పంజాబ్ కెప్టెన్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం పంజాజ్ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అభినందనలు తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ విజయంపై స్పందించిన ప్రధాని ఈ సందర్భంగా అమరీందర్ సింగ్‌కు అభినందనలు తెలుపుతూ ట్విట్ చేశారు. అలాగే ఇవాళ అమరీందర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా మోదీ బర్త్‌డే విషెస్ తెలిపారు.
మరోవైపు వరుస ఓటములతో దిగాలుపడిన కాంగ్రెస్‌కు పంజాజ్ ఓటర్లు చేయూత అందించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించడం, పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ విభేదాలు పక్కనబెట్టి అందర్ని కలుపుకుపోవడం, గెలవాలన్న తపన పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించింది. కాగా, రూలింగ్ పార్టీ అకాలీదళ్-బీజేపీ కూటమికి నిరాశే మిగిలింది.
అయితే తన 75వ పుట్టిన రోజు ఇంత ఘనంగా జరుపుకుంటానని బహుశా అమరీందర్ సింగ్ కూడా ఊహించి ఉండరు. గెలుపుపై ధీమా ఉన్నా పక్కలో బల్లెంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ పొడుస్తుందోననే భయం ఆయనలో ఉండకపోలేదు. కాని పంజాబీ ఓటర్లు మాత్రం పటియాల మహారాజుకు ఈ దఫా అధికారం కట్టబెట్టారు.
పదేళ్లుగా అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమిని పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పవనాలు జోరుగా వీచినా ఆ ప్రభావం సర్దార్జీల నేలపై కనిపించలేదు. గెలిచిన తర్వాత అమరీందర్ సింగ్‌లో ఆ ధీమా కనిపించింది.