ర విద్యుత్ సంస్థ (పీఎస్‌పీసీఎల్) విద్యుత్తును భారీగా వినియోగించే పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పూర్తిగా తప్పనిసరి విద్యుత్ కోత విధించింది. ఇదీ – పంజాబ్‌లో ఇప్పుడు నెలకొన్న స్థితి. మునుపెన్నడూ అక్కడ చూడని విద్యుత్ సంక్షోభ పరిస్థితి. ‘పంజాబ్ పరిస్థితి దిగజారిపోయింది’ అని ప్రతిపక్ష ‘శిరోమణి అకాలీదళ్’ (ఎస్ఏడీ) వీధికెక్కి నిరసనలు చేస్తున్నది అందుకే! పనిలో పనిగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో పాగా వేసేందుకు స్వరం పెంచారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేత– మాజీ క్రికెటర్ నవ జోత్ సింగ్ సిద్ధూ సైతం ‘సరైన దిశలో చర్యలు చేపడితే, పవర్ కట్ అవసరమే లేదు’ అని సవాలక్ష సూచనలిస్తూ, స్వపక్ష సర్కారుపైనే బౌన్సర్లు విసురుతున్నారు. వెరసి, కొద్దినెలల్లో పంజాబ్ ఎన్నికలు జరగాల్సిన వేళ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నోటా వినిపిస్తున్న మాట ఒకటే – ‘పవర్’! ఇటు ఎలక్ట్రికల్ పవర్, అటు పొలిటికల్ పవర్!! రాజకీయాల్లో కావాల్సినంత అనుభవం ఉన్నప్పటికీ, ఈ ముప్పేటదాడిలో పంజాబ్ పాలకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చమటలు కక్కుతున్నారు. అన్నవస్త్రాల లాగానే అన్నిటికీ విద్యుత్ అత్యవసరమైన కాలమిది. గద్దెనెక్కాలనుకొనే పెద్దలెవ రైనా సరే ఇంటికీ, పొలాలకూ, పరిశ్రమలకూ నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేస్తామనేదీ అందుకే! విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ సరఫరా అనేక సందర్భాలలో అన్ని రాష్ట్రాలలో ఓ ఎన్నికల అజెండా. రానున్న పంజాబ్ ఎన్నికలలోనూ అదే కీలక అంశం కానుందని ఈపాటికే అందరికీ అర్థమై పోయింది. అత్యంత సారవంతమైన భూమితో, భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన వ్యవసాయ ఆధారిత పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంకు రైతులే! కానీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృ త్వంలోని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగా వ్యవసాయానికి రోజూ ఎనిమిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది. పెరిగిన ఉష్ణోగ్రతలు, వ్యవసాయ సీజన్ కావడంతో పంజాబ్‌లో విద్యుత్ గిరాకీ ఒక్కసారిగా 14,500 మెగావాట్లకు చేరింది. సరఫ రాకూ, గిరాకీకి మధ్య 1500 మెగావాట్ల లోటు తలెత్తింది. అందువల్లే, ఇప్పుడింత విద్యుత్ కోత. పంజాబ్ ప్రభుత్వానికి సొంత విద్యుదుత్పాదక కేంద్రాలున్నా, అవి చాలక ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ప్రైవేటులో కొన్న పవర్ వల్ల సహజంగానే అక్కడి ప్రజలపై ఆ భారం పడుతోంది. నెలవారీ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఇక, ఏటా రాష్ట్రంలో విద్యుత్ గిరాకీ సగటున 500 మెగావాట్ల మేర పెరుగుతుంటుంది. లాక్డౌన్ వల్ల నిరుడు తగ్గినా, ఈసారి మళ్ళీ గిరాకీ ఉంటుందని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో, పంజాబ్ ప్రజానీకం కరెంట్ కోసం కటకటలాడు తోంది. ఊహించని విపత్తులో పడి సర్కారు విలవిలలాడుతోంది. ఒకరకంగా ఇది సర్కారీ స్వయంకృతాపరాధమే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వ అజమాయిషీలోని భటిండా సౌర విద్యుత్ కేంద్రాన్నీ, అలాగే రోపార్‌లోని మరో సౌర విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లనూ మూసేసింది. అలా 880 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తగ్గిపోయింది. ఓ లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ చేయకపోగా, అనేక కొత్త యూనిట్ ప్రతిపాదనల్ని కూడా సర్కారు తోసిపుచ్చింది. పోనీ, బయట నుంచి కొందామంటే, రాష్ట్ర విద్యుత్ సంస్థ వద్ద నిధులు లేవు. వ్యవసాయ సబ్సిడీలు, ఆఫీసు కరెంట్ బిల్లులు కలిపి ఆ సంస్థకు రూ. 7 వేల కోట్లు ప్రభుత్వమే బాకీ ఉంది. ఏటా 10 వేల కోట్ల పైగా సబ్సిడీ భారంతో పాటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని లోపాలు, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడంలో అశ్రద్ధ – ఇవన్నీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందమయ్యాయి. వాటిని అరికట్టే రాజకీయ సంకల్పం కొరవడింది. తప్పు మీద తప్పు చేసిన పంజాబ్ సీఎం అమరీందర్‌కు సొంత పార్టీలోనూ శాంతి లేదు. ఆయన, çస్వపక్షంలో విపక్షమైన సిద్ధూ – ఇద్దరూ పాటియాలా జిల్లాకు చెందినవారే. ఇద్దరూ జాట్ సిక్కులే. