ఎన్నికలు రెండు, మూడు నెలల్లో ఉన్నాయనగా రాజకీయాలు వేడెక్కడం మామూలు. ఎత్తులు, కొత్త పొత్తులతో రంగస్థలం రంజుగా మారడమూ సాధారణం. కానీ, పంజాబ్‌లో శరవేగంతో మారుతున్న సమీకరణాలు ఎవరూ ఊహించనివి అనే చెప్పాలి. మరోసారి గెలుపు పక్కా అనుకున్న పంజాబ్‌లో కాంగ్రెస్ కష్టాల్లో పడడం, ఆ రాష్ట్రంలో ‘ఆప్’ క్రమంగా పాగా వేస్తుండడం, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన మాజీ సీఎం అమరీందర్ సింగ్‌తో – శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్) అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం, రైతు సంఘాలు కలసి ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం – ఇవన్నీ ఫిబ్రవరి, మార్చిలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రాన్ని చకచకా మార్చేస్తున్నాయి. నిన్నటి దాకా రెండున్నర పార్టీల రణస్థలి లాంటి రాష్ట్రం ఇప్పుడు కొత్త ఆటగాళ్ళతో క్రిక్కిరిసి, ఉత్కంఠ రేపుతోంది.
ఏడాది పైగా సాగిన రైతు ఉద్యమంతో కొత్త సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్న తర్వాత పంజాబ్‌లో జరిగిన తాజా తొలి ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. సోమవారం వెలువడ్డ పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. 2016 నుంచి ఇప్పటి దాకా మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ కార్పొరేషన్‌లో అధికారంలో ఉన్న బీజేపీని రెండో స్థానానికీ, అలాగే కాంగ్రెస్‌ను మూడో స్థానానికీ నెట్టేస్తూ, 35 స్థానాలకు గాను 14 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుపొందింది. 2016 కన్నా బీజేపీ స్కోరు 8 తగ్గి, 12 వార్డుల దగ్గర నిలిచింది. బీజేపీ ప్రస్తుత మేయర్ – ఇద్దరు మాజీ మేయర్లు ఓడిపోవడం, తొలిసారి అక్కడ మునిసిపల్ బరిలోకి దిగుతూనే ‘ఆప్’ పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. ఢిల్లీ ముఖ్యమంత్రి – ‘ఆప్’ సారథి అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో చెప్పాలంటే, ‘‘పంజాబ్‌లో మారుతున్న పరిస్థితులకు ఇది సూచన’’.
ప్రతిసారీ కాంగ్రెస్, బీజేపీల మధ్య సాగే చండీగఢ్ ఎన్నికలు ఈసారి ‘ఆప్’ రాకతో, త్రిముఖ పోటీగా మారడం గమనార్హం. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను పంజాబ్ అంతటికీ బారోమీటర్ అనలేం. కానీ, ఒక్క చండీగఢ్‌లోనే కాదు... రాష్ట్రం మొత్తం మీద కొత్త రాజకీయ ఆటగాళ్ళు పెరిగారు. కొత్త సాగు చట్టాలను నిరసిస్తూ, కేంద్ర బీజేపీ సర్కారుపై పోరాడిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం)లో భాగమైన 22 రైతు సంఘాలు కలసి తాజాగా ‘సంయుక్త సమాజ్ మోర్చా’ (ఎస్‌ఎస్‌ఎం) పేరిట ఓ రాజకీయ పార్టీ పెట్టాయి.
సీనియర్ రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ కొత్త రాజకీయ కూటమి తాలూకు ముఖచిత్రం. పంజాబ్‌లోని 117 స్థానాలకూ పోటీ చేస్తామని ఈ రైతు సంఘాల పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కానీ, కొన్ని రైతు సంఘాల ఈ రాజకీయ రంగ ప్రవేశాన్ని సాక్షాత్తూ వాటన్నిటికీ గొడుగు సంస్థ లాంటి ఎస్కేఎం వ్యతిరేకించింది. ప్రజా ఉద్యమానికి పరిమితులున్నా, అలా కొనసాగినప్పుడు జనంలో ఉండే గౌరవం, ప్రతిష్ఠ వేరు. పార్టీ పెట్టేసరికి ఉద్యమాన్నీ రాజకీయ దృష్టితోనే చూస్తారనేది కొట్టిపారేయలేం. మరి, ఉద్యమం ద్వారా రైతులను ఏకం చేయగలిగిన సంఘాలకు రేపు ఎన్నికలలో ఓట్లు రాలతాయా అన్నది చెప్పలేం.
ఏడెనిమిది నెలల క్రితం పంజాబ్‌లో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కొంత అయోమయంలో పడింది. పంజాబ్ పీసీసీ సారథిగా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను బరిలోకి దింపి, సీఎం స్థానంలోని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పొమ్మనకుండా పొగబెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వమే! తీరా అమరీందర్ ఇప్పుడు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంత కుంపటి పెట్టుకొని, బీజేపీతో కలసి కాంగ్రెస్‌ను మట్టి కరిపించే పనిలోకి సీరియస్‌గా దిగారు. దళిత సిక్కు చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం పీఠమెక్కించి, ఓటర్ల కులసమీకరణాల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారుతుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. మరోపక్క సొంత ప్రభుత్వం పైనే విమర్శల బ్యాట్ జళిపిస్తున్న సిద్ధూ ఆ పార్టీకి చెప్పుకోలేని తలనొప్పిగా తయారయ్యారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం 22 జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలన్నిటిలో జరిగిన తాజా ‘ఔట్‌లుక్ – హన్సా రిసెర్చ్’ పంజాబ్ మనోగతం సర్వేలో సీఎం అభ్యర్థిగా మంచి మద్దతే లభించడం కాంగ్రెస్‌కు కాస్తంత ఊరట.
చతికిలబడ్డ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం – పంజాబ్ బరిలో కీలక అంశాలు కానున్నాయని సర్వేల మాట. అమరీందర్, బీజేపీ నేతలేమో జాతీయ భద్రతను అస్త్రంగా ఎంచు కుంటారు. అందుకే, ఇటీవల జరిగిన పవిత్ర స్థలాల అపవిత్ర యత్నం, నిందితుల్ని కొట్టి చంపడం, బాంబు పేలుడు ఘటనల్లో కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. తగినంత మంది అభ్యర్థులైనా లేని బీజేపీ ఇప్పటికే జాట్ సిక్కు రైతుల కోపానికి గురై, ఎలాగోలా ఉనికి నిలుపు కోవాలని తపిస్తోంది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తమలోకి కలుపుకొనే ప్రయత్నం చేస్తోంది.
ఇక, సర్వం తానే అయిన కేజ్రీవాల్ ప్రచారం చూసి, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలనకు పంజాబీలు సిద్ధపడతారా అన్నదీ ప్రశ్నే. ఏమైనా, కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, బీజేపీ, రైతు పార్టీల పంచముఖ పోరులో ఏ ఒక్క పార్టీకో సొంతంగా మెజారిటీ వస్తుందా అన్నది ఇప్పటికైతే సందేహమే. ముఖచిత్రం మారుతోంది. అనిశ్చితి పెరుగుతోంది. ఓ ‘ఆప్’ ఎమ్మెల్యే అన్నట్టు, చండీగఢ్ మునిసిపల్ ఎన్నికలు రానున్న అసెంబ్లీ పోరుకు ట్రైలర్. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే, సినిమా మరింత ఆసక్తికరంగా ఉండనుంది. దాని కోసం మార్చిలో రిజల్ట్స్ రిలీజ్ దాకా వేచిచూడక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment