దాడిచేసి, వేధిస్తున్నారు.. లొంగేది లేదు: మోదీ
దాడిచేసి, వేధిస్తున్నారు.. లొంగేది లేదు: మోదీ
Published Fri, Jan 27 2017 4:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
తనపై గత మూడు నెలలుగా పదే పదే దాడి చేస్తూ, వేధిస్తున్నారని, అయినా తాను మాత్రం లొంగేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలంధర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌తో కలిసి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న అకాలీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అయినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు మోదీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగానే జలంధర్ సభలో ఆయన మాట్లాడారు.
ఒక్కసారి 2013-14 నాటి పత్రికలు చూస్తే ఎంత డబ్బు స్కాముల్లో పోయిందో, ఇప్పటి పత్రికలు చూస్తే ఎంత డబ్బు వెనక్కి వస్తోందో తెలుస్తుందని మోదీ చెప్పారు. 70 ఏళ్లుగా తాము దోచుకున్న సంపద మొత్తం కరిగిపోతుంటే కొంతమంది వ్యక్తులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. గత 40 ఏళ్లుగా నానుతున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను తాము అమలుచేశామని చెప్పారు. సింధూ జలాల్లో మనకు న్యాయంగా రావాల్సిన నీటిని తీసుకుని, దాన్ని పంజాబ్‌కు ఇస్తామన్నారు. గత 70 ఏళ్లుగా మనం విధ్వంస రాజకీయాలు చూస్తున్నామని, ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేయాలనుకుంటే అభివృద్ధి చేసి తీరాల్సిందేనని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి బాదల్ తన చేయి పట్టుకుని మార్గదర్శిగా ఉన్నారని, తాను ప్రధాని అయిన తర్వాత తనను కలిసినప్పుడల్లా రైతుల సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని చెప్పారు. ఇన్నేళ్ల ప్రజాజీవితంలో ఆయన ఒక్కసారి కూడా పార్టీ గానీ, సిద్ధాంతాలు గానీ మార్చుకోలేదని ప్రశంసించారు.
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సమాజ్‌వాదీని విమర్శించేదని, ఓటర్లు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంతగా ప్రయత్నించినా, పంజాబ్ ప్రజలు మాత్రం బాదల్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని మోదీ అన్నారు. కొందరు పంజాబ్ పేరు చెడగొట్టాలనుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా పంజాబ్ పేరు చెడగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నారని అన్నారు. అలంటివాళ్లను శిక్షించి, మరోసారి అలా చేయకుండా చూడాలని కోరారు. పంజాబ్ కేవలం ఒక రాష్ట్రం కాదని, దేశం మొత్తంలో పంజాబ్ తిండి తినని పౌరుడు ఒక్కరు కూడా ఉండరని అన్నారు. ఇక్కడి వారు సాధువులు, ధైర్యవంతులు, త్యాగధనులని ప్రశంసించారు.
Advertisement
Advertisement