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సిద్ధూ మూన్నాళ్ళ క్రితం ప్రియాంక, రాహుల్‌లను కలుసుకొన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందట. అయినా సరే, సొంత పార్టీ ముఖ్యమంత్రిపై సిద్ధూ బ్యాటింగ్ దాడి కొనసాగిస్తుండడం గమనార్హం. ఇదే అవకాశంగా కేజ్రీవాల్ ఏకంగా దేశం మొత్తంలో పంజాబ్‌లోనే విద్యుత్ ఛార్జీలు ఎక్కువని వాస్తవ విరుద్ధంగా విమర్శించారు. అధికారంలోకొస్తే ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ఉదారంగా హామీ ఇచ్చారు. అమరీందర్ సైతం ఈ మధ్య 70 లక్షల మంది గృహ వినియోగదారులకు లబ్ధి కలిగేలా పవర్ ట్యారిఫ్ కూడా తగ్గించారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉన్న ఈ మాజీ సైనికాధికారికి రానున్న ఎన్నికల యుద్ధం నల్లేరుపై బండి నడక కాదు. ఎన్నికలలో కరెంట్ షాక్ కొట్టకముందే ఆయన, ఆయన పార్టీవారు కళ్ళు తెరుస్తారా అన్నది ప్రశ్న. -
ఎన్నికల పండితులు ఇప్పుడేమంటారు?
న్యూఢిల్లీ: ఎప్పుడు ఎన్నికలు జరిగినా రంగంలోకి దిగే విశ్లేషకులు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మూడొందల పైన సీట్లు సాధిస్తుందని అంచనా వేయలేకపోయారు. ఎగ్జిట్ పోల్స్‌లో టైమ్స్‌నౌ–వీఎం ఆర్ ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి 190–210సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఇండియా న్యూస్–ఎంఆర్సీ 185 సీట్లు, ఏబీపీ–లోక్‌నీతి164–176 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే ఎన్నికల్లో మాత్రం 403 స్థానాలకు 320 పైచీలుకు సీట్లను కమలం పార్టీ గెలుచుకుని విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతుందన్న అంచనాలు తప్పాయి. ఇండియాటుడే–యాక్సిస్ కాంగ్రెస్ 62–71 స్థానాల్లో గెలుపొందుతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు 42–51 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టీవీ–సీఓటర్ సంస్థలు ఆప్‌కు 59–67, కాంగ్రెస్‌కు 41–49 సీట్లు వస్తాయని వెల్లడించింది. కానీ కాంగ్రెస్ పంజాబ్‌లో 70 పైచీలుకు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రం విశ్లేషకుల అంచనాలు నిజమయ్యాయి. ఇండియాటుడే, న్యూస్24 చానెళ్లు బీజేపీ 46–53, 53 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. అందుకు అనుగుణంగానే మొత్తం 70 స్థానాల్లో 57 చోట్ల బీజేపీ జయకేతనం ఎగురవేసింది. -
సీఎం ఇంటి నుంచి ’చీపుర్లు’ తరలింపు
న్యూఢిల్లీ : ఢిల్లీలో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఊపుతో పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే మిగిలింది. గోవాలో బోణీ కొట్టకపోగా, పంజాబ్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆప్... ఆశించినట్లుగా ఫలితాలు రాకపోవడంతో ఢిల్లీలోని ఆప్ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. మరోవైపు ఫలితాలు తారుమారు కావడంతో ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉదయం ఉంచిన ఆప్ ఎన్నికల గుర్తు ‘చీపుర్లు’ను పార్టీ శ్రేణులు మధ్యాహ్నం వాటిని అక్కడ నుంచి తరలిస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇక సత్తా చాటాలని ఉవ్విళ్లూరిన ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబీ ఓటర్లు తగు రీతిన గౌరవించారనే చెప్పాలి. ఏళ్లుగా నమ్ముకున్న అకాలీదళ్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ స్థానాలు కట్టబెట్టారు. ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ జలాలాబాద్‌లో ఓటమి పాలయ్యారు. అక్కడి అకాలీదళ్ అధ్యక్షుడు, ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను ఆదరించారు. -
