ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా రోజుకు 14 గంటలు గృహవిద్యుత్ కోత. ఈ శుక్రవారం నుంచి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు. ఆఫీసుల్లో ఏసీల వాడకంపై నిషేధం విధిస్తూ సాక్షాత్తూ ప్రభుత్వ ఆదేశాలు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలంటూ, వీలైనంత ఆదా చేయాలంటూ విజ్ఞప్తులు. ఉష్ణోగ్రతలు పెరిగి, వరి నాట్లు జోరుగా సాగుతున్న వేళ పొలాల్లో కరెంట్ లేదు. ఇంట్లో చమటలు కక్కుతున్నా కనీసం ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదు. చివరకు వ్యవసాయానికి కీలకమైన ఈ సీజన్‌లో పొలాలకూ, ఇళ్ళకూ కరెంట్ సరఫరాను మళ్ళించడం కోసం అక్కడి రాష్ట్ర విద్యుత్ సంస్థ (పీఎస్పీసీఎల్) విద్యుత్తును భారీగా వినియోగించే పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పూర్తిగా తప్పనిసరి విద్యుత్ కోత విధించింది. ఇదీ – పంజాబ్‌లో ఇప్పుడు నెలకొన్న స్థితి. మునుపెన్నడూ అక్కడ చూడని విద్యుత్ సంక్షోభ పరిస్థితి. ‘పంజాబ్ పరిస్థితి దిగజారిపోయింది’ అని ప్రతిపక్ష ‘శిరోమణి అకాలీదళ్’ (ఎస్‌ఏడీ) వీధికెక్కి నిరసనలు చేస్తున్నది అందుకే! పనిలో పనిగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో పాగా వేసేందుకు స్వరం పెంచారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేత– మాజీ క్రికెటర్ నవ జోత్ సింగ్ సిద్ధూ సైతం ‘సరైన దిశలో చర్యలు చేపడితే, పవర్ కట్ అవసరమే లేదు’ అని సవాలక్ష సూచనలిస్తూ, స్వపక్ష సర్కారుపైనే బౌన్సర్లు విసురుతున్నారు. వెరసి, కొద్దినెలల్లో పంజాబ్ ఎన్నికలు జరగాల్సిన వేళ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల నోటా వినిపిస్తున్న మాట ఒకటే – ‘పవర్’! ఇటు ఎలక్ట్రికల్ పవర్, అటు పొలిటికల్ పవర్!! రాజకీయాల్లో కావాల్సినంత అనుభవం ఉన్నప్పటికీ, ఈ ముప్పేటదాడిలో పంజాబ్ పాలకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ చమటలు కక్కుతున్నారు.
అన్నవస్త్రాల లాగానే అన్నిటికీ విద్యుత్ అత్యవసరమైన కాలమిది. గద్దెనెక్కాలనుకొనే పెద్దలెవ రైనా సరే ఇంటికీ, పొలాలకూ, పరిశ్రమలకూ నిరంతరాయమైన విద్యుత్ సరఫరా చేస్తామనేదీ అందుకే! విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ సరఫరా అనేక సందర్భాలలో అన్ని రాష్ట్రాలలో ఓ ఎన్నికల అజెండా. రానున్న పంజాబ్ ఎన్నికలలోనూ అదే కీలక అంశం కానుందని ఈపాటికే అందరికీ అర్థమై పోయింది. అత్యంత సారవంతమైన భూమితో, భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన వ్యవసాయ ఆధారిత పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంకు రైతులే! కానీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృ త్వంలోని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్టుగా వ్యవసాయానికి రోజూ ఎనిమిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది. పెరిగిన ఉష్ణోగ్రతలు, వ్యవసాయ సీజన్ కావడంతో పంజాబ్‌లో విద్యుత్ గిరాకీ ఒక్కసారిగా 14,500 మెగావాట్లకు చేరింది. సరఫ రాకూ, గిరాకీకి మధ్య 1500 మెగావాట్ల లోటు తలెత్తింది. అందువల్లే, ఇప్పుడింత విద్యుత్ కోత.
