మాజీ క్రికెటర్‌పై కాంగ్రెస్ వల
బీజేపీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో తగిన స్థానం లభించక ఏం చేయాలోనని కొట్టుమిట్టాడుతున్న మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల విసురుతోంది. వచ్చే సంవత్సరం పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కీలక పాత్ర పోషించడానికి వేరే పార్టీలో చేరాలని సిద్ధూ ప్రయత్నించి.. బీజేపీ నుంచి బయటకు వచ్చారు. తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.
అయితే.. పంజాబ్‌లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని భావించిన సిద్ధూకు అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది. పంజాబ్ ఎన్నికల కోసం ఆప్ విడుదల చేసే అభ్యర్థుల జాబితాలో తన భార్య పేరు కూడా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధూను కావాలంటే స్టార్ ప్రచారకుడిగా పెడతాం తప్ప ముఖ్యమంత్రి పదవికి మాత్రం ప్రకటించేది లేదని ఆప్ చెప్పేసింది. పైగా, ఒక కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదన్నది తమ పార్టీ విధానమని తెలిపింది.
అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులేమీ లేవు. ఒకే కుటుంబం నుంచి ఎంతమందికైనా టికెట్లు ఇస్తారు కాబట్టి.. సిద్ధూకు తమ పార్టీలో అయితే మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారట. అయితే వాళ్లు కూడా ఆయనను ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రిగా ప్రకటించలేం గానీ, రెండు మూడేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అమృతసర్ లోక్‌సభ స్థానాన్ని కూడా కావాలంటే సిద్ధూ లేదా ఆయన భార్యకు ఇస్తామని చెప్పారంటున్నారు. ప్రస్తుతం అక్కడ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇంకా ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని.. చర్చలకు సిద్ధూ ముందుకు రావాలని చెబుతున్నారు. ఇక ఈ సిక్సర్ల వీరుడు ఎటువైపు మొగ్గుచూపుతాడో చూడాలి.