పంజాబ్ కెప్టెన్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం పంజాజ్ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అభినందనలు తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ విజయంపై స్పందించిన ప్రధాని ఈ సందర్భంగా అమరీందర్ సింగ్‌కు అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. అలాగే ఇవాళ అమరీందర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా మోదీ బర్త్‌డే విషెస్ తెలిపారు. మరోవైపు వరుస ఓటములతో దిగాలుపడిన కాంగ్రెస్‌కు పంజాజ్ ఓటర్లు చేయూత అందించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం, పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ విభేదాలు పక్కనబెట్టి అందర్ని కలుపుకుపోవడం, గెలవాలన్న తపన పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించింది. కాగా, రూలింగ్ పార్టీ అకాలీదళ్-బీజేపీ కూటమికి నిరాశే మిగిలింది. అయితే తన 75వ పుట్టిన రోజు ఇంత ఘనంగా జరుపుకుంటానని బహుశా అమరీందర్ సింగ్ కూడా ఊహించి ఉండరు. గెలుపుపై ధీమా ఉన్నా పక్కలో బల్లెంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ పొడుస్తుందోననే భయం ఆయనలో ఉండకపోలేదు. కాని పంజాబీ ఓటర్లు మాత్రం పటియాల మహారాజుకు ఈ దఫా అధికారం కట్టబెట్టారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమిని పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పవనాలు జోరుగా వీచినా ఆ ప్రభావం సర్దార్జీల నేలపై కనిపించలేదు. గెలిచిన తర్వాత అమరీందర్ సింగ్‌లో ఆ ధీమా కనిపించింది. -
2600 కిలోల డ్రగ్స్, 12.43 లక్షల లీటర్ల మద్యం
సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం, చీరలు, కుంకుమ భరిణెలు ఇలాంటివి పంచిపెట్టడం సర్వసాధారణం. అయితే, పంజాబ్‌లో మాత్రం వీటన్నింటికి తోడు డ్రగ్స్‌ను కూడా విపరీతంగా పంచేశారు. పాక్ సరిహద్దుల్లో ఉన్న ఈ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా యువత వీటికి బానిసలు అవుతున్నారంటూ ఇటీవలి కాలంలో బాగా చర్చ జరుగుతోంది. ఇదే అంశం ఆధారంగా 'ఉడ్తా పంజాబ్' సినిమా కూడా వచ్చింది. తాజా ఎన్నికల్లో కూడా డ్రగ్స్ పంపకాలు పెద్ద ఎత్తునే జరిగాయి. ఆ ఒక్క రాష్ట్రంలోనే తాము 2600 కిలోల డ్రగ్రస్, 12.43 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 14న ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వీటిని తాము స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా చెప్పారు. వాటితో పాటురూ. 58.02 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే.. పట్టుబడినవే ఈ మొత్తంలో ఉంటే, ఇక అప్పటికే పంచేసినవి ఇంకెంత ఉంటాయోనని విమర్శకులు అంటున్నారు. వీటితో పాటు 164 కిలోల బంగారం, 26.145 కిలోల వెండిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. గోవాలో కూడా.. గోవా కూడా తక్కువ ఏమీ తినలేదు. ఇక్కడ ఆరు కిలోల డ్రగ్రస్, 75వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా చెప్పారు. వాటితో పాటు 58.19 కిలోల బంగారు, వెండి ఆభరణాలు, 175 రాడో రిస్ట్ వాచీలు కూడా స్వాధీనం అయ్యాయి. -
భారీస్థాయిలో ఓటెత్తిన జనం
ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 50-60 శాతం పోలింగ్ జరిగిందన్న విషయాలే వింటూ వచ్చాం. కానీ, గోవా అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 83 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పంజాబ్‌లో సైతం 70 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. గోవాలో ఎన్నికలు సాధారణంగానే జరిగినా, పంజాబ్‌లో మాత్రం ఈవీఎంలు మొరాయించడం, వాతావరణం అనుకూలించకపోవడంతో కాస్త ఆలస్యమైంది. అయినా కూడా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నవారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 11వ తేదీన వెలువడతాయి. గోవా, పంజాబ్ రెండు రాష్ట్రాల్లోనూ తుది వివరాలు తెలిసేసరికి పోలింగ్ శాతం మరికొంత పెరగొచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు ఉండటమే అందుకు కారణం. