
మాజీ క్రికెటర్ సిద్ధూకు కాంగ్రెస్ భారీ ఆఫర్
జలంధర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆవాజ్-ఏ-పంజాబ్ వ్యవస్థాపకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు కాంగ్రెస్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందన్న వార్త అక్కడ సంచలనమైంది. సిద్దూ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలిపితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం ఈ విషయంపై కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ లో చేరాలని వచ్చిన ఆఫర్ ను సిద్ధూ తిరస్కరించగా, తాజాగా డిప్యూటీ సీఎం పోస్ట్ అంటూ ఆయనకు మళ్లీ ఆఫర్ వచ్చింది.
సిద్ధూ తమ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు ఏకంగా ఆయన నెలకొల్పిన ఆవాజ్-ఏ-పంజాబ్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా అమరిందర్ సింగ్ పేరు పరిశీలించినా, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆవాజ్-ఏ-పంజాబ్ తో ఆమ్ ఆద్మీ పార్టీ సంప్రదింపులు జరుపుతోందని ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో సిద్ధూ అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్ తో పోల్చితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సిద్ధూను ఎలాగైనా తమ పార్టీకి మద్దతిచ్చేలా చేసుకోవడంతో పాటు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.