‘ఆ పార్టీ గెలుపు.. మీడియా సృష్టే’
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ క్రమంగా పుంజుకుంటోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 33శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్‌సింగ్ ’సాక్షి’తో మాట్లాడుతూ.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుస్తుందని వస్తున్న అంచనాలను ఆయన కొట్టిపారేశారు.
ఆప్ గెలుపు మీడియా సృష్టేనని, ఆ పార్టీ గెలువబోదని పేర్కొన్నారు. మల్యా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని పేర్కొన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళి కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా కనిపిస్తున్నదని చెప్పారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార అకాలీదళ్ కూటమి- కాంగ్రెస్-ఆప్ మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.