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో ఓటింగ్ బాగా జరిగింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మాల్వా బెల్టులోనే 69 ఉన్నాయి. దాంతో.. ఇక్కడ ఏ పార్టీ గాలి వీస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు కొత్తగా వచ్చిన ఆప్ కూడా ఇక్కడ గట్టిగా పోటీపడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకుంటే మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుకు ప్రజామోదం ఉన్నట్లు భావించాలి. నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నట్లు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్య వల్ల పేదలకు డబ్బు దొరకడం కష్టం కావడంతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా మందగించింది. కానీ నోట్ల రద్దు కష్టాలను ప్రజలు మర్చిపోయినట్లే ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలు చెప్పాయి. తుది ఫలితాలు వస్తే తప్ప అసలు విషయం ఏమిటన్నది తెలియదు. -
విజయాన్ని రాహుల్‌కు కానుకగా ఇస్తాం!
-
‘ఆ పార్టీ గెలుపు.. మీడియా సృష్టే’
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ క్రమంగా పుంజుకుంటోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 33శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్‌సింగ్ ’సాక్షి’తో మాట్లాడుతూ.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుస్తుందని వస్తున్న అంచనాలను ఆయన కొట్టిపారేశారు. ఆప్ గెలుపు మీడియా సృష్టేనని, ఆ పార్టీ గెలువబోదని పేర్కొన్నారు. మల్యా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని పేర్కొన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళి కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా కనిపిస్తున్నదని చెప్పారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార అకాలీదళ్ కూటమి- కాంగ్రెస్-ఆప్ మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. -
విజయాన్ని రాహుల్‌కు కానుకగా ఇస్తాం!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌సర్‌లో ఓటువేసేందుకు భార్య నవజ్యోత్ కౌర్‌తో కలిసి వచ్చిన క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్‌లో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి.. ఆ విజయాన్ని రాహుల్‌గాంధీకి కానుకగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది ధర్మయుద్ధమని, ఈ ధర్మయుద్ధంలో తామే విజయం సాధిస్తామని ఆయన చెప్పారు. పంజాబ్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని, ఇక్కడి నుంచి కాంగ్రెస్ విజయపరంపర మొదలవుతుందని ఆయన విలేకరులతో అన్నారు. కాగా, పంజాబ్‌లో కాస్తా మందకొడిగా పోలింగ్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఉదయం 11.30 గంటల వరకు 14శాతం పోలింగ్ నమోదైంది. -
భర్త కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే..
-
భర్త కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే..
భర్త కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే భార్యకు చేదు అనుభవం ఎదురైంది. తన భర్త, కాంగ్రెస్ అభ్యర్థి కమల్జీత్ సింగ్ కర్వల్ తరఫున ఇంటింటి ప్రచారానికి వెళ్లిన కోమల్‌ప్రీత్ కౌర్ మీద మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు దాడి చేశారు. దుర్గి పట్టణంలోని బసంత్ విహార్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కోమల్ప్రీత్కు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. లోక్ ఇన్సాఫ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులే ఈ దాడి చేసినట్లు అతమ్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కమల్జీత్ సింగ్ కర్వల్ ఆరోపించారు. తాను తన వదిన, మరికొందరు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా వాళ్లొచ్చి దాడి చేశారని కోమల్‌ప్రీత్ చెప్పారు. ఉదయం 9.30 గంటలకు ఆమె తన కారులో కూర్చుని ఉండగా ఇద్దరు యువకులు వచ్చి కారును వెనక నుంచి ఢీకొని, పదునైన ఆయుధంతో దాడిచేసి, అక్కడినుంచి పారిపోయారు. కాసేపటికి అక్కడకు వచ్చిన కమల్జీత్ సింగ్ పోలీసులకు విషయం చెప్పారు. దుండగులు వచ్చిన మోటార్ సైకిల్ మీద సిమర్జీత్ సింగ్ బైన్స్ ఎన్నికల గుర్తు అయిన పోస్టాఫీసు ఉందని, దాని తాను చూశానని కోమల్‌ప్రీత్ చెప్పారు. ఆయన ఆప్-ఎల్ఐపీ పార్టీల సంయుక్త అభ్యర్థి. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ప్రత్యర్థులు ఈ దాడి చేశారన్నారు. పోలీసులు సమీపంలోని బేకరీలో ఉన్న సీసీటీవీ కెమెరా నుంచి ఫుటేజి తీసుకుని పరిశీలించగా, మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు కారు వెనక అద్దం పగటగొట్టి పారిపోయినట్లు అందులో రికార్డయింది. -
