
దమ్ముంటే నాపై పోటీ చేయ్: సీఎంకు సవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దమ్ముంటే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ సవాల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ పీసీసీ చీఫ్ అయిన అమరిందర్ సింగ్ ప్రస్తుత ఎన్నికల్లో హస్తానికి పెద్దదిక్కుగా ఉండి.. ప్రచార బాధ్యతలను మోస్తున్నారు. అమరిందర్ లక్ష్యంగా అంతకుముందు కేజ్రీవాల్ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో బలమైన నేతగా పేరొందిన అమరిందర్.. సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, ఆయన సోదరుడు బిక్రం మజిథియా బాదల్ వంటి కీలక నేతలపై పోటీకి దిగుతున్నారా? లేక సురక్షితమైన స్థానం నుంచి నిలబడాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. కేజ్రీవాల్ ట్వీట్లపై అమరిందర్ ఘాటుగా స్పందించారు. బాదల్ యుగం పంజాబ్‌లో ఎప్పుడో ముగిసిపోయిందని, ఆప్ అధినేత కేజ్రీవాల్ దమ్ముంటే పంజాబ్‌లో ఎక్కడ పోటీచేస్తున్నారో చెప్పాలని, అక్కడ తాను పోటీ సిద్దమని స్పష్టం చేశారు. అంతకుముందు అమరిందర్ మాట్లాడుతూ బాదల్ కుటుంబంతో కేజ్రీవాల్ కుమ్మక్కు అయ్యారని, అందుకే లాంబింగ్ నియోజకవర్గంలో సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు వ్యతిరేకంగా బలహీనమైన అభ్యర్థి (జర్నైల్‌సింగ్)ను కేజ్రీవాల్ ప్రకటించారని మండిపడ్డారు.