పంజాబ్ ప్రభుత్వానికి సొంత విద్యుదుత్పాదక కేంద్రాలున్నా, అవి చాలక ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ప్రైవేటులో కొన్న పవర్ వల్ల సహజంగానే అక్కడి ప్రజలపై ఆ భారం పడుతోంది. నెలవారీ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఇక, ఏటా రాష్ట్రంలో విద్యుత్ గిరాకీ సగటున 500 మెగావాట్ల మేర పెరుగుతుంటుంది. లాక్‌డౌన్ వల్ల నిరుడు తగ్గినా, ఈసారి మళ్ళీ గిరాకీ ఉంటుందని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో, పంజాబ్ ప్రజానీకం కరెంట్ కోసం కటకటలాడు తోంది. ఊహించని విపత్తులో పడి సర్కారు విలవిలలాడుతోంది.
ఒకరకంగా ఇది సర్కారీ స్వయంకృతాపరాధమే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వ అజమాయిషీలోని భటిండా సౌర విద్యుత్ కేంద్రాన్నీ, అలాగే రోపార్‌లోని మరో సౌర విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లనూ మూసేసింది. అలా 880 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తగ్గిపోయింది. ఓ లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ చేయకపోగా, అనేక కొత్త యూనిట్ ప్రతిపాదనల్ని కూడా సర్కారు తోసిపుచ్చింది. పోనీ, బయట నుంచి కొందామంటే, రాష్ట్ర విద్యుత్ సంస్థ వద్ద నిధులు లేవు. వ్యవసాయ సబ్సిడీలు, ఆఫీసు కరెంట్ బిల్లులు కలిపి ఆ సంస్థకు రూ. 7 వేల కోట్లు ప్రభుత్వమే బాకీ ఉంది. ఏటా 10 వేల కోట్ల పైగా సబ్సిడీ భారంతో పాటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని లోపాలు, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడంలో అశ్రద్ధ – ఇవన్నీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందమయ్యాయి. వాటిని అరికట్టే రాజకీయ సంకల్పం కొరవడింది.
తప్పు మీద తప్పు చేసిన పంజాబ్ సీఎం అమరీందర్‌కు సొంత పార్టీలోనూ శాంతి లేదు. ఆయన, çస్వపక్షంలో విపక్షమైన సిద్ధూ – ఇద్దరూ పాటియాలా జిల్లాకు చెందినవారే. ఇద్దరూ జాట్ సిక్కులే. కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సిద్ధూ మూన్నాళ్ళ క్రితం ప్రియాంక, రాహుల్‌లను కలుసుకొన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందట. అయినా సరే, సొంత పార్టీ ముఖ్యమంత్రిపై సిద్ధూ బ్యాటింగ్ దాడి కొనసాగిస్తుండడం గమనార్హం. ఇదే అవకాశంగా కేజ్రీవాల్ ఏకంగా దేశం మొత్తంలో పంజాబ్‌లోనే విద్యుత్ ఛార్జీలు ఎక్కువని వాస్తవ విరుద్ధంగా విమర్శించారు. అధికారంలోకొస్తే ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ఉదారంగా హామీ ఇచ్చారు. అమరీందర్ సైతం ఈ మధ్య 70 లక్షల మంది గృహ వినియోగదారులకు లబ్ధి కలిగేలా పవర్ ట్యారిఫ్ కూడా తగ్గించారు. 1965 ఇండో–పాక్ యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉన్న ఈ మాజీ సైనికాధికారికి రానున్న ఎన్నికల యుద్ధం నల్లేరుపై బండి నడక కాదు. ఎన్నికలలో కరెంట్ షాక్ కొట్టకముందే ఆయన, ఆయన పార్టీవారు కళ్ళు తెరుస్తారా అన్నది ప్రశ్న.
Comments
Please login to add a commentAdd a comment