దాడిచేసి, వేధిస్తున్నారు.. లొంగేది లేదు: మోదీ
తనపై గత మూడు నెలలుగా పదే పదే దాడి చేస్తూ, వేధిస్తున్నారని, అయినా తాను మాత్రం లొంగేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలంధర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌తో కలిసి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న అకాలీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అయినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు మోదీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగానే జలంధర్ సభలో ఆయన మాట్లాడారు. ఒక్కసారి 2013-14 నాటి పత్రికలు చూస్తే ఎంత డబ్బు స్కాముల్లో పోయిందో, ఇప్పటి పత్రికలు చూస్తే ఎంత డబ్బు వెనక్కి వస్తోందో తెలుస్తుందని మోదీ చెప్పారు. 70 ఏళ్లుగా తాము దోచుకున్న సంపద మొత్తం కరిగిపోతుంటే కొంతమంది వ్యక్తులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. గత 40 ఏళ్లుగా నానుతున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను తాము అమలుచేశామని చెప్పారు. సింధూ జలాల్లో మనకు న్యాయంగా రావాల్సిన నీటిని తీసుకుని, దాన్ని పంజాబ్‌కు ఇస్తామన్నారు. గత 70 ఏళ్లుగా మనం విధ్వంస రాజకీయాలు చూస్తున్నామని, ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేయాలనుకుంటే అభివృద్ధి చేసి తీరాల్సిందేనని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి బాదల్ తన చేయి పట్టుకుని మార్గదర్శిగా ఉన్నారని, తాను ప్రధాని అయిన తర్వాత తనను కలిసినప్పుడల్లా రైతుల సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని చెప్పారు. ఇన్నేళ్ల ప్రజాజీవితంలో ఆయన ఒక్కసారి కూడా పార్టీ గానీ, సిద్ధాంతాలు గానీ మార్చుకోలేదని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమాజ్‌వాదీని విమర్శించేదని, ఓటర్లు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినా, పంజాబ్ ప్రజలు మాత్రం బాదల్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని మోదీ అన్నారు. కొందరు పంజాబ్ పేరు చెడగొట్టాలనుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా పంజాబ్ పేరు చెడగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారని అన్నారు. అలంటివాళ్లను శిక్షించి, మరోసారి అలా చేయకుండా చూడాలని కోరారు. పంజాబ్ కేవలం ఒక రాష్ట్రం కాదని, దేశం మొత్తంలో పంజాబ్ తిండి తినని పౌరుడు ఒక్కరు కూడా ఉండరని అన్నారు. ఇక్కడి వారు సాధువులు, ధైర్యవంతులు, త్యాగధనులని ప్రశంసించారు. -
మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే: రాహుల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వం పూర్తిస్థాయిలో వేడెక్కింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంజాబ్‌లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఇన్నాళ్లుగా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయమై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఆయన తెరదించారు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని కుండ బద్దలు కొట్టారు. రైతులు బాదల్ (మేఘాలు) చూస్తే సంతోషపడతారని, కానీ పంజాబ్‌లో మాత్రం బాదల్ (సీఎం) నీళ్లు ఇవ్వడం లేదని చమత్కరించారు. 'అంతా నీదే' అని గురునానక్ అంటారు గానీ, అకాలీదళ్ మాత్రం 'అంతా నాదే' అంటుందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల క్రితం తాను వచ్చినప్పుడు పంజాబ్ యువతలో 70 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారని చెప్పానని, అప్పట్లో బాదల్ కుటుంబ సభ్యులు తనను వెక్కిరించారని, కానీ ఇప్పుడు మొత్తం పంజాబ్ అంతా తాను చెప్పిందే చెబుతోందని రాహుల్ అన్నారు. ప్రతి పరిశ్రమలోను, వ్యాపారంలోను ఒక్క కుటుంబ ఏకస్వామ్యం నడుస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో ఎక్కడకు వెళ్లాలన్నా బాదల్ బస్సులలోనే వెళ్లాల్సి ఉంటుందని విమర్శించారు. తానిక్కడ కేవలం రెండు మూడు విషయాలు మాత్రమే చెబుతానని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తాము ఒక చట్టం చేస్తామని.. ఆ తర్వాత కనీసం డ్రగ్స్ అన్న ఆలోచన వచ్చినా వణుకు పుడుతుందని చెప్పారు. పంజాబ్‌ను ఎవరు గాయపరిచారో వాళ్లను తాము జైల్లో వేసి చూపిస్తామని, పంజాబ్ కోసమే తమ పోరాటం ఉంటుందని రాహుల్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెబుతారని, అలాంటప్పుడు ఆయన అకాలీదళ్‌ను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పంజాబ్‌ను అకాలీదళ్ సర్వనాశనం చేసిందని చెప్పారు. -
‘నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు’
అమృత్ సర్: ‘పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నాకు సంబంధం లేదు. దీనికి నన్ను శిక్షించొద్ద’ని బీజేపీకి చెందిన పంజాబ్ మంత్రి అనిల్ జోషి పేర్కొన్నారు. అమృత్ సర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన మరోసారి బరిలో నిలిచారు. ఎవరో తీసుకున్న నిర్ణయానికి తనను శిక్షించొద్దని ఓటర్లకు జోషి విజ్ఞప్తి చేస్తున్నారు. ‘నా పదవీ కాలం ముగిసింది. ఈ ఒక్క నెల మీరందరూ కష్టపడాలి. ఓటర్ల దగ్గరకు వెళ్లి నాకు ఓటు వేయాలని కోరండి. పాత నోట్ల రద్దు నిర్ణయంతో అంతా తల్లకిందులయిందని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. దీనిపై ఇప్పుడేమీ చేయలేమని సముదాయించండి. ఇందులో అనిల్ జోషి పాత్ర లేదని చెప్పండి. జోషి ఎప్పుడూ మీ తరపున పోరాడతాడని ప్రజలకు తెలపండి. ఓటర్లతో మాట్లాడేటప్పుడు జాగ్తత్తగా వ్యవహరించాల’ని తన మద్దతుదారులకు సూచించారు. డీమోనిటైజేషన్ ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని తనను తాను ‘వికాస పురుషుడు’గా ప్రకటించుకున్న జోషి పేర్కొన్నారు. అకాలీదల్ ప్రభుత్వంతో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తున్న జోషి తన ప్రచారంలో ఎక్కడా సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పేరు ప్రస్తావించడం లేదు. -
ఆప్‌కు చందాలు బంద్.. ఎన్నారై డాక్టర్ ఉద్యమం
పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీరాలు పలికిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదిలోనే చుక్కెదురైంది. అమెరికా, కెనడా దేశాల నుంచి వస్తున్న విరాళాలను పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ ఎన్నారై వాలంటీర్లు ఆరోపించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు ఇవ్వొద్దంటూ ఓ ఎన్నారై డాక్టర్ ఏకంగా ఓ చిన్నపాటి ఉద్యమమే ప్రారంభించారు. దానికి 'చందా బంద్ సత్యాగ్రహం' అని డాక్టర్ మునీష్ రైజాదా పేరుపెట్టారు. చికాగోలో ప్రముఖ పిల్లల వైద్యుడైన ఆయన.. చండీగఢ్ వచ్చి మరీ ఈ ప్రచారం ప్రారంభించారు. విరాళాలను దాచిపెట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, గుర్ప్రీత్ ఘుగ్గి, హిమ్మత్ సింగ్ షేర్గిల్ లాంటి సీనియర్ నాయకులపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నారైల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలుచేస్తోందని, కానీ వెబ్సైట్లో మాత్రం వాళ్ల పేర్లు రాయడం లేదని డాక్టర్ రైజాదా ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాల విషయంలో పారదర్శకత పాటించడం లేదని, ఇందులో ఏదో లొసుగు ఉందని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టేందుకు తాను స్వయంగా 8-10 లక్షలు విరాళం ఇచ్చానని, ఇతరులతో కూడా చాలా ఇప్పించానని, కానీ ఆ డబ్బు ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు చేరలేదని చెప్పారు. ఆ డబ్బును పార్టీ నాయకులే కొట్టేసి ఉంటారని, దాంతో అసలు విరాళాలు సేకరించిన ఉద్దేశమే నెరవేరలేదని ఆయన అన్నారు. -
యూపీలో బీజేపీ కాదు.. ఆ పార్టీకి మెజారిటీ?
భిన్నమైన ఫలితాలను ప్రకటించిన ఓపినియన్ పోల్స్ బీజేపీకి ఇండియా టుడే సర్వే.. ఎస్పీకి ఏబీపీ న్యూస్ సర్వే మెజారిటీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు నిట్టనిలువునా చీలిపోయాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని పేర్కొంది. ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్ డిసెంబర్లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. ఇక ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఎస్పీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్‌కు 13-9 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఇక పంజాబ్ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు. ఏబీపీ న్యూస్-లోక్‌నీత్-సీఎస్డీఎస్ సర్వే పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్ సర్వే మాత్రం కాంగ్రెస్-ఆప్ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్‌లోని 70 స్థానాలలో బీజేపీ 35-45 స్థానాలతో అధికారంలోకి రావొచ్చునని, అధికార కాంగ్రెస్‌కు 22-30 సీట్లు వస్తాయని పేర్కొంది. -
దమ్ముంటే నాపై పోటీ చేయ్: సీఎంకు సవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దమ్ముంటే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ పీసీసీ చీఫ్ అయిన అమరిందర్ సింగ్ ప్రస్తుత ఎన్నికల్లో హస్తానికి పెద్దదిక్కుగా ఉండి.. ప్రచార బాధ్యతలను మోస్తున్నారు. అమరిందర్ లక్ష్యంగా అంతకుముందు కేజ్రీవాల్ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో బలమైన నేతగా పేరొందిన అమరిందర్.. సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్, ఆయన సోదరుడు బిక్రం మజిథియా బాదల్ వంటి కీలక నేతలపై పోటీకి దిగుతున్నారా? లేక సురక్షితమైన స్థానం నుంచి నిలబడాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. కేజ్రీవాల్ ట్వీట్లపై అమరిందర్ ఘాటుగా స్పందించారు. బాదల్ యుగం పంజాబ్‌లో ఎప్పుడో ముగిసిపోయిందని, ఆప్ అధినేత కేజ్రీవాల్ దమ్ముంటే పంజాబ్‌లో ఎక్కడ పోటీచేస్తున్నారో చెప్పాలని, అక్కడ తాను పోటీ సిద్దమని స్పష్టం చేశారు. అంతకుముందు అమరిందర్ మాట్లాడుతూ బాదల్ కుటుంబంతో కేజ్రీవాల్ కుమ్మక్కు అయ్యారని, అందుకే లాంబింగ్ నియోజకవర్గంలో సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు వ్యతిరేకంగా బలహీనమైన అభ్యర్థి (జర్నైల్‌సింగ్)ను కేజ్రీవాల్ ప్రకటించారని మండిపడ్డారు. -
ఆత్మ లేకుండా దేహం ఉంటుందా?
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ కండువాతో కౌర్ కు స్వాగతం పలికారు. మాజీ ఒలింపియన్, అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కౌర్ భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కూడా గాలం వేస్తున్నారా అని ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ ను అడగ్గా... కౌర్ ఇక్కడ ఉంటే, సిద్ధూ ఆమె వెనుక నిలబడకుండా ఉండగలరా అని ఎదురు ప్రశ్నించారు. అమరీందర్ నుంచి కౌర్ మైకు తీసుకుని ‘మా దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే. ఆత్మ లేకుండా దేహం ఉండలేదు. సిద్ధూ కూడా కాంగ్రెస్ లో చేరతార’ని సమాధానం ఇచ్చారు. ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్–ఎ–పంజాబ్ పార్టీని స్థాపించడం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సిద్ధూ ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. -
మాజీ క్రికెటర్ సిద్ధూకు కాంగ్రెస్ భారీ ఆఫర్
జలంధర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆవాజ్-ఏ-పంజాబ్ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు కాంగ్రెస్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందన్న వార్త అక్కడ సంచలనమైంది. సిద్దూ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలిపితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం ఈ విషయంపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ లో చేరాలని వచ్చిన ఆఫర్ ను సిద్ధూ తిరస్కరించగా, తాజాగా డిప్యూటీ సీఎం పోస్ట్ అంటూ ఆయనకు మళ్లీ ఆఫర్ వచ్చింది. సిద్ధూ తమ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు ఏకంగా ఆయన నెలకొల్పిన ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా అమరిందర్ సింగ్ పేరు పరిశీలించినా, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్ తో పోల్చితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సిద్ధూను ఎలాగైనా తమ పార్టీకి మద్దతిచ్చేలా చేసుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. -
ఊహాగానాల నడుమ సిద్ధు భార్య కూడా...!
న్యూఢిల్లీ: క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధు దారిలోనే సాగుతూ ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీకి ఇటీవల సిద్ధు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన.. ఆ పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత కమలానికి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధు చేరవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తనకు భజనచేసే వ్యక్తులను కేజ్రీవాల్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని చెప్తూ ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆవాజ్ ఏ పంజాబ్ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ వచ్చిన ఆఫర్‌ను కూడా తిరస్కరించారు. మొదట ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పిన సిద్ధు.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మళ్లీ రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆప్‌లో సిద్ధు చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సిద్ధు భార్య రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆప్ టికెట్ల కోసం మహిళలపై వేధింపులు!
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో సంక్షోభం ఏర్పడింది. ఢిల్లీ ఎమ్మెల్యే దేవీందర్ సెహ్రావత్‌పై ఆప్ పంజాబ్ మహిళా విభాగం అధ్యక్షురాలు బల్జీందర్ కౌర్ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన రాష్ట్రంలో మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసం పంజాబ్‌లో టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని సెహ్రావత్ ఇటీవలే పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కౌర్ నేతృత్వంలోని బృందం పంజాబ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు పరమ్‌జిత్ కౌర్ లంద్రాను కలిసి సెహ్రావత్‌పై ఫిర్యాదు చేశారు. సెహ్రావత్ లేఖ చూసి తాము చాలా బాధపడ్డామని, పంజాబీ మహిళల పరువు గంగలో కలిపేందుకే ఆయనిలా అంటున్నారని చెప్పారు. ఆధారాలు ఏమీ లేకుండానే సెహ్రావత్ ఇలా అభాండాలు వేయడం తగదని అన్నారు. కల్నల్ సెహ్రావత్‌కు ఏదో ఒక వంకతో ఆప్ నేతలను విమర్శించే అలవాటు ఉందని బల్జీందర్ కౌర్ అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్ అనే ఇద్దరు మహిళలకు టికెట్లు ఇప్పిస్తామని చెప్పి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కల్నల్ సెహ్రావత్ తన లేఖలో పేర్కొన్నారని పరమ్‌జిత్ కౌర్ అన్నారు. ఆయన చేసిన ఆరోపణల ఆధారంగా.. పంజాబ్ డీజీపీకి కూడా లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. -
మాజీ క్రికెటర్‌పై కాంగ్రెస్ వల
బీజేపీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో తగిన స్థానం లభించక ఏం చేయాలోనని కొట్టుమిట్టాడుతున్న మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల విసురుతోంది. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కీలక పాత్ర పోషించడానికి వేరే పార్టీలో చేరాలని సిద్ధూ ప్రయత్నించి.. బీజేపీ నుంచి బయటకు వచ్చారు. తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే.. పంజాబ్‌లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని భావించిన సిద్ధూకు అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది. పంజాబ్ ఎన్నికల కోసం ఆప్ విడుదల చేసే అభ్యర్థుల జాబితాలో తన భార్య పేరు కూడా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధూను కావాలంటే స్టార్ ప్రచారకుడిగా పెడతాం తప్ప ముఖ్యమంత్రి పదవికి మాత్రం ప్రకటించేది లేదని ఆప్ చెప్పేసింది. పైగా, ఒక కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదన్నది తమ పార్టీ విధానమని తెలిపింది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులేమీ లేవు. ఒకే కుటుంబం నుంచి ఎంతమందికైనా టికెట్లు ఇస్తారు కాబట్టి.. సిద్ధూకు తమ పార్టీలో అయితే మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారట. అయితే వాళ్లు కూడా ఆయనను ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రిగా ప్రకటించలేం గానీ, రెండు మూడేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అమృతసర్ లోక్‌సభ స్థానాన్ని కూడా కావాలంటే సిద్ధూ లేదా ఆయన భార్యకు ఇస్తామని చెప్పారంటున్నారు. ప్రస్తుతం అక్కడ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇంకా ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని.. చర్చలకు సిద్ధూ ముందుకు రావాలని చెబుతున్నారు. ఇక ఈ సిక్సర్ల వీరుడు ఎటువైపు మొగ్గుచూపుతాడో చూడాలి.